‘గౌడు అంటే కల్లు’, ‘కల్లు అంటే గౌడు’

 ‘గౌడు అంటే కల్లు’, ‘కల్లు అంటే గౌడు’

పరిపరి విధాల పోతున్న మనసు దేనిమీదా లగ్నం కావడం లేదు. ఎందుకిలా? అల్లుడు, కూతురు, పిల్లలు అందరూ వస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంటుంది. అది సందడా? కిక్కిరిసి ఉండటమా? ఇల్లు ఇరకటం.. ఇల్లాలు మర్కటం. ఇల్లాలి సంగతేమో కానీ ఇల్లు మాత్రం ఇరకటమే. పండుగ వెళ్ళదీయడమెలా? ఏదో ఆందోళన గతాన్ని, వర్తమానాన్ని కళ్ళముందు నిలుపుతుంది. గీత కార్మికుడిగా బాపు జీవితం ఛిద్రమైంది. ఆ బతుకు నుండి నన్ను బయటపడేయాలని తపించేవాడు. ‘గౌడు అంటే కల్లు’, ‘కల్లు అంటే గౌడు’ అనే మాట వాడుకలో ఉండేది. అందుకు భిన్నంగా నేను బతకాలని ఆయన ఆశపడ్డాడు. తాటిచెట్టు ఎక్కేటప్పుడు మోకు జారి కిందపడి బాపు కాలు విరిగింది. దాంతో జీవితాంతం అవిటివాడిగా బతికాడు. చెట్టు ఎక్కేటప్పుడు కాలుజారి, చెట్టు విరిగి, పురుగు కుట్టి ప్రాణాలు గాలిలో కలిసినవారు, జీవచ్ఛవాలుగా బతుకీడ్చిన వారు అనేక మంది. వాళ్లందరినీ చూసి ఈ వృత్తిలోకి దిగకూడదని, ఎలాగైనా బాపు కోరిక నెరవేర్చాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నా. 

ఇంటి పెద్దదిక్కు అవిటివాడు అయితేనో, చనిపోతేనో ఆ ఇల్లాలు, పిల్లలు అనాథలుగా మారడం కళ్ళారా చూసిన అనుభవం నన్ను కులవృత్తికి దూరం చేసింది. అప్పుడప్పుడే ఊళ్లోకి ప్రవహించిన బీరు, బ్రాందీలు గౌడుల ఆర్థిక పరిస్థితిపై దెబ్బతీశాయి. అది కనిపెట్టిన బాపు నన్ను పట్నం చదువులకు పంపాడు. ఆర్థిక లేమి వల్ల హాస్టల్​లో చదువుకోవడం, కుటుంబ అవసరం వల్ల కొలువులో చేరడం వెంటవెంటనే జరిగాయి. దొరికిన ఆర్థిక స్వేచ్ఛ నాకు ఆనందాన్ని, బాపుకు ప్రశాంత మరణాన్ని ఇచ్చింది. పెళ్లికాక ముందే కుటుంబ భారం నెత్తిన పడింది. పెళ్లయ్యాక అది రెండింతలయింది. 

‘‘జబ్బలు జారేసి కూసున్నవు. పిల్లలస్తున్నరంటివి. బస్టాండు దాక పోకపోయినవు?” నా ఆలోచనలను చెదరగొడుతూ భార్య మాట వినిపించింది. 
 “ఇక్కడిదాక వచ్చినోళ్ళు ఇంటిదాక రారా?” అడిగా.“పోవయ్యా పో.... పోయి రాపో” అని ఈసారి గట్టిగా సమాధానమొచ్చింది.

మనుమరాళ్ళ ముద్దుమురిపాలు కడుపు నింపుతుంటే ఆనందభాష్పాలు రాలాయి. అల్లరి ఎంత అందమైనది. రోజూ ఉండే నిశ్శబ్దం మాయమైంది. ఇంట్లో ఎక్కువ మంది. ఎక్కువ పని. పండుగ వాతావరణం.ఆలోచనలు గతంలోకి తొంగిచూశాయి. చదువు పూర్తయ్యాక బ్యాంకులో ఉద్యోగం దొరికింది. జీతం చిన్నది. బతుకులు పెద్దవి. ఒదిగి బతకడం అలవాటయింది. కొత్త బట్టలు లేకుండా మా పిల్లలు పండుగల్ని హాయిగా వెళ్ళదీశారు. ఇప్పటి పిల్లలు అలా లేరు. పెన్షన్ లేని బతుకు. తొలినాళ్ళ జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చింది. నేటి స్థితి, నాటి స్థితికి భిన్నంగా లేదు. మారిందేమిటి? కుటుంబం పెరిగింది. కిరాయి కొంప కొనసాగింది.
“పండుగ నాడు కూడా పచ్చిపులుసేనా? మటన్ పులుసు పిల్లలకు పెడదాం” ఇంట్లో నుండి కేక. 
“మంచిది...” 

