ఒలంపిక్స్ ఎక్కడ ఎలా మొదలైంది..?

ఒలంపిక్స్ ఎక్కడ ఎలా మొదలైంది..?

అన్ని సౌలతులు ఉన్న అగ్రరాజ్యం అమెరికా నుంచి ఎప్పుడూ అశాంతితో రగిలే అఫ్గానిస్తాన్​ వరకూ ఆటలాడే ప్రతి దేశానికి ఆశల సౌధం అది!  
చార్టర్డ్​​ ఫ్లైట్స్​లో తిరిగే స్టార్ల నుంచి  చేలల్లో పరుగులు తీసే పేద క్రీడాకారుల వరకు ప్రతి ఒక్కరి  అంతిమ లక్ష్యం అది! 

ఆటను కెరీర్​గా ఎంచుకునేవాళ్లు  తమ జీవితంలో ఒక్కసారైనా పోటీ పడాలనుకునే..
పతకం నెగ్గి తమ దేశ జెండా ఎగురుతుంటే పోడియం మీద గర్వంతో రొమ్ము విరుచుకు నిలబడాలని కోరుకునే.. క్రీడా కురుక్షేత్రమే ఒలింపిక్స్​. ఐదు ఖండాలను ఒక్కతాటిపైకి తెస్తూ..  నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఆటల పండుగది దశాబ్దాల ఘన వారసత్వం.14 దేశాలు, 241 అథ్లెట్లతో మొదలైన ఆధునిక ఒలింపిక్స్​ ఇప్పుడు  200 పైచిలుకు దేశాల నుంచి 11 వేల  క్రీడాకారులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్ట్స్​ఈవెంట్​గా మారింది. అందుకే ఒలింపిక్స్​ క్రేజ్​ పీక్స్​కు వెళ్తుంది. ఈ మెగా గేమ్స్​  వస్తున్నాయంటే  క్రీడా ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తుంది. ఇందులో తమ క్రీడాకారులు ఆడాలని, మెడల్స్​ గెలవాలని, వేదికపై తమ దేశ జెండా ఎగరాలని ప్రతి దేశం కోరుకుంటుంది. అమెరికా, బ్రిటన్​, చైనా లాంటి దేశాలు పదుల సంఖ్యలో గోల్డ్, వంద దాకా సిల్వర్​​ గెలిస్తే.. 125 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న మనదేశం మాత్రం ఒకటి రెండు పతకాలనే మహా ప్రసాదం అనుకుంటుంది. మరెన్నో దేశాలు ఒట్టి చేతులతోనే తిరిగొస్తున్నాయి. అయినా పోటీ పడడమే గొప్ప అనుకుంటాయి.  అంత గొప్పది కాబట్టే  కరోనా ప్యాండెమిక్​ టైమ్​లోనూ క్రీడా ప్రపంచాన్ని ఏకం చేసేందుకు టోక్యోలో ఈ విశ్వక్రీడా సంబురం షురూ అయింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా చరిత్రలో తొలిసారి ఏడాది ఆలస్యంగా జరుగుతున్నాయి. వైరస్​కు సవాల్ విసురుతూ ముందుకు సాగుతున్నాయి. మొదటిసారి ఖాళీ స్టేడియాల్లో జరుగుతూ కాస్త కళ తప్పినప్పటికీ.. ఒలింపిక్స్‌‌‌‌ అంటే ఒలింపిక్సే. దాని క్రేజ్ దానిదే.
మామూలుగా ఉంటదా!   
