ఇండియా వర్సెస్‌‌‌‌‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌

ఇండియా వర్సెస్‌‌‌‌‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌

పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని క‌‌‌‌‌‌‌‌రాచీ స్టేడియం కిక్కిరిసిపోయింది. ఇంకాసేప‌‌‌‌‌‌‌‌ట్లో ఇండియా -– పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్. సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఐదో వ‌‌‌‌‌‌‌‌న్డే. అప్పటికి ఇండియా రెండు, పాక్ రెండు మ్యాచ్​లు గెలిచేశాయ్‌‌‌‌‌‌‌‌. అస‌‌‌‌‌‌‌‌లు సిస‌‌‌‌‌‌‌‌లైన‌‌‌‌‌‌‌‌ ఆఖ‌‌‌‌‌‌‌‌రి పోరుకు రంగం సిద్ధం. ఇంత‌‌‌‌‌‌‌‌కంటే.. మ‌‌‌‌‌‌‌‌జా ఏముంటుంది ఆట‌‌‌‌‌‌‌‌లో..?సా... చీ.....న్‌‌‌‌‌‌‌‌...  సా... చీ.... న్‌‌‌‌‌‌‌‌... స‌‌‌‌‌‌‌‌చిన్ పోస్టర్లు, త్రివ‌‌‌‌‌‌‌‌ర్ణ ప‌‌‌‌‌‌‌‌తాకాల్ని రెప‌‌‌‌‌‌‌‌రెప‌‌‌‌‌‌‌‌లాడిస్తూ మార్మోగుతోంది మైదానం. మ్యాచ్ జ‌‌‌‌‌‌‌‌రుగుతోంది పాక్​లో కాదు.. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అంటే న‌‌‌‌‌‌‌‌మ్మేస్తారెవ‌‌‌‌‌‌‌‌రైనా. అలా ఉంది పరిస్థితి. 

‘‘టాస్ వేసేసుంటారేమో.... ” గ్యాల‌‌‌‌‌‌‌‌రీలో సీటు వెతుక్కుంటూ నాలో నేనే  గొణుక్కున్నా.
‘‘కాస్త ముందు బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ల్దేర‌‌‌‌‌‌‌‌దామంటే వినలేదు...’’ చిరాకుగా అంది నా భార్యామ‌‌‌‌‌‌‌‌ణి ముణెమ్మ.
త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌కు ఇక్కడికి రావ‌‌‌‌‌‌‌‌డం ఇష్టం లేదు. ప‌‌‌‌‌‌‌‌ట్టుబ‌‌‌‌‌‌‌‌ట్టి ఫ్లైట్ ఎక్కించా. అందుకే వీలు చిక్కిన‌‌‌‌‌‌‌‌ప్పుడ‌‌‌‌‌‌‌‌ల్లా నాపై రుసరుస‌‌‌‌‌‌‌‌లాడుతూనే ఉంది.
 ‘‘అదిగో.. అక్కడే మ‌‌‌‌‌‌‌‌న సీట్లు...’’ నాలో ఉత్సాహం త‌‌‌‌‌‌‌‌న్నుకొచ్చింది. ఆ జ‌‌‌‌‌‌‌‌నాన్ని తోసుకుంటూ.. ఇద్దరం సీట్లలో సెటిలైపోయాం.
‘‘పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ వాన్ ద టాస్‌‌‌‌‌‌‌‌.. అండ్ ఎలక్టెడ్ టు ఫీల్డ్” మైదానంలో స్పీక‌‌‌‌‌‌‌‌ర్లు గోల పెట్టాయి.
‘‘టాస్ గెలిస్తే బాగుండు క‌‌‌‌‌‌‌‌దా. ఈ గంగూలీ ఒక‌‌‌‌‌‌‌‌డు.. అస్తమానూ టాస్ ఓడిపోతుంటాడు’’ అప్పుడే మ్యాచ్ పోయినంత బాధొచ్చేసింది నాకు.
 ‘‘ఇంత గోల‌‌‌‌‌‌‌‌లో, ఈ మ్యాచ్ చూడ‌‌‌‌‌‌‌‌డం అవ‌‌‌‌‌‌‌‌స‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మా? టీవీ ముందు కూర్చుంటే స‌‌‌‌‌‌‌‌రిపోయేది క‌‌‌‌‌‌‌‌దా. పైగా క‌‌‌‌‌‌‌‌రాచీలో హిందూ దేవాల‌‌‌‌‌‌‌‌యాలు చాలానే ఉన్నాయట. అవ‌‌‌‌‌‌‌‌న్నీ చూసేవాళ్లం..’’ అంది ముణెమ్మ.
‘‘ఇండియా– పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్, స్టేడియంలో చూడాల‌‌‌‌‌‌‌‌న్న కోరిక నీదీ, నాదీ కాదు. నీ కొడుకుది. మ‌‌‌‌‌‌‌‌ర్చిపోయావా?’’
కొడుకుని గుర్తు చేసేస‌‌‌‌‌‌‌‌రికి ఆమె మొహం చిన్నబోయింది. 
‘‘స‌‌‌‌‌‌‌‌ర్లే.. ప‌‌‌‌‌‌‌‌క్కనే అమ్మవారి గుడి ఉంద‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌. వెళ్తూ వెళ్తూ.. దండం పెట్టుకుందామ’’ని టాపిక్ మార్చేశా.
భార‌‌‌‌‌‌‌‌త్‌‌‌‌‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఆట‌‌‌‌‌‌‌‌గాళ్లంతా.. మైదానంలో నిల‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌డ్డారు. జాతీయ గీతాల ఆలాప‌‌‌‌‌‌‌‌న కోసం. ‘‘జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ణ అధినాయ‌‌‌‌‌‌‌‌క జ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌హే.. భార‌‌‌‌‌‌‌‌త భాగ్య విధాత‌‌‌‌‌‌‌‌..’’ స్టేడియంతో పాటు నేను, నాతో పాటు స్టేడియం పాడుతోంది.  దాయాది గ‌‌‌‌‌‌‌‌డ్డ మీద‌‌‌‌‌‌‌‌.. మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ జ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌.. ఆట‌‌‌‌‌‌‌‌కు మాత్రమే సాధ్యమ‌‌‌‌‌‌‌‌య్యే అద్భుత‌‌‌‌‌‌‌‌మిది. ‘‘పంజాబ సింధు గుజ‌‌‌‌‌‌‌‌రాట‌‌‌‌‌‌‌‌ మ‌‌‌‌‌‌‌‌రాఠా..’’ రోమాలు నిక్కబొడుస్తున్నాయి.
‘‘జైహింద్‌‌‌‌‌‌‌‌’’ అంటూ ఉద్వేగ భ‌‌‌‌‌‌‌‌రితంగా సెల్యూట్ చేసి, ప‌‌‌‌‌‌‌‌క్క సీటువైపు చూశా. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ జెండా ప‌‌‌‌‌‌‌‌ట్టుకుని ఓ వ్యక్తి న‌‌‌‌‌‌‌‌న్నే చూస్తున్నాడు. నా అంత వ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌సుంటుందేమో?  తెల్లని కుర్తా, పైజామా. క‌‌‌‌‌‌‌‌ళ్లకు సుర్మా. నెత్తిమీద టోపీ. ‘నికార్సయిన‌‌‌‌‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ముస‌‌‌‌‌‌‌‌ల్మాన్ ఎలా ఉంటాడ‌‌‌‌‌‌‌‌’ని అడిగితే.. అత‌‌‌‌‌‌‌‌న్ని చూపించొచ్చు. ఇద్దరి చూపులూ ఓసారి గాల్లోనే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నాయి.