“చేతులూపుకుంటూ పోకు. టిఫిన్ బాక్సు తీసుకపో. వాడిచ్చే ప్లాస్టిక్ కవర్ పనికిరాదు” “అబ్బో నీ ప్లాస్టిక్ స్పృహ పెద్దదే”.
చిన్నప్పుడు మేక మాంసాన్ని మోదుగాకులో పెట్టుకొని తెచ్చేవాడు బాపు. ఆ తరువాత రాతెండి గిన్నె, స్టీల్ గిన్నె, ఇప్పుడు ప్లాస్టిక్ కవర్​లో తీసుకురావడం అలవాటయింది. ఆకు ప్రకృతి. ప్లాస్టిక్ వికృతి. మనం అటో.. ఇటో.. ఎటు పోతున్నామో అర్థమై నవ్వొచ్చింది.
“సారు, కూర ఏపాటి ఇయ్యాలె?” 
“కిలో ఇవ్వు.” 
“అదేంది ఎప్పుడు పావు....” 
“అల్లుడు, బిడ్డ, పిల్లలు వచ్చారు.” 
“అట్లనా...”


నా యవ్వనమంతా ఉద్యోగంతో సరిపోయింది. ఉద్యోగం సంపాదననిచ్చింది. బతుకు గడిచింది. వృద్ధాప్యం వచ్చింది. ఉద్యోగం విశ్రాంతి తీసుకోమంది. పనిలేదు. పైసలేదు. భూమిలాగే జీవితం కూడా గుండ్రంగా తిరిగింది. బ్యాంకు ఉద్యోగం ఉందని పిల్లనిచ్చారు. పెళ్ళితో పిల్లలు, పురుళ్ళు, చదువులు, వాళ్ల పెళ్ళిళ్ళు అన్నీ వచ్చాయి. బ్యాంకు కొలువు దయ వల్ల అవన్నీ పూర్తయ్యాయి. జీతం చిన్నది. ఇల్లాలి సొంతింటి కల మాత్రం పూర్తి కాలేదు. ఉద్యోగ కాలం పూర్తి అయింది. కొన్ని ఉద్యోగాలకు పెన్షన్ సౌకర్యం లేకపోవడం విచిత్రం. లేనిదాని పాలబడటం నా దురదృష్టం. భద్రత, అభద్రతల నడుమ జీవితం లోలకంగా మారడం అర్థమై మనసు మూలిగింది. నవ్వు వినిపించింది. తలెత్తి చూశాను. వాకిట్లో ఆమె నవ్వుతూ నిల్చుంది.

“నా కోసం ఎదురుచూస్తున్నావా?” 
“ఎందుకా పరధ్యానం. ఇప్పుడేమైందని..?” 
“తొందరగా వండు. పిల్లలకు ఆకలి అయితుంది కావచ్చు.” 
“రంది పడకు. రిటైర్మెంట్ డబ్బుల్ని పోస్టాఫీసులో డిపాజిట్ చేసినవు కదా. వాటిపై వచ్చే వడ్డీతో కాలం గడపవచ్చు. మనిద్దరికి కోరికలు లేవు. ఖర్చులు ఉండవు.”
“నువ్వు అల్పసంతోషివి.” 
“అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడుచేసుకోను. నేను ఆశావాదిని. ప్రయత్నిస్తే పనిదొరక్కపోదు.”
‘‘తాతయ్యా!’’ అంటూ పిల్లలు చుట్టుకున్నారు. వాళ్ళను చూసేసరికి రంది కరిగింది. ఇద్దర్నీ ఒక్కో చంక కెత్తుకుని వృద్ధ భీముడిలా ఇంట్లో అడుగుపెట్టా. నవ్వుతూ అమ్మాయి ఎదురొచ్చింది. భోజనాలయ్యాయి. కాస్త కునుకు తీద్దామని మంచమెక్కాను. ఇద్దరు పిల్ల రాక్షసులు ఊడిపడ్డారు. చెరొక వైపు పడుకొని నిద్ర నటిస్తూ గుర్రు పెట్టసాగారు.
“యాక్షన్ చాల్లే. లేచి కూర్చోండి.” 
“తాతయ్యా నువ్వేమైనా చెప్పు.” 
“మీకు పద్యమో, పాటో వస్తే పాడండి...” 
“మేం ఎక్కువగా టీవీ సీరియల్స్ చూస్తం. అందులో ఇలాంటివి ఉండవు” 
“సరే అయితే, మీ క్లాసు పుస్తకాల్లో ఉన్నవి చెప్పండి...’’
“అబ్బో... అవి మహాబోర్..” అంటూ చిన్నది లేచి వెళ్ళింది. 
“తాతయ్యా! నువ్వే ఏదయినా కథ చెప్పు.” అంది పెద్దది.

