కంపెనీలకు దండిగా లాభాలు.. జీడీపీ వృద్ధి కంటే మూడు రెట్లు పెరుగుదల

కంపెనీలకు దండిగా లాభాలు.. జీడీపీ వృద్ధి కంటే మూడు రెట్లు పెరుగుదల
  • 2020 నుంచి దూసుకెళ్తున్న ఆదాయాలు.. వెల్లడించిన ఐకానిక్​ వెల్త్

న్యూఢిల్లీ: మనదేశ కార్పొరేట్​ కంపెనీలు 2019–20 ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా సంపాదిస్తున్నట్టు వెల్లడయింది. వీటి నికర లాభం (బాటమ్ లైన్) జీడీపీ వృద్ధి కంటే దాదాపు 3 రెట్లు వేగంగా పెరిగింది. దీనికి జీఎస్టీ  ఫార్మలైజేషన్​,  తక్కువ రుణ భారం కారణమని ఐకానిక్​ వెల్త్​ ​విడుదల చేసిన చార్ట్​ బుక్​రిపోర్ట్ ​పేర్కొంది. దీని ప్రకారం.. 2020 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో కార్పొరేట్ లాభం 1.9శాతం ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.9శాతానికి పెరిగింది. 

ఇక ముందు మరింత వృద్ధికి అవకాశం ఉంది. 2024లో అమెరికాలో జీడీపీలో కార్పొరేట్ లాభం 16శాతం ఉంది. అంతర్జాతీయ మూలధనం, టెక్నాలజీ,  తయారీ సామర్థ్యం పెరుగుదల కార్పొరేట్ల లాభాలను భారీగా పెంచాయి. కరోనా అనంతర కాలంలో, నిఫ్టీ 500 ఆదాయ మిశ్రమం మారింది. బీఎఫ్​ఎస్​ఐ వాటా 2020 ఆర్థిక సంవత్సరంలో 20.2శాతం నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 39శాతానికి పెరిగింది. 

ఇదే కాలంలో ఆటోమొబైల్స్ 4.1శాతం నుంచి 6.8శాతానికి పెరిగింది. టెక్నాలజీ (17.9శాతం నుంచి 8.5శాతం),  ఆయిల్ అండ్​ గ్యాస్ (15.7శాతం నుంచి 10.7శాతం)  కెమికల్స్ అండ్​ ఫార్మాస్యూటికల్స్ (10.6శాతం నుంచి 5.7శాతం) తమ వాటాలను తగ్గించుకున్నాయి. మెటల్స్,  యుటిలిటీస్ వరుసగా 7శాతం  5శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.

బ్యాంకులకు ఇబ్బందులు

అధిక క్రెడిట్​–డిపాజిట్​ నిష్పత్తులు,  అన్​సెక్యూర్డ్​ లోన్ల ఒత్తిడి కారణంగా బ్యాంకుల లోన్ల వృద్ధి మందగించింది. వడ్డీ రేటు కోతలు,  కార్పొరేట్ డిమాండ్ పుంజుకున్నందున ప్రస్తుత  ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో మార్జిన్ ఒత్తిడి తగ్గవచ్చు.  బ్యాంకులు లేదా ఇతర వనరుల నుంచి డబ్బు అప్పుగా తీసుకోవడానికి అయ్యే ఖర్చు (వడ్డీ రేట్లు) తగ్గుతాయి. గృహ నిర్మాణ ఆర్థిక సంస్థలు (హెచ్‌ఎఫ్​సీలు), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్​బీఎఫ్​సీలు) డబ్బును తక్కువ వడ్డీకి పొందగలుగుతాయి. 

దీనివల్ల అవి రుణాలు ఇచ్చి సంపాదించే లాభాలు (వడ్డీ రేట్ల మధ్య తేడా) స్థిరంగా ఉంటాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న స్థూల ఆర్థిక పరిస్థితులు (ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం వంటివి) కారణంగా, ఐటీ  కంపెనీలు తప్పనిసరి కాని ఖర్చులను ప్రస్తుతానికి నిలిపివేశాయి లేదా వాయిదా వేశాయి. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఏడాదికి, నిఫ్టీ 500 ఆదాయం ఏడు శాతం పెరిగింది.  ఆపరేటింగ్ లీవరేజ్,  మార్జిన్ విస్తరణ కారణంగా నికర లాభం వేగంగా పెరిగింది. 

సెగ్మెంటల్‌‌గా చూస్తే, మిడ్‌‌క్యాప్‌‌లు,  స్మాల్‌‌క్యాప్‌‌లు.. లార్జ్‌‌క్యాప్‌‌లను అధిగమించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఎన్​బీఎఫ్​సీలు, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్,  హెల్త్‌‌కేర్ కంపెనీలు రెండు -అంకెల ఆదాయం, ఇబిటా వృద్ధిని సాధించాయి. ప్రభుత్వ మూలధన వ్యయం, బలమైన గ్రామీణ వినియోగం,  చైనా ప్లస్​1 థీమ్ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కంపెనీలకు బలమైన వృద్ధి ఉండొచ్చని ఈ రిపోర్ట్​ పేర్కొంది.