‘‘పాక్ స‌‌‌‌‌‌‌‌ర్ జ‌‌‌‌‌‌‌‌మీన్ షాద్ బాద్‌‌‌‌‌‌‌‌... కిస్వారే హ‌‌‌‌‌‌‌‌సీన్‌‌‌‌‌‌‌‌.. షాద్ బాద్‌‌‌‌‌‌‌‌’’-  ఈసారి పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ జాతీయ గీతం మార్మోగింది.ఆట మొద‌‌‌‌‌‌‌‌లైంది. స‌‌‌‌‌‌‌‌చిన్ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌, వీరేంద్ర సెహ్వాగ్ క్రీజ్‌‌‌‌‌‌‌‌లోకి వ‌‌‌‌‌‌‌‌చ్చారు. ప్రపంచంలోనే అత్యుత్తమ జోడీల్లో ఒక‌‌‌‌‌‌‌‌టి. ఇద్దర్లో ఎవ‌‌‌‌‌‌‌‌రు కుదురుకున్నా.. భారీ స్కోరు ఖాయం. బౌలింగ్ చేస్తోంది ఎవ‌‌‌‌‌‌‌‌రు?’’ క‌‌‌‌‌‌‌‌ళ్లద్దాలు స‌‌‌‌‌‌‌‌రి చేసుకుంటూ అడిగా. మా ఆవిడ చెప్పింది నిజ‌‌‌‌‌‌‌‌మే. నా కంటి చూపు మ‌‌‌‌‌‌‌‌రీ మంద‌‌‌‌‌‌‌‌గించింది. ‘‘నాకు మ‌‌‌‌‌‌‌‌న స‌‌‌‌‌‌‌‌చినూ, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌లో ఇంజుమామూ త‌‌‌‌‌‌‌‌ప్ప ఇంకెవ్వరూ తెలీదు. అందుకే టీవీలో చూద్దాం అన్నది.. అక్కడైతే..’’ మ‌‌‌‌‌‌‌‌ళ్లీ పాత పాటే మొద‌‌‌‌‌‌‌‌లెట్టింది.

‘‘ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ అహ్మద్‌‌‌‌‌‌‌‌’’ ప‌‌‌‌‌‌‌‌క్క సీటు పాకిస్తానీ చెప్పాడు.‘‘ఓహ్‌‌‌‌‌‌‌‌..’’ అంటూ త‌‌‌‌‌‌‌‌లూపా‌‌‌‌‌‌‌‌.తొలి బంతి నుంచే విరుచుకుప‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌డం సెహ్వాగ్‌‌‌‌‌‌‌‌కు అల‌‌‌‌‌‌‌‌వాటు. ఈసారీ అదే చేశాడు. ష‌‌‌‌‌‌‌‌బ్బీర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో అద్భుత‌‌‌‌‌‌‌‌మైన క‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ర్ డ్రైవ్ ఆడాడు. ఫోర్‌‌‌‌‌‌‌‌.. స్టేడియం మొత్తం క‌‌‌‌‌‌‌‌రెంటు పాకేసింది. 

‘‘సెహ్వాగ్ .. సూప‌‌‌‌‌‌‌‌ర్ షాట్‌‌‌‌‌‌‌‌...’’ అని గ‌‌‌‌‌‌‌‌ట్టిగా అరిచా.
‘‘షాట్ కొట్టింది సెహ్వాగ్ కాదు. స‌‌‌‌‌‌‌‌చిన్‌‌‌‌‌‌‌‌’’ టీజ్ చేస్తున్నట్టు అన్నాడు పాకిస్తానీ. నా కంటి చూపుకి ఒకే రోజు ఇన్ని అవ‌‌‌‌‌‌‌‌మానాలా?.. ఎవ‌‌‌‌‌‌‌‌రైతే ఏంటి..?  గుడ్ బిగినింగ్‌‌‌‌‌‌‌‌. ఇది చాలు... అనుకున్నా.
స‌‌‌‌‌‌‌‌చిన్ బౌండ‌‌‌‌‌‌‌‌రీలు బాదుతున్నప్పుడ‌‌‌‌‌‌‌‌ల్లా.. నేను లేచి గోల చేయ‌‌‌‌‌‌‌‌డం.. ప‌‌‌‌‌‌‌‌క్కకున్న పాకిస్తానీ చూడడం...
‘‘సెహ్వాగ్ ఈసారి సెంచ‌‌‌‌‌‌‌‌రీ చేస్తాడు చూడు’’ మా ఆవిడ వైపు చూస్తూనే, పాకిస్తానీ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌కి వినిపించాల‌‌‌‌‌‌‌‌నే ఉద్దేశంతో అన్నా. 
ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ అహ్మద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో సెహ్వాగ్ బ్యాట్​ అంచుని ముద్దాడుతూ.. మొయిన్ ఖాన్ గ్లౌజుల్లోకి బంతి వెళ్లింది.
‘‘అవుట్‌‌‌‌‌‌‌‌’’
సెహ్వాగ్ అవుట్‌‌‌‌‌‌‌‌... నా ప‌‌‌‌‌‌‌‌క్కనున్న ఫ్యాన్‌‌‌‌‌‌‌‌.. నావైపు విజ‌‌‌‌‌‌‌‌య గ‌‌‌‌‌‌‌‌ర్వంతో చూస్తూ, పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ జెండాని నా క‌‌‌‌‌‌‌‌ళ్ల ముందే రెపరెప‌‌‌‌‌‌‌‌లాడించాడు.
ఏమిటీ ప‌‌‌‌‌‌‌‌రాభ‌‌‌‌‌‌‌‌వం. పోన్లే.. స‌‌‌‌‌‌‌‌చిన్ ఉన్నాడు క‌‌‌‌‌‌‌‌దా?  ‘‘పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ని ఓడించ‌‌‌‌‌‌‌‌డానికి స‌‌‌‌‌‌‌‌చిన్ ఒక్కడు చాలు’’ అంటూ ఈసారి పాకిస్తానీ ఫ్యాన్ వైపు చూస్తూ అన్నా. 
వ‌‌‌‌‌‌‌‌న్ డౌన్‌‌‌‌‌‌‌‌లో ల‌‌‌‌‌‌‌‌క్ష్మణ్ వ‌‌‌‌‌‌‌‌చ్చాడు.  అక్తర్ బంతులు బుల్లెట్స్​లా దూసుకెళ్తున్నాయి. కాసేప‌‌‌‌‌‌‌‌టికి మరో షాక్‌‌‌‌‌‌‌‌. స‌‌‌‌‌‌‌‌చిన్ కూడా అవుట్‌‌‌‌‌‌‌‌! అంతే.. నాతో పాటు ఇండియ‌‌‌‌‌‌‌‌న్స్ కూడా మొహాలు వేలాడేశారు.
‘‘రాజే ఒరిగిపోతే.. యుద్ధం ఉంటుందా?  మ్యాచ్ పోయింది’’ ఉసూరుమ‌‌‌‌‌‌‌‌నిపించింది. నా ప‌‌‌‌‌‌‌‌క్కనున్న పాకిస్తానీ సంగ‌‌‌‌‌‌‌‌తి చెప్పక్కర్లే. త‌‌‌‌‌‌‌‌న విజ‌‌‌‌‌‌‌‌యానందం చూడలేక మొహం తిప్పుకున్నా.
గంగూలీ బ్యాట్ ప‌‌‌‌‌‌‌‌ట్టుకుని రంగంలోకి దిగాడు. ఫామ్‌‌లో లేక తంటాలు ప‌‌‌‌‌‌‌‌డుతున్న గంగూలీపై న‌‌‌‌‌‌‌‌మ్మకం పెట్టుకోకూడ‌‌‌‌‌‌‌‌దు. ఇక ఆదుకోవాల్సింది ల‌‌‌‌‌‌‌‌క్ష్మణుడే. ఇద్దరూ మెల్లగా స్కోరు బోర్డుని గాడిలో పెడుతున్నారు. బౌండ‌‌‌‌‌‌‌‌రీలు కొడుతున్నప్పుడ‌‌‌‌‌‌‌‌ల్లా నేనూ.., వికెట్లు తీస్తున్నప్పుడ‌‌‌‌‌‌‌‌ల్లా నా ప‌‌‌‌‌‌‌‌క్క సీటు పాకిస్తానీ.. సంబురాలు చేసుకుంటున్నాం.
