
డబ్బుతో సుఖం కొనలేమని పెద్దలు తరచూ చెబుతుంటారు. ఒక టెకీ అనుభవం ఈ మాటను బలపరుస్తోంది. 15 ఏళ్లుగా టెక్ రంగంలో పని చేసిన తన బ్యాంక్ అకౌంట్లో సుమారు రూ.36 కోట్లు కూడబెట్టుకున్నట్లు చెప్పాడు. అయినప్పటికీ సంతోషకరమైన జీవితం లేదంటూ జీవితపు మరో బాధాకరమైన కోణాన్ని బయటపెట్టాడు.
మార్కెట్‌లో చిన్న మార్పులు జరిగినా తాను ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న సంపద క్షణాల్లో తగ్గిపోతున్నట్టే అనిపిస్తుందని చెప్పారు. ఈ ఆందోళన వల్ల డిప్రెషన్, టెన్షన్ కు గురై ప్రస్తుతం Lexapro అనే మెడిసిన్స్ వాడుతున్నట్టు చెప్పాడు. అంతకుముందు తాను కాలేజీలో చదువుకుంటూ సర్వర్ ఉద్యోగం చేసినప్పుడు కాస్త కష్టమైనా ఆనందంగా ఉండేవాడినని.. అయితే ప్రతినెల వచ్చే ఆదాయంపైనే జీవించటం ఒక్కటే కష్టంగా అనిపించేందని చెప్పాడు టెక్కీ.
బ్లైండ్ యాప్‌లో టెక్కీ పోస్ట్ చూసిన చాలామంది తమ అనుభవాలు పంచుకున్నారు. ఎవరో “నా ఖాతాలో 10,000 డాలర్లు ఉన్నప్పుడు జీవితం బాగా సేఫ్‌గా అనిపించిందని, కానీ ఇప్పుడు మిలియన్ డాలర్ల విలువ ఉన్నప్పటికీ మరింత టెన్షన్ గా ఉన్నాను” అని అన్నారు. మరొకరు “డబ్బు తప్ప మరేం లేకపోతే నిండుదనం దొరకదు, జీవితంలో ఒక ప్రయోజనం, అర్థం కనుక్కో” అని సూచించారు. మరొకరు మెటా కంపెనీలో సగం మంది ఉద్యోగులు టెన్షన్ కి సంబంధించిన మందులపై ఆధారపడి ఉన్నారని మారుతున్న జాబ్ మార్కెట్ చాలా మందిని ఆందోళనకు గురిచేస్తోందని సదరు వ్యక్తి కామెంట్ చేశారు.
►ALSO READ | పక్కన నేపాల్ దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు కదా : సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు
ఇక్కడ ముఖ్యమైన అంశం ఏమిటంటే డబ్బు.. మనిషికి భద్రత, సౌకర్యాలను ఇవ్వగలదు కానీ నిజమైన సంతోషం లేదా మానసిక ప్రశాంతతకు హామీ ఇవ్వదని అనుభవం నేర్పిస్తుంది. డబ్బు పెరిగేకొద్దీ బాధలు కూడా పెరుగుతాయి. చిన్నప్పటి లోటుపాట్ల మధ్యన సంతోషం సులభంగా దొరికేదేమో కానీ పెద్దవ్యక్తిగా బాధ్యతలు పెరిగిన కొద్దీ భయం, ఆందోళన వెంటాడుతాయి. అలాగే మనిషి జీవితంలో కేవలం ఆర్థిక విజయమే కాకుండా అర్థవంతమైన సంబంధాలు, వ్యక్తిగత సంతృప్తి, సామాజిక అనుబంధం కూడా అవసరమేనని గ్రహించాలి. డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే కానీ అది అంతిమ లక్ష్యం కాదని గుర్తించాలి.