ఇంగ్లాండ్పై ఇండియా గెలుస్తుందా..? రికార్డ్స్ ఏం చెబుతున్నాయి..?

ఇంగ్లాండ్పై ఇండియా గెలుస్తుందా..? రికార్డ్స్ ఏం చెబుతున్నాయి..?

టీ20 వరల్డ్ కప్ 2022 టీమిండియా అద్భుతంగా రాణించింది. పాక్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ నుంచి...సూపర్ 12లో చివరగా జింబాబ్వేతో జరిగిన లాస్ట్ మ్యాచ్ వరకు అంచనాలకు తగ్గట్లు ఆడింది. అయితే ఒక్క సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ను మినహాయిస్తే..రోహిత్ సేన..దుమ్మురేపింది. ఇదే క్రమంలో గ్రూప్ 2లో టాపర్గా నిలిచి సెమీస్కు దూసుకెళ్లింది. సెమీస్లో టీమిండియా..పటిష్ట ఇంగ్లాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. మరి ఇంగ్లాండ్ను టీమిండియా ఓడిస్తుందా...గణాంకాలు ఏం చెబుతున్నాయి...? ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో ఎవరిది పైచేయి...?

ఇండియానే బెటర్...
జట్టు పరంగా చూస్తే..టీమిండియా కంటే..ఇంగ్లాండే కొద్దిగా బెటర్ కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్ లో గణాంకాలను పరిశీలిస్తే..టీమిండియాదే పైచేయిగా ఉంది. టీ20ల్లో ఇప్పటి వరకు రెండు జట్లు  22 సార్లు తలపడ్డాయి. ఇందులో  భారత్ 12 సార్లు గెలిస్తే..ఇంగ్లండ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.  ఇక టీ20 ప్రపంచకప్‌లో రెండు జట్లు మూడు సార్లు ఢీకొన్నాయి. 2007, 2009, 2012 టీ20 వరల్డ్ కప్ లలో రెండు జట్లు తలపడ్డాయి. వీటిల్లో టీమిండియా  రెండు మ్యాచుల్లో గెలిచింది.  ఇంగ్లండ్ మాత్రం ఒక్కసారి విజయం సాధించింది. 

2007 మ్యాచును మర్చిపోగలమా..?
2007లో మొదటిసారిగా జరిగిన మ్యాచ్ లో రెండు జట్లు తలపడగా..అందులో టీమిండియానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ ను  భారత అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా  స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్  6 బంతులకు 6 సిక్స్‌ల ఇన్నింగ్స్  క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటుంది.  ఈ గేమ్ లో యువీ 16 బంతుల్లో3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 58 పరుగులు చేయడంతో...మొదట బ్యాటింగ్ చేసిన భారత్... 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. యువీకి తోడు.. వీరేంద్ర సెహ్వాగ్ 52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68 పరుగులు,  గంభీర్ 41 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 58 రన్స్ చేసి  రాణించారు. ఆ తర్వాత ఇంగ్లండ్ 200 పరుగులే చేసి 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

2009లో పఠాన్ పోరాడినా ఓటమి..
ఇక 2009 టీ20 వరల్డ్ కప్ లో భారత్‌  ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. హోరాహోరీగా  సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో గెలిచింది.  మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్  20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి.. 153 పరుగులు సాధించింది. ఆ తర్వాత  భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి  150 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ధోనీ 30 పరుగులతో,  యూసుఫ్ పఠాన్ 33 పరుగులతో రాణించినా..భారత్ పరాజయం చవిచూసింది. 

ఇంగ్లాండ్ నడ్డి విరిచిన భజ్జీ..
ఇక 2012లో జరిగిన టీ20  వరల్డ్ కప్ లో మాత్రం టీమిండియా 90 పరుగుల తేడాతో గెలిచింది. మొదట  బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 170 పరుగులు సాధించింది. ఆ తర్వాత  ఇంగ్లండ్ 14.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు.  కోహ్లీ40 పరుగులు,  గౌతమ్ గంభీర్45 పరుగులు చేసి  రాణించారు. బౌలింగ్ లో హర్భజన్ సింగ్ 4  వికెట్లతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు.

చివరి ఐదు మ్యాచుల గణాంకాలు..
రెండు జట్ల మధ్య చివరగా జరిగిన ఐదు మ్యాచులను గమనిస్తే..అందులో భారతే నాలుగింటిలో గెలవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై జరిగిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను భారత్ 2-1తో దక్కించుకుంది. 2021లో స్వదేశంలో జరిగిన  రెండు మ్యాచుల్లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. రెండు దేశాల మధ్య జరిగిన టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా కోహ్లీ నిలిచాడు. అతను 589 పరుగులు సాధించాడు.  చాహల్‌కు అత్యధిక వికెట్లు తీశాడు. 11 మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడగొట్టాడు.