మైదానంలో భార‌‌‌‌‌‌‌‌త్–- పాక్.. గ్యాల‌‌‌‌‌‌‌‌రీలో నేనూ– అత‌‌‌‌‌‌‌‌ను. రెండు దేశాల ఆట కాస్త‌‌‌‌‌‌‌‌.. ఇద్ద‌‌‌‌‌‌‌‌రు వ్య‌‌‌‌‌‌‌‌క్తుల ఆట‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది. చివ‌‌‌‌‌‌‌‌రికి ఇండియా మంచి స్కోరే చేసింది. 50 ఓవ‌‌‌‌‌‌‌‌ర్ల‌‌‌‌‌‌‌‌లో 293. ‘‘గెలిపించే స్కోరే’’ స‌‌‌‌‌‌‌‌గం జ్ఞానంతో అన్నా. మా ఆవిడ గొంతులో కూడా ధీమా వ‌‌‌‌‌‌‌‌చ్చేసింది.
‘‘పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఏ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆసాన్ సే జీత్ స‌‌‌‌‌‌‌‌క్తీ’’ ఆ ముసల్మాన్‌‌‌‌‌‌‌‌ నా వైపే చూస్తూ అన్నాడు.
సెకండ్ ఇన్నింగ్స్ మొద‌‌‌‌‌‌‌‌లైంది. మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో బంతులు విసిరారు. ఇర్ఫాన్.. అద‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌గొట్టేశాడు. వంద ప‌‌‌‌‌‌‌‌రుగుల‌‌‌‌‌‌‌‌కే ఆరు వికెట్లు. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఖేల్ ఖ‌‌‌‌‌‌‌‌తం. వికెట్ ప‌‌‌‌‌‌‌‌డిన‌‌‌‌‌‌‌‌ప్పుడ‌‌‌‌‌‌‌‌ల్లా అరిచి.. గోల చేశా. ‘‘ఏంటి ఈ రోజు మీరు మ‌‌‌‌‌‌‌‌రీ చిన్న పిల్లాడైపోయారు’’ అని న‌‌‌‌‌‌‌‌వ్వుతూ అంది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌. ఆ ఆనందం ఇండియా గెలుస్తున్నందుకు కాదు. ఈ ప‌‌‌‌‌‌‌‌క్కనున్న పాకిస్తానీపై నేను గెలుస్తున్నందుకు. మ్యాచ్ పూర్త‌‌‌‌‌‌‌‌య్యింది. అనుకున్నట్టే ఇండియా సునాయాసంగా గెలిచింది. సిరీస్‌‌ని గెలుచుకున్న గంగూలీ క‌‌‌‌‌‌‌‌ప్‌‌‌‌‌‌‌‌ని ముద్దాడేంత వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ... నేనూ, ముణెమ్మ మైదానం వ‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ల్లేదు. ప‌‌‌‌‌‌‌‌క్కనున్న పాకిస్తానీ ఫ్యాన్ ఎప్పుడో గాయబ్‌‌‌‌‌‌‌‌.
‘‘ఈ మూమెంట్‌‌‌‌‌‌‌‌ చూడ్డానికే.. అంత దూరం నుంచి ఇక్కడికి వ‌‌‌‌‌‌‌‌చ్చాం’’ అంటూ ముణెమ్మ భుజంపై చేయి వేసి ద‌‌‌‌‌‌‌‌గ్గర‌‌‌‌‌‌‌‌కు తీసుకున్నా. ఆ ఆనందంలోనే స్టేడియం నుంచి బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌చ్చాం. పాక్ ఓడిపోయింద‌‌‌‌‌‌‌‌న్న బాధ‌‌‌‌‌‌‌‌ అక్కడున్న ప్రతి ఒక్కరిలో క‌‌‌‌‌‌‌‌నిపిస్తోంది.
‘‘త‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌నొప్పిగా ఉంది. టీ తాగుదామా’’ అంది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌. ఓ కేఫ్ ముందు ఆగి.. రెండు క‌‌‌‌‌‌‌‌ప్పులు అందుకున్నా. స‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌న్‌‌గా చినుకులు మొద‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌య్యాయి.
‘‘టీతో పాటు ఈ బిస్కెట్స్ తినండి. బాగుంటాయి.’’ స్వ‌‌‌‌‌‌‌‌చ్ఛ‌‌‌‌‌‌‌‌మైన ఉర్దూలో ఓ గొంతు వినిపించింది. ఇద్ద‌‌‌‌‌‌‌‌రం వెన‌‌‌‌‌‌‌‌క్కి తిరిగి చూశాం. ఆ పాకిస్తానీ ఫ్యాన్ క‌‌‌‌‌‌‌‌నిపించాడు. మేం కూడా న‌‌‌‌‌‌‌‌వ్వుతూ ప‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌రించాం. హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లో పుట్టి పెర‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డం వ‌‌‌‌‌‌‌‌ల్ల‌‌‌‌‌‌‌‌, ఉర్దూతో కాస్త ప‌‌‌‌‌‌‌‌రిచ‌‌‌‌‌‌‌‌యం ఉంది. హిందీ మిక్స్ అవ్వడం వ‌‌‌‌‌‌‌‌ల్ల చాలా ప‌‌‌‌‌‌‌‌దాలు అర్థమ‌‌‌‌‌‌‌‌వుతాయి. ముణెమ్మ‌‌‌‌‌‌‌‌కీ కొంత వ‌‌‌‌‌‌‌‌చ్చు. 

‘‘ఈరోజు ఇండియా బాగా ఆడింది. కంగ్రాట్స్‌‌‌‌‌‌‌‌’’ అభినంద‌‌‌‌‌‌‌‌న పూర్వ‌‌‌‌‌‌‌‌కంగానే అన్నాడు పాకిస్తానీ ఫ్యాన్‌‌‌‌‌‌‌‌. తొలిసారి త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌పై మంచి అభిప్రాయం ఏర్ప‌‌‌‌‌‌‌‌డింది. ఇప్పటివ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ గ్యాల‌‌‌‌‌‌‌‌రీలో త‌‌‌‌‌‌‌‌న ప‌‌‌‌‌‌‌‌క్కన కూర్చుని క‌‌‌‌‌‌‌‌వ్వించినందుకు కాస్త గిల్టీగా అనిపించింది.

బిస్కెట్లు టీ క‌‌‌‌‌‌‌‌ప్పుల్లో, మేం మాట‌‌‌‌‌‌‌‌ల్లో మునిగాం.