పది, పదిహేను దేశాలు పోటీపడే క్రికెట్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీనే హంగామాగా ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో గేమ్స్‌‌‌‌ ఒక్కచోట జరిగితే.. వందల దేశాలు, వేలాది మంది ఆటగాళ్లు ఒకే వేదికపై పోటీపడితే మామూలుగా ఉంటదా! పైగా, ఆ మెగా ఈవెంట్‌‌‌‌ నాలుగేళ్లకోసారి జరిగితే.. దానికోసం ఆతిథ్యమిచ్చే దేశం వేలాది కోట్లు ఖర్చు పెడితే.. పోటీల కోసం యావత్‌‌‌‌ ప్రపంచం ఎదురు చూస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు! ఒలింపిక్స్​కు ఉండే క్రేజ్​ అది.  ఎప్పట్లాగే, ఈసారి కూడా టోక్యో ఒలింపిక్స్​ కోసం అంతా ఆతృతగా చూశారు. ఎవరెలా ఆడతారు? ఏ దేశం హవా నడుస్తుంది? ఎన్ని రికార్డులు బద్ధలవుతాయనే లెక్కలేసుకున్నారు. 2016 రియో గేమ్స్​ ముగిసిన వెంటనే టోక్యో గేమ్స్​కు కౌంట్​డౌన్​ షురూ చేశారు. అయితే, 2019 నవంబర్​ వరకూ అంతా సాఫీగానే ఉన్నా.. కరోనా వైరస్​ చైనాలో ​పుట్టిన మూడు, నాలుగు నెలల్లోనే ప్రపంచం మొత్తాన్ని వణికించడంతో అంతా తలకిందులైంది. గేమ్స్​ను రద్దు చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాదికి వాయిదా వేశారు. దాంతో, ఒలింపిక్స్​ హిస్టరీలోనే షెడ్యూల్​ కంటే ఓ ఏడాది ఆలస్యంగా జరుగుతున్న ఈవెంట్​గా టోక్యో గేమ్స్​ నిలిచాయి. అయితే, 2021లో జరుగుతున్నప్పటికీ ఈ గేమ్స్​ను 2020 ఒలింపిక్స్​గానే పిలుస్తున్నారు. 
టార్చ్​కూ ఇక్కట్లే
కరోనా కారణంగా కనీసం ఒలింపిక్ జ్యోతి (టార్చ్)​ని కూడా సాఫీగా తీసుకెళ్లలేని పరిస్థితి. ఆటల్లో... ప్రపంచమంతా ఒకటే అని చాటే ఈ జ్యోతిని జనాలు లేని వీధుల గుండా.. రూట్​ మార్చుకుంటూ ముందుకు నడిపిస్తూ టోక్యోకు చేర్చారు. అదే టైమ్​లో కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఈ ఏడాదైనా గేమ్స్​ జరుగుతాయో లేదో అన్న అనుమానాలు కూడా పెరిగాయి. కానీ, వాయిదా వల్ల ఆర్థిక భారం పెరిగినా.. వేలాది మంది అథ్లెట్లు ఒక్క చోటకు వస్తే కరోనా మళ్లీ పెరుగుతుందని ఎక్స్‌‌‌‌పర్ట్స్‌‌‌‌ చెప్పినా..  గేమ్స్​ను రద్దు చేయాలని దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినా..  జపాన్​ ప్రభుత్వం, ఇంటర్నేషనల్​ ఒలింపిక్​ కమిటీ తగ్గలేదు. పట్టుదలతో ఒలింపిక్స్​ను పట్టాలెక్కించాయి. 
ఎమర్జెన్సీ నీడలో..
హంగూ, ఆర్భాటాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచే ఈ విశ్వక్రీడా సంబురం.. మొదటిసారి పెద్దగా హడావిడి లేకుండా స్టార్టయ్యింది. వేల సంఖ్యలో క్రీడాకారులు, అధికారులు, అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఓపెనింగ్​ సెర్మనీ కొద్దిమంది వీఐపీలతోనే పూర్తయింది. ఈ సారి 206 దేశాల నుంచి 11,500 పైచిలుకు అథ్లెట్లు 33 స్పోర్ట్స్​లోని 339 ఈవెంట్లలో బరిలో నిలిచారు. కరోనా ఉన్నందువల్ల గేమ్స్​ జరుగుతున్న టోక్యో సిటీలో జపాన్​ గవర్నమెంట్‌‌‌‌ వైరస్​ ఎమర్జెన్సీ పెట్టింది. ఖాళీ స్టేడియాల్లో పోటీలు జరుగుతున్నాయి. ఆటగాళ్లు  అనేక రిస్ట్రిక్షన్స్​ నడుమ, స్పెషల్‌‌‌‌ రూల్స్​, ప్రొటోకాల్స్​ పాటిస్తూ పోటీ పడుతున్నారు. ఆగస్టు 8వ తేదీన ఈ మెగా గేమ్స్​ ముగుస్తున్నాయి.
ఒకేసారి ఇద్దరితో పోటీ!  
