పులి జాడేది ? బతికే ఉందా ? చనిపోయిందా ? ..కామారెడ్డి జిల్లాలో 10 రోజుల కింద కనిపించిన పులి

 పులి జాడేది ? బతికే ఉందా ? చనిపోయిందా ? ..కామారెడ్డి జిల్లాలో 10 రోజుల కింద కనిపించిన పులి
  • రామారెడ్డి మండలం స్కూల్‌‌ తండా ఏరియాలో ఆవుపై దాడి.. విషప్రయోగం
  • పులి ఆచూకీ కోసం గాలిస్తున్న ఫారెస్ట్‌‌ సిబ్బంది

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో పది రోజుల కింద కనిపించిన పెద్ద పులి ఇప్పుడు ఎక్కడ ఉంది ? ఎటు వైపు వెళ్లింది ? అనేది అంతు చిక్కడం లేదు. ఇటీవల విష ప్రయోగం జరిగిన తర్వాత పులి ట్రాక్‌‌ కెమెరాలకు సైతం చిక్కకపోవడంతో అసలు బతికే ఉందా ? చనిపోయిందా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

పది రోజుల కింద ఆవుపై దాడి.. విషప్రయోగం

రామారెడ్డి మండలం స్కూల్‌‌ తండా ఫారెస్ట్‌‌ ఏరియాలో ఈ నెల 11న ఓ వ్యక్తికి చెందిన ఆవుపై పులి దాడి చేసింది. పులి మళ్లీ దాడులు చేసే అవకాశం ఉందన్న కారణంతో ఆవు కళేబరంపై కొందరు వ్యక్తులు గడ్డి మందు చల్లినట్లు ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు నలుగురిని అదుపులోకి తీసుకున్న ఆఫీసర్లు పులి జాడ కోసం గాలించడం మొదలుపెట్టారు. విష ప్రయోగానికి ముందు రామారెడ్డి మండలంలోని ఫారెస్ట్‌‌ ఏరియాలో పులి పాదముద్రలు గుర్తించగా... విష ప్రయోగం తర్వాత మాచారెడ్డి ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ ఏరియాలో పాదముద్రలను గుర్తించారు. కానీ ఇప్పుడు పులి ఎక్కడుంది అన్న విషయం మాత్రం తేలడంలేదు. 

ట్రాక్‌‌ కెమెరాలకూ చిక్కలే...

స్కూల్‌‌ తండా ఏరియాలో ఆవుపై దాడి చేసిన తర్వాత.. మాచారెడ్డి ఫారెస్ట్‌‌ రేంజ్‌‌ ఫరిదిలో ఆరు ట్రాక్‌‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. మూడు స్పెషల్‌‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేసి పది రోజులుగా అడవిలో గాలిస్తున్నా పులి ఆచూకీ దొరకడం లేదు. అలాగే ప్రతి 2 కిలోమీటర్ల రేడియస్‌‌తో ట్రాక్‌‌ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ పులికి సంబంధించిన విజువల్స్‌‌ మాత్రం రికార్డు కాలేదు. 

దీంతో విషప్రయోగం తర్వాత పులి ఏమైంది అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఆవుపై మొదటి సారి దాడి చేసిన తర్వాత పులి మళ్లీ రెండోసారి రాకపోవచ్చని, ఒకవేళ వచ్చినా ఆవుపై గడ్డి మందు చల్లినందున వాసన పసిగట్టి తినదని ఆఫీసర్లు చెబుతున్నారు. పులి ఇతర అటవీ ప్రాంతం వైపు వెళ్లి ఉండవచ్చని 
అభిప్రాయపడుతున్నారు.