‘‘మ్యాచ్ చూడ్డానికి ఇండియా నుంచి వ‌‌‌‌‌‌‌‌చ్చారా?  గ్రేట్‌‌‌‌‌‌‌‌. మీ స‌‌‌‌‌‌‌‌చిన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇంజిమామ్ ఆ షాట్ అలా ఆడి ఉండ‌‌‌‌‌‌‌‌కూడ‌‌‌‌‌‌‌‌దు. మా టాప్ ఆర్డ‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌.. ఈ రోజు ఫెయిల్ అయ్యింది’’ మేం నోరు మెదిపే అవ‌‌‌‌‌‌‌‌కాశమే ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ మాట తీరు, మ్యాచ్‌‌‌‌‌‌‌‌పై విశ్లేష‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ చూస్తుంటే, క్రికెట్ పై మంచి అవ‌‌‌‌‌‌‌‌గాహ‌‌‌‌‌‌‌‌న ఉందనిపించింది. ఆయ‌‌‌‌‌‌‌‌నా అదే చెప్పాడు. ‘‘నిజానికి నేను క్రికెట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌ని అవుదామ‌‌‌‌‌‌‌‌నుకున్నా. కానీ కుద‌‌‌‌‌‌‌‌ర్లేదు. పైన అల్లా ఏం రాస్తే అది జ‌‌‌‌‌‌‌‌రుగుతుంది’’ అంటూ దువా చ‌‌‌‌‌‌‌‌దువుతున్నట్టు రెండు చేతులూ ద‌‌‌‌‌‌‌‌గ్గర‌‌‌‌‌‌‌‌కు తీసుకుని క‌‌‌‌‌‌‌‌ళ్లకు అద్దుకున్నాడు.
‘‘అన్నట్టు మీ పేరు చెప్పలేదు’’ తెలుసుకోవాల‌‌‌‌‌‌‌‌ని కాదు, ఆ ప్రవాహానికి బ్రేక్ వేయాల‌‌‌‌‌‌‌‌ని అడిగా.
‘‘స‌‌‌‌‌‌‌‌య్య‌‌‌‌‌‌‌‌ద్ అన్సారి. మ‌‌‌‌‌‌‌‌రి మీ పేరు’’
ఇద్ద‌‌‌‌‌‌‌‌రి పేర్లూ చెప్పా.
‘‘మీ పేరు ముణెమ్మ‌‌‌‌‌‌‌‌. మా బీబీ పేరు మున్నీ. ఈ పేర్లు కూడా ప‌‌‌‌‌‌‌‌క్క ప‌‌‌‌‌‌‌‌క్కనే పుట్టుంటాయి క‌‌‌‌‌‌‌‌దా. ఇండియా, పాకిస్తాన్​లా..’’ ముగ్గురం న‌‌‌‌‌‌‌‌వ్వుకున్నాం.
‘‘ఎన్నిరోజులుంటారిక్కడ‌‌‌‌‌‌‌‌?’’
‘‘రేపు మ‌‌‌‌‌‌‌‌ధ్యాహ్నం ఫ్లైట్‌‌‌‌‌‌‌‌’’
‘‘క‌‌‌‌‌‌‌‌రాచీలో హిందూ దేవాల‌‌‌‌‌‌‌‌యాలు చాలా ఉన్నాయి. అవ‌‌‌‌‌‌‌‌న్నీ చూసి వెళ్తే బాగుండేది క‌‌‌‌‌‌‌‌దా’’
‘‘లేదు. చాలా ప‌‌‌‌‌‌‌‌నులున్నాయి.’’
ఇంతలో వాన పెరిగింది. 
‘‘వ‌‌‌‌‌‌‌‌ర్షం పెద్ద‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌య్యేలా ఉంది. మీ హోటల్ ఎక్కడ‌‌‌‌‌‌‌‌?’’
‘‘లాల్ బంగ్లా.’’
‘‘చాలా దూరం క‌‌‌‌‌‌‌‌దా. స‌‌‌‌‌‌‌‌ర్లే ఓ ప‌‌‌‌‌‌‌‌ని చేద్దాం. ప‌‌‌‌‌‌‌‌క్కనే మా ఇల్లు. రండి.. వ‌‌‌‌‌‌‌‌ర్షం త‌‌‌‌‌‌‌‌గ్గాక వెళ్దురు గానీ, కావాలంటే నా కారులో డ్రాప్ చేస్తా.’’
‘‘పర్లేదండీ. మేం వెళ్లిపోతాం.’’
‘‘అరె... మీరు మా అతిథులు. మిమ్మ‌‌‌‌‌‌‌‌ల్ని గౌర‌‌‌‌‌‌‌‌వించుకోక‌‌‌‌‌‌‌‌పోతే ఎలా? ఆతిథ్యం ఇవ్వడం మా అదృష్టం. మీరు త‌‌‌‌‌‌‌‌ప్పకుండా రావాల్సిందే’’ అత‌‌‌‌‌‌‌‌ను ప‌‌‌‌‌‌‌‌ట్టుబ‌‌‌‌‌‌‌‌డుతున్నాడు.
 ‘‘ఇప్పుడు అలాంటివేం పెట్టుకోకండి.. మ‌‌‌‌‌‌‌‌నం వెళ్లిపోదాం’’ ముణెమ్మ న‌‌‌‌‌‌‌‌న్ను వెన‌‌‌‌‌‌‌‌క్కి లాగుతోంది.
‘‘వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు ఏం కొన్నా కొన‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌పోయినా, ఏం చూసినా చూడ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌పోయినా.. ఒక్క స్నేహితుడ్ని అయినా సంపాదించుకోవాలి క‌‌‌‌‌‌‌‌దా ముణెమ్మా. అయినా ఇంత వ‌‌‌‌‌‌‌‌ర్షంలో ఎక్కడ‌‌‌‌‌‌‌‌ని తిరుగుతాం.’’
కాద‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌లేక క‌‌‌‌‌‌‌‌దిలింది. మా ఇద్ద‌‌‌‌‌‌‌‌రికీ ఆ పెద్దాయ‌‌‌‌‌‌‌‌న గొడుగు ప‌‌‌‌‌‌‌‌ట్టాడు. ముగ్గురం త‌‌‌‌‌‌‌‌డుచుకుంటూనే క‌‌‌‌‌‌‌‌రాచీ రోడ్లు దాటుకుంటూ ముందుకు క‌‌‌‌‌‌‌‌దిలాం. ఆయ‌‌‌‌‌‌‌‌న ఇంటికి రెండు నిమిషాల్లోనే చేరుకున్నాం. కాంపౌండ్ వాల్ దాటుకుని లోప‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు అడుగుపెట్టాం. పెద్ద గార్డెన్‌‌‌‌‌‌‌‌. వ‌‌‌‌‌‌‌‌ర్ష‌‌‌‌‌‌‌‌పు చినుకుల‌‌‌‌‌‌‌‌కు ప‌‌‌‌‌‌‌‌చ్చ‌‌‌‌‌‌‌‌గా మెరిసిపోతోంది. పోర్టికోలో రెండు పెద్ద కార్లు. గుమ్మంలో అడుగుపెడుతుండ‌‌‌‌‌‌‌‌గానే ఒకావిడ చేతిలో ట‌‌‌‌‌‌‌‌వ‌‌‌‌‌‌‌‌ల్స్‌‌‌‌తో ఎదురైంది. ‘‘వ‌‌‌‌‌‌‌‌ర్షంలో త‌‌‌‌‌‌‌‌డుస్తూ రాక‌‌‌‌‌‌‌‌పోతే.. కాసేపు అక్కడే ఆగొచ్చు క‌‌‌‌‌‌‌‌దా. అయినా ఓడిపోయే మ్యాచ్ చూడ్డానికి స్టేడియం వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ వెళ్లాలా? చెప్తే విన్నారు కాదు. పొద్దున్నుంచి టీవీ చూస్తున్నా. మీరు ఒక్కసారి కూడా టీవీలో క‌‌‌‌‌‌‌‌నిపించ‌‌‌‌‌‌‌‌లేదెందుకు? ఇంత‌‌‌‌‌‌‌‌కీ  వీళ్లెవ‌‌‌‌‌‌‌‌రు?’’ రాగానే మాట్లాడ‌‌‌‌‌‌‌‌నివ్వకుండా చేస్తోందంటే.. క‌‌‌‌‌‌‌‌చ్చితంగా ఆవిడ మున్నీనే అయ్యుంటారు.