ఆ మాట వినగానే గతం గిర్రున తిరిగింది. చిన్ననాటి వృత్తి జీవితం కళ్ళముందు కదిలింది. ‘మండువ’ సాక్షాత్కరించింది. అది కల్లుపోసేవారి, తాగేవారి కూడలి. చాలామంది కూర్చునేవారు. గౌడు కల్లు పోస్తే గుడాలు, గారెలు, వండిన మాంసం నేను అమ్మేవాణ్ణి.  తాగేవాళ్ళు మండువా లోగిలిలో కష్టసుఖాలు కలబోసుకునేవారు. అది విని పక్కవారు పరిష్కారమో, సానుభూతి మాటలో చెప్పేవారు. అదొక మినీ ప్రపంచం. అన్నిట్లో మార్పులు వచ్చినట్లే కల్లు వ్యాపారంలో కూడా మార్పులు వచ్చాయి. కల్లుగీసేవారు ఒక్కరైతే, కల్లు అమ్మేవారు మరొకరయ్యారు. అలాంటి వారు తమ ఇంటి ముందే కల్లు పోయడం ప్రారంభించారు. వాళ్లే మాంసం, చేపలు వండి పెట్టేవారు. పిండిపదార్థాలు చేసి పెట్టేవారు. తాగే వాళ్ళు తాగినంత తాగి మిగతాది సీసాల్లో పోసుకొని వెళ్ళేవారు. ఇందుకు అనుగుణంగానే బింకిల స్థానంలో సీసాలు, ప్లాస్టిక్ క్యాన్స్ వచ్చాయి. బాపుకు ఈ పని ఇష్టం ఉండేది కాదు. మరోపని చేయరాకపోవడం వల్ల దుకాణంలో కూర్చునేవాడు. అదే నన్ను పట్నం నడిపించింది. ఉద్యోగం చేసేలా చేసింది. ఎప్పుడైతే గౌడు వ్యాపారిగా మారాడో మండువ ఒంటరిదైంది. సామూహికత ఛిద్రమైంది. నాలాంటి వారు ఎందరో ఊరు విడిచారు. వలసబాట పట్టారు.

“తాతయ్యా, నిద్ర పోయావా?” అంది మనుమరాలు.
“లేదు పోవాలనుకుంటున్న.. బిడ్డా” అన్నా... అంతే అన్నీ అర్థమైనదానిలా అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా అక్కడ్నించి వెళ్లిపోయింది.


“కష్టం, కష్టం అంటావెందుకు? నీవు చేసిన ఉద్యోగంలో కష్టం లేదా? రామారం రాజకీయనాయకుడి వద్ద బ్యాంకు పైసలు వసూలుకు ఎంత కష్టపడ్డావో యాదికి తెచ్చుకో...” అందామె.
నిజమే భూమి తనఖా పెట్టుకొని దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేవాళ్ళం. అందుకే మా బ్యాంకును ‘భూ తనఖా బ్యాంకు’ అనేవారు. ఇచ్చిన డబ్బుపై వడ్డీ వసూలుకు ఆయన దగ్గరకు వెళ్ళాలంటే భయమయ్యేది. మహా మొండిఘటం. పేరు గొప్ప... ఊరు దిబ్బ అన్నట్లు ఒక్క రూపాయి ఇచ్చేవాడు కాదు. ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో ఉండేవాడు కాదు. ఒక రోజు నలుగురైదుగురం జట్టుగా కలిసి ఉదయం ఐదు గంటలకు కరీంనగర్ నుండి బయలుదేరాం. ఆరు గంటల వరకు ఊరు చేరాం. అప్పుడు దొరికాడు. పావలా ఇవ్వాల్సిన చోట పదిపైసలు ఇచ్చాడు. అదే మహాభాగ్యం అనుకున్నాం. వసూళ్ళకు ఉదయం7-.30 కు వెళితే రాత్రి 7.-30కు వచ్చేవాళ్ళం. ప్రజా ప్రతినిధులంటే భయం. వాళ్ళు మమ్మల్ని ‘భూత బ్యాంకోళ్ళు’ అని ఆటపట్టించేవాళ్ళు. అప్పట్లో మోటర్లు జప్తు చేసేవాళ్ళం. ఆ టైంలో ఒత్తిడి ఎక్కువ ఉండేది. తిండి దొరికేది కాదు. కొన్ని చోట్ల మాపై దాడులు జరిగాయి కూడా. మరికొన్ని చోట్ల రైతులు నిర్బంధించారు. పోలీసుల సాయంతో బయటపడేవాళ్ళం. క్రమంగా మా బ్యాంకు ‘ప్రాథమిక వ్యవసాయాభివృద్ధి బ్యాంకు’గా, తరువాత ‘సహకార బ్యాంకు’గా మారింది. అదే క్రమంలో మా బ్యాంకు విధానాలు కూడా చాలా మారాయి.