కరోనా కారణంగా  దాదాపు గడచిన ఏడాదిన్నర కాలంలో చాలా టోర్నీలు రద్దయ్యాయి. క్వాలిఫికేషన్​ ఈవెంట్లు సైతం జరగలేదు. అప్పటిదాకా జరిగిన పోటీలు, ర్యాంకుల ఆధారంగా టోక్యో బెర్తులు కేటాయించారు.  దానివల్ల చాలామంది పేరున్న ప్లేయర్లు ఒలింపిక్స్‌‌‌‌ కోటా కోల్పోయారు. ఇండియా స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్​, కిడాంబి శ్రీకాంత్​ను ఉదాహరణగా చెప్పొచ్చు. పోటీలేవీ లేకపోవడంతో  ఒలింపిక్స్​ ముంగిట అథ్లెట్లకు సరైన ప్రిపరేషన్ ​కూడా  లేకుండా పోయింది. అయినా సరే ఎలాగైనా ఒలింపిక్​ మెడలిస్ట్​గా నిలవాలన్న లక్ష్యంతో వాళ్లు ముందుకొచ్చారు. ప్రాణం పెట్టి ఆడడం ఒలింపిక్స్‌‌‌‌లో కామన్.​ అయినా ఈసారి ప్రాణాలను పణంగా పెట్టి మరీ టోక్యోలో పతకాల వేటలో ఉన్నారు. అటు ఎదురుగా కనిపించే  ఆటగాడితో,  ఇటు కంటికి కనిపించని వైరస్​తో ఒకేసారి రెండు రకాల యుద్ధాలు చేస్తున్నారు. అందుకు ఈసారి చాలామంది మెంటల్​ ఫిట్​నెస్​పై ఫోకస్​ పెట్టారు. మన దేశానికి చెందిన టీమ్స్​ మెడిటేషన్​ చేస్తున్నాయి. మొత్తానికి ప్రపంచ యుద్ధాల సమయంలో మాత్రమే ఆగిపోయిన ఒలింపిక్స్​.. ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్​ను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాయి. మెగా గేమ్స్​ను సక్సెస్​ చేసేందుకు టోక్యో ఆర్గనైజర్స్​, జపాన్​ గవర్నమెంట్‌‌‌‌, ఐఓసీ పని చేస్తున్నాయి. టోక్యో గేమ్స్​ విజయవంతంగా పూర్తయితే.. జపాన్ గవర్నమెంట్‌‌‌‌, ఐఓసీ మాత్రమే గెలిచినట్టు కాదు.. ప్రాణాంతక వైరస్​పై ఈ ప్రపంచమే గెలిచినట్టు అవుతుంది. 


యుద్ధాలు ఆపేందుకు మొదలై..
ఒలింపిక్స్‌‌‌‌ ముచ్చట ఈనాటిది కాదు. దీనికి 3000 ఏండ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం776లోనే ఒలింపిక్స్‌‌‌‌ షురూ అయ్యాయి. క్రీస్తు శకం 393 తర్వాత ఆగిపోయాయి. వాటిని  ప్రాచీన ఒలింపిక్‌‌‌‌ క్రీడలుగా పిలిచారు. మళ్లీ 1896లో మొదలై, నాలుగేళ్లకోసారి జరుగుతున్నాయి. వీటిని  ఆధునిక ఒలింపిక్స్‌‌‌‌ అంటున్నారు. ఇవి  ప్రపంచ యుద్ధాల సమయంలో (1914, 1940, 1944)  ఆగిపోగా.. ఇప్పుడు కరోనా కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా మొదలయ్యాయి. ఒలింపిక్స్‌‌‌‌ పుట్టుక వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. క్రీస్తు పూర్వం ఎనిమిదో శతాబ్దంలో గ్రీకు సామ్రాజ్యంలోని రాజ్యాల మధ్య తరచూ యుద్ధాలు జరిగేవి. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడేవాళ్లు. గ్రీకు సామ్రాజ్యంలో ఎప్పుడూ అశాంతి ఉండేది. దాంతో, ఈ యుద్ధాలు ఆపి, రాజ్యాల మధ్య శాంతి నెలకొల్పాలని గ్రీకులు  అనుకున్నారు. అందుకు రాజ్యాల మధ్య ఆటలు ఆడించడమే మంచిదని నిర్ణయించారు. అలా క్రీస్తు పూర్వం 776లో తొలిసారి దక్షిణ గ్రీసులో ఒలింపియా అనే  ప్రాంతంలో ఆటల పోటీలను  షురూ చేశారు. క్రమంగా దానికి ఒలింపిక్స్‌‌‌‌ అనే పేరొచ్చింది. ప్రతీ నాలుగేండ్లకోసారి నిర్వహించే ఈ గేమ్స్‌‌‌‌ జరిగేటప్పుడు