‘‘మారేవి దేశాలే... భ‌‌‌‌‌‌‌‌ర్త‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌పై భార్య‌‌‌‌‌‌‌‌ల ఉద్దేశాలు కాదు’’ మా ఆవిడ చెవిలో అన్నా.
‘‘స్టేడియంలో నాకు దొరికిన స్నేహితులు. మ్యాచ్ చూడ్డానికి ఇండియా నుంచి వ‌‌‌‌‌‌‌‌చ్చారు. ఈ రోజు మ‌‌‌‌‌‌‌‌న అతిథులు’’ మా గురించిన భారీ ఇంట్ర‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌క్షన్ ఇచ్చారు అన్సారి. మున్నీ మ‌‌‌‌‌‌‌‌మ్మ‌‌‌‌‌‌‌‌ల్ని ఇంట్లోకి ఆహ్వానించారు.
‘‘అనుకోని అతిథులు మా ఇంటికి రావ‌‌‌‌‌‌‌‌డం మామూలే’’ అన్నంత క్యాజువ‌‌‌‌‌‌‌‌ల్‌‌గా మ‌‌‌‌‌‌‌‌మ్మ‌‌‌‌‌‌‌‌ల్ని రిసీవ్ చేసుకున్నారామె.  
హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లో నాకు ముస్లిం స్నేహితులెక్కువ‌‌‌‌‌‌‌‌. వాళ్ల ఇళ్లకి వెళ్తుంటా. అందుకే ఆ ఇల్లూ, ఇంట్లో మ‌‌‌‌‌‌‌‌నుషులూ, వాతావ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణం కొత్తగా అనిపించ‌‌‌‌‌‌‌‌లేదు.


రెండు నిమిషాల్లో పొగ‌‌‌‌‌‌‌‌లు క‌‌‌‌‌‌‌‌క్కుతున్న టీ క‌‌‌‌‌‌‌‌ప్పులు మా చేతుల్లో చేరాయి.
‘‘ఇందాకే తాగామండీ..’’
‘‘మా ఆవిడ టీ పెట్టడంలో స్పెష‌‌‌‌‌‌‌‌లిస్టు. ఇలాంటి టీ మీ హైద‌‌‌‌‌‌‌‌రాబాద్‌‌‌‌‌‌‌‌లో కూడా దొర‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌దు. కావాలంటే బెట్’’  అన్నాడు అన్సారి.
ఇక సిప్ చేయ‌‌‌‌‌‌‌‌క త‌‌‌‌‌‌‌‌ప్పలేదు. ‘‘నిజ‌‌‌‌‌‌‌‌మేనండీ. టీ చాలా బాగుంది’’ 
మా ఆవిడ ఎవ‌‌‌‌‌‌‌‌రికీ కాంప్లిమెంట్లు పెద్ద‌‌‌‌‌‌‌‌గా ఇవ్వదు. త‌‌‌‌‌‌‌‌నే అందంటే టీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
‘‘టీలో ఏం క‌‌‌‌‌‌‌‌లిపారు. అల్లం, ఇలాచీ వేశారా?’’  అంటూ మున్నీతో మాట‌‌‌‌‌‌‌‌లు క‌‌‌‌‌‌‌‌లిపేసింది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌. ఇల్లంతా తిప్పి తిప్పి చూపిస్తున్నారు అన్సారి. ఇల్లంతా ప‌‌‌‌‌‌‌‌ద్ధ‌‌‌‌‌‌‌‌తిగా, ఒద్దిగ్గా ఉంది. ఆ ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌దాలు, వాల్ క్లాక్స్​, పింగాణీ బొమ్మ‌‌‌‌‌‌‌‌లు నాకు బాగా నచ్చాయి. నిమిషాలు మాట‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌తో పాటు దొర్లిపోతున్నాయి.
‘‘డిన్నర్ కి ఏం ప్రిపేర్ చేస్తున్నావ్‌‌‌‌‌‌‌‌’’
‘‘బిర్యానీ వండ‌‌‌‌‌‌‌‌నా?’’
‘‘బిర్యానీ తినిపించ‌‌‌‌‌‌‌‌కుండా మ‌‌‌‌‌‌‌‌నం అతిథుల్ని పంపుతామా.. త‌‌‌‌‌‌‌‌ప్పు క‌‌‌‌‌‌‌‌దూ!’’
వ్యవ‌‌‌‌‌‌‌‌హారం చూస్తుంటే, ఈ రాత్రంతా ఇక్కడే ఉంచేద్దామ‌‌‌‌‌‌‌‌ని అన్సారి ఫిక్స‌‌‌‌‌‌‌‌యిన‌‌‌‌‌‌‌‌ట్టు అనిపించింది.
‘‘అరె... అలాంటివేం వ‌‌‌‌‌‌‌‌ద్దండీ. మేం వెళ్లిపోవాలి. రేపు మార్నింగ్ ఫ్లైట్ క‌‌‌‌‌‌‌‌దా. ల‌‌‌‌‌‌‌‌గేజ్‌‌‌‌‌‌‌‌ స‌‌‌‌‌‌‌‌ర్దుకోవాలి.’’
‘‘మా ఇంటికి వ‌‌‌‌‌‌‌‌చ్చి బిర్యానీ తిన‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌పోతే ఎలా?  హైద‌‌‌‌‌‌‌‌రాబాదీ బిర్యానీ బాగుంటుందని మీరు అనుకుంటారు క‌‌‌‌‌‌‌‌దా?  మా బిర్యానీ ఒక‌‌‌‌‌‌‌‌సారి రుచి చూడండి. జ‌‌‌‌‌‌‌‌న్మ‌‌‌‌‌‌‌‌లో మ‌‌‌‌‌‌‌‌ర్చిపోరు’’ ఈ సారి మున్నీ కూడా తోడ‌‌‌‌‌‌‌‌య్యారు.
‘వ‌‌‌‌‌‌‌‌ద్దు’ అన‌‌‌‌‌‌‌‌డానికి కార‌‌‌‌‌‌‌‌ణాలేం దొర‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌లేదు. కాసేప‌‌‌‌‌‌‌‌టికే వంటింట్లోంచి మ‌‌‌‌‌‌‌‌సాలా వాస‌‌‌‌‌‌‌‌న. ముణెమ్మ కూడా.. వ‌‌‌‌‌‌‌‌చ్చీ రానీ హిందీలో మాట‌‌‌‌‌‌‌‌లు క‌‌‌‌‌‌‌‌లుపుతూ, ఉల్లిపాయ ముక్కలు త‌‌‌‌‌‌‌‌రుగుతూ బిజీ అయిపోయింది.
ఎక్కడినుంచో ఖ‌‌‌‌‌‌‌‌వాలీ వినిపిస్తోంది. ఆ ప‌‌‌‌‌‌‌‌దాల‌‌‌‌‌‌‌‌కు విడ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌రిచి అర్థాలు చెప్పారు అన్సారి. చూస్తుండ‌‌‌‌‌‌‌‌గానే డైనింగ్ టేబుల్ పైకి బిర్యానీ వ‌‌‌‌‌‌‌‌చ్చేసింది.
పింగాణీ ప్లేట్లు స‌‌‌‌‌‌‌‌ర్ది.. న‌‌‌‌‌‌‌‌న్నూ ముణెమ్మ‌‌‌‌‌‌‌‌నీ ఆహ్వానించారు. మున్నీ బిర్యానీ వ‌‌‌‌‌‌‌‌డ్డిస్తుంటే, అన్సారి గ్లాసుల్లో నీళ్లు నింపుతూ సాయం చేస్తున్నారు.
