ఆర్టిస్ట్​లకు, మ్యుజీషియన్లకు ఫేమస్ ప్లేస్ బుందీ

ఆర్టిస్ట్​లకు, మ్యుజీషియన్లకు ఫేమస్ ప్లేస్ బుందీ

ఎటు చూసినా రాజభవనాలు, కోటలు, సరస్సులు... ఒక్క మాటలో చెప్పాలంటే వాటి అందాలతో కళకళలాడుతుంటుంది బుందీ. ఆర్టిస్ట్​లకు, మ్యుజీషియన్లకు ఫేమస్ ఈ ప్లేస్. ఒకప్పుడు ... అంటే ప్రాచీనకాలంలో బుందీలో రకరకాల తెగలవాళ్లు ఉండేవాళ్లు. ఆ తెగలన్నిట్లోకీ ముఖ్యమైనది ‘పరిహార మీనా’. ‘బుందా మీనా’ అనే రాజు పేరు మీద ఈ ప్రాంతం ఏర్పడిందని చెప్తుంటారు. బుందీని గతంలో ‘బుందా–కా-–నల్’ అని పిలిచేవారు. ‘నల్’ అంటే ‘ఇరుకైన మార్గం’ అని అర్థం. జైతా మీనా రాజు నుంచి రావ్ దేవా హడా1342 లో బుందీని స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత ఆ ప్రాంతానికి ‘హడవతి’ లేదా ‘హడౌతీ’ అనే పేరు పెట్టాడు. హడా రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని 200 ఏండ్ల పాటు పరిపాలించారు. 

రాజస్తానీ సంప్రదాయం

ఇప్పటికీ వందల ఏండ్ల కిందటి కాలాన్ని గుర్తు చేస్తుంది బుందీ. ఈ ప్రాంతాన్ని గతంలో ‘రిపబ్లిక్ ఆఫ్ మీనాస్’ అని పిలిచేవారు. అప్పట్లో బుందీకి ఎవుసమే ప్రధాన వృత్తి. మీనాలు, గుజ్జర్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, అహిర్లు, ధాకర్లతో పాటు, మలిసంద్ నాయీలు కూడా బుందీలో ఉండేవాళ్లు. వాళ్లు రాజస్తానీ కల్చర్, కట్టుబాట్లను పాటిస్తారు. ఇక్కడ హిందీ, రాజస్తానీ బాగా మాట్లాడతారు. బుందీలో ‘కాళీ తీజ్’ పండుగను బాగా జరుపుకుంటారు. ఈ పండుగ జులై నుంచి ఆగస్ట్ మధ్య రెండురోజులు జరుగుతుంది. దాంతోపాటు గంగౌర్, దీపావళి, హోలీ, దసరా, రక్షాబంధన్ వంటి పండుగలు జరుపుకుంటారు. బుందీ కల్చర్​లో ప్రధానంగా సంగీతం, చిత్రకళ ఉంటాయి. అందుకే ఈ ప్రాంతంలో సింగర్స్, మ్యుజీషియన్లు ఎక్కువమంది ఉంటారు. బుందీ చిత్రకళా విధానం మొఘల్​, రాగమాల నుంచి వచ్చింది. 

బుందీ గఢ్​ ప్యాలెస్ 

మనదేశంలోని అతిపెద్ద ప్యాలెస్‌‌లలో ఒకటి గఢ్​ ప్యాలెస్. ఈ ప్యాలెస్ రాజ్‌‌పుత్ ఆర్కిటెక్చర్​కి ఫేమస్. డిజైన్స్​లో చాలా వరకు ఏనుగు శిల్పాలు కనిపిస్తాయి. 
ఈ ప్యాలెస్​లో మ్యూరల్ పెయింటింగ్ గ్యాలరీ ఉంది. 

ఛత్తర్ మహల్

ఛత్తర్ మహల్​ని చతర్ శాల్ అనే రాజు కట్టించాడు. ఈ భవనాన్ని బుందీలోని క్వారీలలో దొరికిన రాళ్లతోనే కట్టారు. ఇది ఒకప్పుడు అందమైన గార్డెన్. ఇందులో ఫౌంటైన్‌‌లు, రకరకాల చేపలు ఉండే కొలనులు ఉండేవి. ఛత్తర్ అంటే పెయింటింగ్ అని అర్థం. ఛత్తర్ ప్యాలెస్‌‌లో చిత్రశాల కూడా ఉంది.18వ శతాబ్దంలో, బుందీ మైక్రో ఆర్ట్​ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్లు. 

బాదల్ మహల్

బాదల్ మహల్​నే ‘క్లౌడ్ ప్యాలెస్’ అని కూడా పిలుస్తారు. ఇది గర్ ప్యాలెస్‌‌లో ఉంది. పెద్ద పెద్ద గోడల మీద ఉన్న పెయింటింగ్స్​ కళ్లు తిప్పుకోనీయవు. వాటిలో చైనీస్ కల్చర్ ప్రభావం కనిపిస్తుంది. రాజ నివాసాన్ని రెండు వేరు వేరు కాలాల్లో కట్టారు. బుందీలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశం ఇది.

ఫూల్ సాగర్ లేక్

ఫూల్ సాగర్​ని రాజ కుటుంబానికి చెందిన వారసుల ఆస్తిగా చెప్తారు. ఇది ఆర్టిఫిషియల్ సరస్సు. చుట్టూ తోటలతో ఇది ఎంతో అందంగా ఉంటుంది. సరస్సు ఒడ్డున ఒక ప్యాలెస్ ఉంది. దానివల్ల ఈ సరస్సు ఫేమస్ అయింది. ఆ ప్యాలెస్‌‌లో ఇటాలియన్ ఖైదీలు డిజైన్ చేసిన పెయింటింగ్ప్​ కలెక్షన్ ఉంది. ఇవే కాక, తారాగఢ్ కోట, రాణీజీ కీ బావరీ, నవల్ సాగర్, సుఖ మహల్, చౌరాసీ, జైత్ సాగర్ లేక్​, ఫూల్ సాగర్, షికర్ బుర్జ్,  దబాయ్ కుండ్, నాగర్ సాగర్ కుండ్, 84 స్తంభాల సెనోటాఫ్, ఫూల్‌‌మహల్, లేక్ కనక్ సాగర్, రామ్‌‌గఢ్​ విష్ధారి అభయారణ్యం వంటి ఫేమస్ టూరిస్ట్ ప్లేస్​లు ఎన్నో ఉన్నాయి. జైపూర్, ఆగ్రా, వారణాసి, డెహ్రాడూన్ లాంటి సిటీలకు రైలు మార్గం ఉంది. బుందీకి బస్సులు కూడా ఉంటాయి. బుండీ టూర్​కి అక్టోబర్ నుంచి మార్చి మధ్య బెస్ట్​ టైం.