యుద్ధాలు ఆపేవారు. ప్రజలు తమ పనులన్నీ పక్కన పెట్టి మరీ.. క్రీడలు జరిగే పట్టణానికి  వచ్చేవాళ్లు. కానీ, రోమ్‌‌‌‌ చక్రవరి  థియోడొసియస్‌‌‌‌ గ్రీస్‌‌‌‌ సామ్రాజ్యాన్ని జయించాక అన్ని ఉత్సవాలను బంద్‌‌‌‌ చేశారు. దాంతో, క్రీస్తు శకం 393లో ఒలింపిక్స్‌‌‌‌ కూడా ఆగిపోయినయ్‌‌‌‌. అయితే, ఫ్రాన్స్‌‌‌‌కు చెందిన చరిత్రకారుడు చార్లెస్‌‌‌‌ పియెర్‌‌‌‌ డి ఫ్రెడీ, బెరోన్‌‌‌‌ డి కౌబర్టిన్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌ను మళ్లీ మొదలు పెట్టేందుకు కృషి చేశారు.ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ (ఐఓసీ)ని 1896లోస్థాపించారు. వీళ్ల కృషి వల్ల.. ప్రాచీన క్రీడలు ఆగిన ప్రదేశం ఏథెన్స్‌‌‌‌లోనే 1896లో  ఆధునిక ఒలింపిక్స్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ అయ్యాయి. ఆ గేమ్స్‌‌‌‌లో 14 దేశాలకు చెందిన 241 అథ్లెట్లు పోటీ పడ్డారు. వాళ్లంతా పురుషులే. పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా నాలుగేళ్లకోసారి గేమ్స్‌‌‌‌ నిర్వహిస్తున్నారు. ఆధునిక ఒలింపిక్స్‌‌‌‌నే అధికారిక గేమ్స్‌‌‌‌గా గుర్తించగా... ఇప్పటిదాకా 28 ఎడిషన్లు జరిగాయి. ప్రపంచ యుద్ధాల కారణంగా మూడు ఎడిషన్లు రద్దయ్యాయి. 
ఒలింపిక్స్‌‌‌‌లో ఆటను ఎట్ల చేరుస్తరంటే..
ప్రపంచంలో చాలా ఆటలు ఆడతారు. ఒక దేశంలో ఒక స్పోర్ట్‌‌‌‌ ఫేమస్‌‌‌‌ అయితే, ఇంకో దేశంలో ఇంకోదానికి క్రేజ్‌‌‌‌ ఉంటుంది. అయితే నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌‌‌‌లో అన్ని ఆటలు ఆడించరు. టోక్యో గేమ్స్‌‌‌‌లో 33 గేమ్స్‌‌‌‌ మాత్రమే ఉన్నాయి. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్‌‌‌‌లో లేని ఐదు ఆటలను ఈ గేమ్స్‌‌‌‌లో చేర్చారు. అయితే, ఒలింపిక్స్‌‌‌‌లో ఓ స్పోర్ట్‌‌‌‌ను చేర్చడం అంత ఈజీ కాదు. దీనికి పెద్ద ప్రాసెస్​ ఉంటుంది. ముందుగా ఆ ఆట ఒలింపిక్‌‌‌‌–లెవల్‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌ అయి ఉండాలి. ఇంటర్నేషనల్‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌ కమిటీ(ఐవోసీ)కి అనుబంధంగా ఉండే ఇంటర్నేషనల్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌ దాన్ని గుర్తించాలి. మెన్స్‌‌‌‌లో  ఆ స్పోర్ట్స్‌‌‌‌ను కనీసం75 దేశాలు, నాలుగు ఖండాల్లో... విమెన్‌‌‌‌లో 40 దేశాలు, మూడు ఖండాల్లో ఆడుతుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా అది ఫిజికల్‌‌‌‌ స్పోర్ట్‌‌‌‌ అయి ఉండాలి. ఈ అర్హతలు ఉండే ఆటకు ఒలింపిక్స్‌‌‌‌ హోదా ఇవ్వాలని కోరుతూ సదరు స్పోర్ట్స్‌‌‌‌ ఫెడరేషన్.. ఐఓసీకి పిటిషన్‌‌‌‌ ఇవ్వాలి. దాన్ని పరిశీలించాక ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌‌‌‌ బోర్డు  సదరు ఆటను రాబోయే ఎడిషన్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో చేర్చాలని రికమండ్‌‌‌‌ చేస్తుంది. తర్వాత ఐఓసీ సెషన్‌‌‌‌ దీనికి అప్రూవల్‌‌‌‌ ఇస్తే..  ఆ గేమ్‌‌‌‌ను ఒలింపిక్స్‌‌‌‌లో ఆడిస్తారు.