‘‘మీ ఇద్ద‌‌‌‌‌‌‌‌ర్నీ చూస్తుంటే ఈర్ష్య‌‌‌‌‌‌‌‌గా ఉందండీ. ఈ వ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌సులోనూ హుషారుగా ఉన్నారు. మాక్కూడా ఎక్కడికైనా వెళ్లాల‌‌‌‌‌‌‌‌ని ఉంటుంది. కానీ అంత ఓపిక ఉండ‌‌‌‌‌‌‌‌దు.’’ అన్సారి మాట‌‌‌‌‌‌‌‌ల్లో ఏదో మిస్ అవుతున్నాన‌‌‌‌‌‌‌‌న్న ఫీలింగ్.
‘‘ఇంత‌‌‌‌‌‌‌‌కీ మీ పిల్ల‌‌‌‌‌‌‌‌లేం చేస్తుంటారు.’’ రైతాతో నింపేసిన గిన్నె అందిస్తూ అడిగారు మున్నీ.
 ఆ టాపిక్ రాగానే ముణెమ్మ వైపు చూశా. అప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ వెలిగిపోతున్న ఆ మొహం.. ఇప్పుడు చిన్నబోయింది.
‘‘మీకు పిల్లలెంత‌‌‌‌‌‌‌‌మంది.’’ మ‌‌‌‌‌‌‌‌ళ్లీ అదే ప్రశ్న‌‌‌‌‌‌‌‌.
‘‘ఓ అబ్బాయి.’’  బిర్యానీ క‌‌‌‌‌‌‌‌లుపుతూ అంది.
‘‘తీసుకు రావాల్సింది క‌‌‌‌‌‌‌‌దా.’’ అన్సారి, మున్నీ ఇద్ద‌‌‌‌‌‌‌‌రూ ఒకేసారి అన్నారు. ‘ఈ టాపిక్ ఎటుపోతుందో’ అనుకుంటూ ముణ‌‌‌‌‌‌‌‌మ్మ వైపే చూస్తున్నా.
‘‘హ‌‌‌‌‌‌‌‌నీమూన్‌‌‌‌‌‌‌‌కి వ‌‌‌‌‌‌‌‌స్తూ పిల్ల‌‌‌‌‌‌‌‌లెందుకు అనుకున్నారా’’ మున్నీ జోక్ చేశారు. కానీ.. దాన్ని మేమిద్ద‌‌‌‌‌‌‌‌రం రిసీవ్ చేసుకునే స్థితిలో లేం.
‘‘ఒక‌‌‌‌‌‌‌‌ప్పుడు ఉండేవాడు. ఇప్పుడు లేడు.’’  ముణెమ్మ మాట‌‌‌‌‌‌‌‌లు త‌‌‌‌‌‌‌‌డ‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌డుతున్నాయి. అన్సారి, - మున్నీ ఒక‌‌‌‌‌‌‌‌రి మొహాలు ఒక‌‌‌‌‌‌‌‌రు చూసుకున్నారు.
‘‘ఏమైంది?’’
‘‘చచ్చిపోయాడు’’
పెద్ద పిడుగు ప‌‌‌‌‌‌‌‌డింది. బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట కాదు.. ఇంట్లో. దేన్ని గుర్తు చేయ‌‌‌‌‌‌‌‌కూడ‌‌‌‌‌‌‌‌దో, దాన్నే గుర్తు చేశామంతా.
‘‘అరె.. సారీ. అస‌‌‌‌‌‌‌‌లు ఈ టాపిక్ తీయ‌‌‌‌‌‌‌‌కుండా ఉండాల్సింది.’’ పాపం.. మున్నీ, అన్సారి ఏదో త‌‌‌‌‌‌‌‌ప్పు చేసిన‌‌‌‌‌‌‌‌వారిలా త‌‌‌‌‌‌‌‌ల్ల‌‌‌‌‌‌‌‌డిల్లిపోతున్నారు.
‘‘మ‌‌‌‌‌‌‌‌రేం పర్వాలేదండీ’’ బాధ‌‌‌‌‌‌‌‌ని దిగ‌‌‌‌‌‌‌‌మింగుకుంటూ, వ‌‌‌‌‌‌‌‌స్తున్న క‌‌‌‌‌‌‌‌న్నీళ్లని చీర కొంగుతో తుడుచుకుంటూ త‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌ని తాను స్థిమిత ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌చుకుంటోంది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌.
కాసేపు అంతా నిశ్శ‌‌‌‌‌‌‌‌బ్దం. సముద్రం కంటే లోతైన‌‌‌‌‌‌‌‌ది ఏమైనా ఉందంటే అది నిశ్శ‌‌‌‌‌‌‌‌బ్ద‌‌‌‌‌‌‌‌మే. దాన్ని దాటుకుని రావ‌‌‌‌‌‌‌‌డం చాలా క‌‌‌‌‌‌‌‌ష్టం.
‘‘ఇంత‌‌‌‌‌‌‌‌కీ ఏం జ‌‌‌‌‌‌‌‌రిగింది..’’ ముణెమ్మ‌‌‌‌‌‌‌‌ని ఓదారుస్తున్నట్టే అడిగారు మున్నీ.
‘‘లేక లేక పుట్టిన‌‌‌‌‌‌‌‌వాడ్ని. నా దేశంపై ప్రేమ‌‌‌‌‌‌‌‌తో, బాధ్య‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌తో సైన్యంలోకి పంపా. పాతికేండ్లకే యుద్ధంలో వీర మ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణం పొందాడు. ఓ తండ్రిగా నేను గ‌‌‌‌‌‌‌‌ర్వ‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌డ్డా. నా దేశం ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌వీర చ‌‌‌‌‌‌‌‌క్ర ఇచ్చింది. కానీ.. ఓ త‌‌‌‌‌‌‌‌ల్లి బాధ‌‌‌‌‌‌‌‌ని మాత్రం ఇప్పటికీ తీర్చ‌‌‌‌‌‌‌‌లేక‌‌‌‌‌‌‌‌పోతున్నా’’ ఈసారి నా క‌‌‌‌‌‌‌‌ళ్లల్లో నీళ్లు తిరిగాయి.
‘‘ఏ యుద్ధంలో?’’ అన్సారీలో ఏదో తెలుసుకోవాల‌‌‌‌‌‌‌‌న్న త‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌న, కోరిక క‌‌‌‌‌‌‌‌నిపించాయి.
‘‘కార్గిల్ యుద్ధంలో జూన్ 1న స‌‌‌‌‌‌‌‌రిహద్దుల్లో జ‌‌‌‌‌‌‌‌రిగిన ఎదురు కాల్పుల్లో’’ నాకింక మాట‌‌‌‌‌‌‌‌లు రావ‌‌‌‌‌‌‌‌డం లేదు.
‘‘జూన్‌‌‌‌‌‌‌‌1, కార్గిల్ వార్‌‌‌‌‌‌‌‌’’ ప్రతి అక్షరాన్నీ నొక్కి నొక్కి ప‌‌‌‌‌‌‌‌లుకుతున్నారు అన్సారి. ఆయ‌‌‌‌‌‌‌‌న గొంతు, చేతులు రెండూ వణ‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌డం స్పష్టంగా క‌‌‌‌‌‌‌‌నిపించింది. అంతే.. ఒక్క ముద్ద కూడా తిన‌‌‌‌‌‌‌‌కుండా కంచంలోనే చేతులు క‌‌‌‌‌‌‌‌డిగేశారు. అప్పటి వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కూ అన్సారీలో నాకు క‌‌‌‌‌‌‌‌నిపించ‌‌‌‌‌‌‌‌ని మ‌‌‌‌‌‌‌‌రో కోణానికి తెర లేచిందప్పుడు.
