బల్దియా అధికారుల్లో  బదిలీల టెన్షన్

బల్దియా అధికారుల్లో  బదిలీల టెన్షన్
  • మూడేండ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉన్నతాధికారుల ట్రాన్స్​ఫర్లు తప్పనిసరి
  •  సీఎస్​కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు 
  • కమిషనర్ సహా కొందరు అడిషనల్, జోనల్, డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యే చాన్స్​
  •  డివిజన్​ పాలనపై ఎఫెక్ట్

హైదరాబాద్, వెలుగు:  జీహెచ్ఎంసీ అధికారులకు ట్రాన్స్​ఫర్ల టెన్షన్ పట్టుకుంది. ఒకేచోట మూడేండ్లకు మించి పనిచేస్తున్న అధికారులను తప్పనిసరిగా బదిలీ చేయాలని, వచ్చే నెల 31లోపు ఈ ప్రాసెస్ పూర్తికావాలని సీఎస్​కు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ లెక్కన చూస్తే  బల్దియాలో కమిషనర్ సహా, అడిషనల్ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్ల బదిలీలు తప్పనిసరి కానున్నాయి. దీంతో బల్దియా సర్కిల్ ఆఫీసుల్లో ఎక్కడ చూసినా  ట్రాన్స్​ఫర్లపైనే  చర్చ సాగుతోంది.

ఏండ్లుగా ఒకే చోట..

జీహెచ్ఎంసీ కమిషనర్​గా లోకేశ్ కుమార్ 2019 నుంచి కొనసాగుతున్నారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారిగా కూడా ఆయనే పనిచేస్తున్నారు. అదేవిధంగా కొందరు అడిషనల్ కమిషనర్లు మూడేండ్లకు పైగా జీహెచ్ఎంసీలో కొనసాగుతున్నారు. మొత్తం ఆరుగురు జోనల్ కమిషనర్లు ఉండగా.. అందరూ బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 30 సర్కిళ్లు ఉండగా దాదాపు డిప్యూటీ కమిషనర్లంతా ఏళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నారు. దీంతో వారంతా బదిలీ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతర విభాగాల అధికారులు ఎన్నికల విధులు నిర్వహించి ఏండ్లుగా ఒకేచోట కొనసాగుతుండగా.. వారిని కూడా ట్రాన్స్​ఫర్ చేసే చాన్స్​ ఉంది.

కరోనా ఎఫెక్ట్​తో..


జీహెచ్ఎంసీలో గత మూడేండ్లుగా పెద్దగా బదిలీలు జరగలేదు. ట్రాన్స్​ఫర్లు చేయకపోవడానికి కరోనా ఓ కారణమైంది. కనీసం డిప్యూటేషన్​పై వచ్చిన వారిని కూడా తిరిగి వెనక్కి పంపలేక పోయారు. ఐదారేండ్లుగా వారంతా జీహెచ్ఎంసీలోనే పనిచేస్తున్నారు. కేవలం అవసరం మేరకే కొందరు అధికారుల బదిలీలు జరిగాయి. చాలా విభాగాల్లో పనిచేస్తున్న అధికారులను గత మూడున్నర ఏండ్లలో ఏకకాలంలో ట్రాన్స్ ఫర్ చేయలేదు. అయితే కొన్ని రోజులుగా డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో పాటు వివిధ విభాగాల హెచ్ వోడీల బదిలీలు ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే, మంచి పోస్టుల కోసం తమకు పరిచయమున్న ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల చుట్టూ కొంత మంది అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు తప్పనిసరిగా బదిలీలు చేయాల్సి ఉండటంతో ఆ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసినట్లు సమాచారం.

డివిజన్ కమిటీ ట్రైనింగ్ సమావేశంలోనూ అదే చర్చ

జీహెచ్ఎంసీలో డివిజన్ పాలనపై కొద్ది రోజుల పాటు హడావుడి సాగింది. ఇందుకోసం 150 మంది అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, సూపరిండెంట్లను ఇప్పటికే ట్రాన్స్​ఫర్ చేశారు. ఇంకా డివిజన్ పాలన మొదలుకాకపోవడంతో వారు విధులు నిర్వహించడం లేదు. అయితే ఈ ప్రాసెస్ కొనసాగుతున్న సమయంలోనే ఉన్నతాధికారులు బదిలీ అంశం తెరపైకి రావడంతో డివిజన్ పాలనపై ప్రభావం పడింది.  ఇటీవల జరిగిన డివిజన్ కమిటీ ట్రైనింగ్ సమావేశంలో జీహెచ్ఎంసీలోని హెచ్​వోడీలు, అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొనగా.. ఆ సమావేశంలోనూ ట్రాన్స్​ఫర్ల అంశంపైనే చర్చ జరిగింది. దీంతో డివిజన్ పాలనకు సంబంధించి కసరత్తుపై ఉన్నతాధికారులు పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఏ ఇద్దరు అధికారులు, ఉద్యోగులు కలిసినా ట్రాన్స్​ఫర్లపైనే చర్చ జరుగుతోంది. బదిలీలు ఎప్పుడు జరుగుతాయి, ఏ అధికారి బదిలీ అవుతారోనని అంతా చర్చించుకుంటున్నారు.