హోమ్ మేకర్​కు వేతనం ఎప్పుడు?

హోమ్ మేకర్​కు వేతనం ఎప్పుడు?

రష్యాలో 1917 లో బ్రేడ్ అండ్ పీస్ నినాదంతో మహిళా ఉద్యోగులు సమ్మె చేసారు. అది మార్చి 8 కావడంతో ఆరోజు మహిళా దినోత్సవం అన్నారు. యుఎన్ మొదటి మహిళా దినోత్సవంను1975 నుంచి ప్రారంభించింది. మన దేశంలోనూ మార్చి 8 ననే మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. మహిళల హక్కుల మీద క్లారా జెట్ కిన్ గొంతు ఎత్తడం జరిగింది.1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్ జర్ల్యాండ్ లలో ఉమెన్స్ డే ప్రారంభించారు. ప్రపంచంలో కోట్లాది మంది గృహిణులకు వేతనం ఎందుకు ఉండకూడదు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. చైనాలోని బీజింగ్ లో ఒక విడాకుల కేసులో కోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పు మీద ఇప్పుడు చర్చ విస్తారంగా జరగడానికి కారణం అయింది.

మహిళ పనిగంటలే ఎక్కువ

ఇంటిపనులు, పిల్లల పెంపకం, సంరక్షణ తదితరములు చూసే గృహిణులకు, జీతాలు ఎవరు ఇవ్వాలి అనేదే సమస్య.  భారతదేశంలో 16 కోట్లమంది గృహిణులు ఉన్నారు. వీరు హోమ్ మేకర్స్. పురుషుల కన్నా 3 నుంచి 4 గంటలు ఎక్కువ పని చేసే వారు.  చెమటోడ్చే  వారన్న మాట. అన్నం, కూరలు వండడం,  క్లీనింగ్ పనులు, పిల్లల, భర్త బట్టలు ఉతకడం, ఇంకా ఎన్నో కుటుంబలోని పనులు, తల్లి, భార్య,  సోదరి పాత్రలో ఉండి పనిచేస్తుంది.  సంతానంలో పురుషుడినే వారసుడిగా పిలుస్తారు. తమిళనాడులో గృహిణికి వేతనం అంశం సినీనటుడు కమలహాసన్ తన మేనిఫెస్టో లో పార్టీ తరపున పెట్టారు. ఇది కూడా గత ఏడాది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజింగ్ కోర్ట్ తీర్పులో 5 ఏండ్లు  భర్త తో ఉండి, ఇంటి పనులు చూసుకున్నది కాబట్టి, తన కెరియర్ ను కోల్పోయింది కాబట్టి, రూ.5 లక్షల పై చిలుకు పరిహారం జీతం కింద ఇవ్వాలని పేర్కొంది. ఈ తీర్పును ప్రపంచం మొత్తంలో 60 కోట్లకు పైగా మంది సోషల్ మీడియాలో చూసిన దాఖలాలు ఉన్నాయి. గ్రామీణ మహిళ ప్రతి రోజు14గంటలు పనిలో ఉంటుంది. గ్రామీణ పురుషుల తో పోలిస్తే 2.5 గంటలు ఇది ఎక్కువ. ఉద్యోగం చేసే పురుషులకన్నా,  మహిళలు నాలుగింతలు పని ఎక్కువ.   అయినా ఈ పనులకు విలువ లేదు. గౌరవం లేదు. పైగా వేధింపులు. అత్యా చారాలు, హత్యాచారాలు.  రిజిస్టర్ అవుతున్న కేసులే అందుకు సాక్ష్యం. పురుషుల ఆలోచనా విధానంలో మార్పురావాలంటే  హోమ్ మేకర్లకు జీతం ఇవ్వాలి . అపుడైనా కుటుంబంలో, సమాజంలో  గౌరవం దక్కుతుంది.

మహిళా ప్రాతినిధ్యం పెరగాలి

మహిళా దినోత్సవాల సందర్భంగా పలు ప్రభుత్వ దాష్టికాలకు వ్యతిరేకంగా, తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు  చేపట్ట డానికి ప్రతిన బూనాలి. పూనమ్ పాండే లాంటి  జాతీయ  షూటర్ ఉద్యమం ప్రారంభం నుంచి బోర్డర్లలోనే ఉండి మద్దతు తెలిపారు. సీపీఎం నాయకురాలు బృందాకారత్ పేదల ఇండ్లు కూల్చుతున్న బుల్ డోజర్లకు అడ్డంగా నిలబడ్డారు. నవదీప్ కౌర్ లాంటి సామాజిక కార్యకర్తలు, దిశా రవి లాంటి వారు నిర్బందాలను ఎదుర్కొన్నారు.  మహిళా హక్కుల పరిరక్షణ కోసం గృహ హింస కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఎన్నికల్లో ను పోటీ చేస్తున్నారు. గెలుస్తున్నారు. పదవుల్లో అరకొరగా మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం గా ఉన్న దీదీ మమతా బెనర్జీ అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి తృణమూల్ కాంగ్రెస్ నుంచి 50 మంది మహిళలకు టిక్కెట్లు ఇవ్వడం జరిగింది. యూపీ లోనూ జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 40 శాతం మంది మహిళలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కూడ పార్టీలు ఈ ఏడాది జరుగనున్న అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దిశన ప్రయాణించాల్సిన అవసరం ఉంది.  ప్రతి దినం మహిళల దినమే! అమ్మల్లారా మీకు వందనం! మీ పాద పాదాన పరి, పరి దండాలు.

- ఎండి. మునీర్, సీనియర్ జర్నలిస్ట్