‘‘మీరు కానివ్వండి..’’ అని అక్కడ్నుంచి లేచి వెళ్లిపోయారు. నేనూ, ముణెమ్మ మొహ‌‌‌‌‌‌‌‌మొహాలు చూసుకున్నాం. మున్నీ మొహం ఎర్ర‌‌‌‌‌‌‌‌గా కంద‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డ్డ‌‌‌‌‌‌‌‌లా మారిపోయింది. నాకేం చేయాలో అర్థం కాలేదు. అన్సారీని అనుస‌‌‌‌‌‌‌‌రిస్తూ.. నేనూ వెళ్లా. ‘‘కార్గిల్ వార్ పేరెత్తగానే ఎందుకలా అయిపోయారు. ఇప్పుడు మేమిద్ద‌‌‌‌‌‌‌‌రం మీకు అతిథుల్లా కాకుండా శ‌‌‌‌‌‌‌‌త్రువులుగా క‌‌‌‌‌‌‌‌నిపించామా?’’
నావైపు తీక్షణంగా చూశారు అన్సారి. నా చేయి ప‌‌‌‌‌‌‌‌ట్టుకుని ఓ గ‌‌‌‌‌‌‌‌దిలోకి తీసుకెళ్లారు. ఆ గోడ‌‌‌‌‌‌‌‌ల నిండా ఫొటోలే. ఓ కుర్రాడు. పాకిస్తానీ మిల‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌రీ డ్రెస్​లో మెరిసిపోతూ క‌‌‌‌‌‌‌‌నిపించాడు.
‘‘వాడు నా కొడుకు ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ అలీ. నేనూ మీలానే. నా బిడ్డ‌‌‌‌‌‌‌‌ని సైనికుడిగా చూడాల‌‌‌‌‌‌‌‌నుకున్నా. దేశం కోసం పోరాడ‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌ని సైన్యంలోకి పంపా. అదే కార్గిల్ వార్‌‌‌‌‌‌‌‌లో.. అదే జూన్ 1న‌‌‌‌‌‌‌‌ ఈ దేశం కోసం త‌‌‌‌‌‌‌‌న ఆఖ‌‌‌‌‌‌‌‌రి శ్వాస‌‌‌‌‌‌‌‌ వ‌‌‌‌‌‌‌‌దిలాడు’’ గుండెల్లో విషాదాన్ని గొంతులో ప‌‌‌‌‌‌‌‌లికించాడు.
నాకు మాట‌‌‌‌‌‌‌‌లు రావ‌‌‌‌‌‌‌‌డం లేదు. అంతా శూన్యంగా క‌‌‌‌‌‌‌‌నిపిస్తోంది. ‘‘స‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ద్దుకు అవ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల మీ కొడుకు.. ఇవ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల నా కొడుకు, నా కొడుకుని చంపినందుకు మీ వాడికి ప‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌మ వీరచ‌‌‌‌‌‌‌‌క్ర ఇచ్చిన‌‌‌‌‌‌‌‌ట్టే, మీవాడ్ని చంపినందుకు మా వాడికి... ‘నిషాన్ ఈ ఇంతియాజ్’ ఇచ్చారు.’’
ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ మెడ‌‌‌‌‌‌‌‌లో.. ఆ దేశ‌‌‌‌‌‌‌‌పు అత్యున్నత సైనిక పుర‌‌‌‌‌‌‌‌స్కారం వేలాడుతోంది. ‘‘ఇద్ద‌‌‌‌‌‌‌‌రు వీరుల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులం మ‌‌‌‌‌‌‌‌నం. కానీ విచిత్ర‌‌‌‌‌‌‌‌మేమిటంటే.. మీ దేశానికి మా ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ శ‌‌‌‌‌‌‌‌త్రువు. నా దేశానికి మీ అబ్బాయి శ‌‌‌‌‌‌‌‌త్రువు.’’ ఉద్వేగ‌‌‌‌‌‌‌‌భ‌‌‌‌‌‌‌‌రితంగా మాట్లాడుతున్నారు అన్సారి.
ఇక అక్కడ ఉండ‌‌‌‌‌‌‌‌లేక‌‌‌‌‌‌‌‌పోయా. వెన‌‌‌‌‌‌‌‌క్కి తిరిగి చూస్తే ముణెమ్మ, మున్నీ ఇద్ద‌‌‌‌‌‌‌‌రూ క‌‌‌‌‌‌‌‌నిపించారు. ఈ గ‌‌‌‌‌‌‌‌దిలో ఏం జ‌‌‌‌‌‌‌‌రిగిందో, మేం ఏం మాట్లాడుకున్నామో, ఒక‌‌‌‌‌‌‌‌రికి మ‌‌‌‌‌‌‌‌రొక‌‌‌‌‌‌‌‌రు ఏమ‌‌‌‌‌‌‌‌వుతామో వాళ్లకు అర్థమైపోయింది.ముణెమ్మ చేయి ప‌‌‌‌‌‌‌‌ట్టుకుని బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌కు వ‌‌‌‌‌‌‌‌చ్చేశా.

ఆ రాత్రంతా మా ఇద్ద‌‌‌‌‌‌‌‌రికీ నిద్ర ప‌‌‌‌‌‌‌‌ట్టలేదు. పాతికేండ్లు నిండ‌‌‌‌‌‌‌‌కుండానే, ఈ దేశం కోసం ప్రాణ‌‌‌‌‌‌‌‌త్యాగం చేసిన నా కొడుకు గుర్తొచ్చాడు. అంత‌‌‌‌‌‌‌‌కంటే ఎక్కువ‌‌‌‌‌‌‌‌గా ష‌‌‌‌‌‌‌‌బ్బీర్ క‌‌‌‌‌‌‌‌ళ్ల ముందు క‌‌‌‌‌‌‌‌నిపించాడు. నా దేశానికి నా కొడుకు ఎంత గొప్పవాడో, ఈ దేశానికి అన్సారి కొడుకూ అంతే గొప్పవాడు. ష‌‌‌‌‌‌‌‌బ్బీర్​నీ, ష‌‌‌‌‌‌‌‌బ్బీర్​తో పాటు ఉన్న పాక్ సైన్యాన్నీ చంపిన‌‌‌‌‌‌‌‌ప్పుడు భార‌‌‌‌‌‌‌‌త సైన్య‌‌‌‌‌‌‌‌ం.. స‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ద్దుల్లో మిఠాయిలు పంచుకునే ఉంటుంది క‌‌‌‌‌‌‌‌దా. వారి చావు నా దేశానికి పండుగై ఉంటుంది క‌‌‌‌‌‌‌‌దా. మ‌‌‌‌‌‌‌‌రి నా కొడుకుని చంపితే... పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ సైన్యం కూడా అదే చేసి ఉంటుంది క‌‌‌‌‌‌‌‌దా? ఈ చావుల‌‌‌‌‌‌‌‌తో ఈ రెండు దేశాలూ ఏం సాధించాయి?  కొన్ని కుటుంబాల్లో త‌‌‌‌‌‌‌‌ల్లిదండ్రుల‌‌‌‌‌‌‌‌కు బిడ్డ‌‌‌‌‌‌‌‌ల్ని, బిడ్డ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కు త‌‌‌‌‌‌‌‌ల్లిదండ్రుల్ని దూరం చేయ‌‌‌‌‌‌‌‌డం త‌‌‌‌‌‌‌‌ప్ప.

ఇస్లామాబాద్ ఎయిర్ పోర్టు ముందు కారు ఆగింది. ల‌‌‌‌‌‌‌‌గేజీ దింపుకుని, ఎయిర్ పోర్టు లోప‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌కి వెళ్తున్నాం. 
ఫ్లైట్ గంట లేట‌‌‌‌‌‌‌‌ని డిజిట‌‌‌‌‌‌‌‌ల్ బోర్డులో క‌‌‌‌‌‌‌‌నిపిస్తోంది. ‘‘ఎక్కడైనా కాసేపు కూర్చుందాం.’’ అంది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌. రాత్రి నుంచి త‌‌‌‌‌‌‌‌ను మాట్లాడిన మాట ఇదొక్కటే.
ఖాళీ సీట్లు ఎక్కడున్నాయంటూ వెతుకుతుంటే.. ఓ వ్య‌‌‌‌‌‌‌‌క్తి నాకు అడ్డుగా వ‌‌‌‌‌‌‌‌చ్చి నిల‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌డ్డాడు.
‘‘అన్సారి..’’
‘‘ఏంటి చెప్పాపెట్టకుండా వ‌‌‌‌‌‌‌‌చ్చేశారు’’ న‌‌‌‌‌‌‌‌వ్వుతూ ప‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌క‌‌‌‌‌‌‌‌రించారు. ఆ న‌‌‌‌‌‌‌‌వ్వులో కోపం, క‌‌‌‌‌‌‌‌ల్మ‌‌‌‌‌‌‌‌షం ఏమీ లేవు. నాకు ఆశ్చ‌‌‌‌‌‌‌‌ర్యం వేసింది.
‘‘మీ కోసం అంత క‌‌‌‌‌‌‌‌ష్ట‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌డి బిర్యానీ వండితే ఒక్క మెతుకు కూడా తిన‌‌‌‌‌‌‌‌లేదు. అందుకే.. బాక్సులో పెట్టుకుని వ‌‌‌‌‌‌‌‌చ్చా. తిని ఎలా ఉందో చెప్పాల్సిందే’’ మున్నీ కూడా అంతే స్వ‌‌‌‌‌‌‌‌చ్ఛంగా ప్రేమ‌‌‌‌‌‌‌‌గా బాక్సు అందించారు. మా ఇద్ద‌‌‌‌‌‌‌‌రికీ ఏం మాట్లాడాలో అర్థం కావ‌‌‌‌‌‌‌‌డం లేదు.
‘‘ఆ అల్లా.. మ‌‌‌‌‌‌‌‌నుషుల్ని ఎందుకు క‌‌‌‌‌‌‌‌లుపుతాడో, ఎందుకు విడ‌‌‌‌‌‌‌‌దీస్తాడో అర్థం కాదు. కానీ ప్రతి దానికీ ఓ కార‌‌‌‌‌‌‌‌ణం ఉండే ఉంటుంది. నా కొడుకు త‌‌‌‌‌‌‌‌రఫున మీ కుటుంబానికి క్షమాప‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌లు చెప్పే అవ‌‌‌‌‌‌‌‌కాశం నాకు ఈ రూపంలో ఇచ్చాడేమో’’ ప్రతి ప‌‌‌‌‌‌‌‌దంలోనూ, ప్రతి మాట‌‌‌‌‌‌‌‌లోనూ నిజాయితీ క‌‌‌‌‌‌‌‌నిపిస్తోంది.
‘‘ఆ మాటకొస్తే నేను కూడా మీకు క్షమాప‌‌‌‌‌‌‌‌ణ చెప్పాలిగా’’ నా గొంతుకేదో అడ్డుప‌‌‌‌‌‌‌‌డుతోంది. నా ప‌‌‌‌‌‌‌‌రిస్థితి అన్సారీకి అర్థమైంది.
‘‘యా.. అల్లా..’’ అంటూ గ‌‌‌‌‌‌‌‌ట్టిగా కౌగిలించుకున్నారు అన్సారి. ఆ కౌగిలింత‌‌‌‌‌‌‌‌లో క్షమాప‌‌‌‌‌‌‌‌ణ ఉంది. ప్రేమ ఉంది. వాటికి మించిన స్పర్శ ఇంకేదో ఉంది. అది మా మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌సుల‌‌‌‌‌‌‌‌కు అర్థమైంది.
‘‘దేశం అంటే మ‌‌‌‌‌‌‌‌ట్టి కాదు మ‌‌‌‌‌‌‌‌నుషులు అని చిన్నప్పుడు చ‌‌‌‌‌‌‌‌దువుకున్నా. కానీ ఇప్పుడు దేశ‌‌‌‌‌‌‌‌మంటే కేవ‌‌‌‌‌‌‌‌లం స‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ద్దు గీతలైపోయాయి. ఆ గీత‌‌‌‌‌‌‌‌కి అవ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌, ఇవ‌‌‌‌‌‌‌‌త‌‌‌‌‌‌‌‌ల కూడా మ‌‌‌‌‌‌‌‌నుషులే ఉంటార‌‌‌‌‌‌‌‌ని మ‌‌‌‌‌‌‌‌ర్చిపోయాం. దాన్ని చెరిపి మీరు మా ఇంటికొచ్చారు కాబ‌‌‌‌‌‌‌‌ట్టి.. స్నేహితులయ్యాం. దేశాలూ అలా క‌‌‌‌‌‌‌‌లిసిపోతే మీకూ, నాకూ పుత్ర‌‌‌‌‌‌‌‌శోకం త‌‌‌‌‌‌‌‌ప్పేది క‌‌‌‌‌‌‌‌దా’’ అన్సారి మాట‌‌‌‌‌‌‌‌లు, దేశం కంటే గొప్పగా, జాతీయ గీతం కంటే ఉన్నతంగా, జాతీయ జెండా కంటే ఎత్తుగా క‌‌‌‌‌‌‌‌నిపించాయి. వినిపించాయి.
‘‘వ‌‌‌‌‌‌‌‌చ్చే ఏడాది పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ ఇండియాకి వ‌‌‌‌‌‌‌‌స్తోంది. ఈసారి మా గ‌‌‌‌‌‌‌‌డ్డ‌‌‌‌‌‌‌‌మీద మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు జ‌‌‌‌‌‌‌‌రుగుతాయి.. మీ ఇద్ద‌‌‌‌‌‌‌‌రి రాక‌‌‌‌‌‌‌‌ కోసం మేమక్కడ ఎదురు చూస్తుంటాం’’ మున్నీకి ఆఖ‌‌‌‌‌‌‌‌రి మాట‌‌‌‌‌‌‌‌గా చెప్పింది ముణెమ్మ‌‌‌‌‌‌‌‌.
ఆత్మీయంగా వీడ్కోలు ఇచ్చారు ఆ దంప‌‌‌‌‌‌‌‌తులిద్ద‌‌‌‌‌‌‌‌రూ. పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ నుంచి భార‌‌‌‌‌‌‌‌మైన హృద‌‌‌‌‌‌‌‌యంతో, ఖాళీ చేతుల‌‌‌‌‌‌‌‌తో వెళ్తున్నామ‌‌‌‌‌‌‌‌ని అనుకున్నా. కానీ ఇన్నాళ్ల విషాదాన్ని ఇక్కడ వదిలేసి, ఓ కొత్త ఆశ‌‌‌‌‌‌‌‌ని మోసుకుంటూ వెళ్తున్నాం. విమానం గాల్లోకి ఎగిరింది. చాలా ఎత్తుకు ఇంకా ఎత్తుకు. అద్దంలోంచి బ‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌ట‌‌‌‌‌‌‌‌కు చూస్తే.. చిన్న ముక్కలా క‌‌‌‌‌‌‌‌నిపిస్తోంది భూభాగం. ఎక్కడా... గీత‌‌‌‌‌‌‌‌ల గోల లేదు. దేశాల మ‌‌‌‌‌‌‌‌ధ్య ఈ భూమి ఎప్పుడూ స‌‌‌‌‌‌‌‌రిహ‌‌‌‌‌‌‌‌ద్దులు గీయ‌‌‌‌‌‌‌‌లేదు. గీసింది మ‌‌‌‌‌‌‌‌నుషుల‌‌‌‌‌‌‌‌మే. దాన్ని చెరిపివేసే బాధ్య‌‌‌‌‌‌‌‌త కూడా మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌దే!

మహమ్మద్ అన్వర్, ఫోన్​ : 8328068484