‘‘ఉద్యోగ ధర్మంలో భాగంగా ఇబ్బందులు భరించిన మీరు పెన్షన్ లేదని బేలగా బాధపడే కన్నా, తోచిన పని చేసుకోవడం ఉత్తమం” అంటూ  నా ఆలోచనలకు అడ్డం పడింది భార్య. 
“ఎలాంటి స్వార్థాపేక్ష లేకుండా ఉద్యోగ విధుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతూ జీవితం అంతాగడిపా. ప్రమోషన్ కూడా లేకుండా రిటైర్ అయ్యా. కష్టం తెలుసు. కష్టించే మార్గం తెలుసు. శక్తి, ఓపిక ఉన్నవి. లేనిదల్లా ధైర్యమే”అన్నా.
“ఇక నుండి నీ ముందు, వెనుక, అన్ని పక్కలా నేనుంట..” అన్నది.
“నీవు ధైర్యలక్ష్మివి. నీ వల్లే అష్టలక్ష్ములు” అన్నా.
“చాల్లే సంబడం. అప్పుడే కుంగు. అప్పటికప్పుడే పొంగు” అంది నవ్వుకుంటూ.
సంకల్పం దృఢమైంది. హాయిగా నిద్రపట్టింది. 


తెల్లవారింది. అన్వేషణ మొదలైంది. ఏం చేయాలో నిర్ధారించుకోలేని స్థితి. ఉద్యోగం, వృత్తి రెండు మార్గాలు ముందున్నాయి. ఉద్యోగమంతా వసూళ్ళ పర్వం. అదిప్పుడు చేయలేను. మిగిలింది వృత్తి. అప్పుడే వద్దనుకున్నది ఇప్పుడెలా చేయగలను? సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. కాఫీ తాగాలనిపించింది. పొగలు కక్కే కాఫీ కణతల్ని తాకింది. ఒక్కొక్క గుక్క గొంతులో దిగింది. కళ్ళు మూతలు పడి చిత్తం ప్రశాంతత పొందింది. ధ్యాన ముద్రలో కాసేపు గడిపా. మెల్లగా లేచా. ఉద్యోగవిరమణ నడకను గిఫ్ట్​గా ఇచ్చింది. దగ్గరలో ఉన్న మానేరు కట్ట వైపు నడిచా. బైపాస్ రోడ్డు దాటి కట్టమొదలుపై కాలు పెట్టా. ఎడమ వైపు రహదారి. కుడివైపు వైకుంఠపురి. ఏదో సామీప్యత స్ఫురించింది. ముందుకు వెళ్ళా. అప్పటికే కట్టపై జనం ఉన్నారు. వాకింగ్ ముగించుకొని వచ్చేవారు. వాకింగ్​కు వెళ్లేవారితో కట్ట కిటకిటలాడుతోంది. చెరువు నిండు గర్భిణిలా ఉంది. కాస్త ముందుకు నడిచే సరికి చెరువు మీదుగా వచ్చిన చల్లగాలి ఎదను తాకింది. బాలభానుడి లేత కిరణాలు ఆరోగ్యాన్ని అందిస్తున్నాయి. వాతావరణం పరవశాన్ని కలిగిస్తోంది. నడకదారి స్వాంతన చేకూర్చింది. ఉషోదయ జీవితంపై ఆశలు రేపింది. ఉదయభానుడి వైపు నేను, నా వైపు అతడు ఎదురెదురుగా నడుస్తూ దగ్గరవుతున్నట్లుగా ఊహ మొగ్గతొడిగింది. ఆలోచనలు స్పష్టమైన రూపుదాల్చుతున్నాయి. అదిగో అప్పుడు కనపడింది ఒక దృశ్యం. కట్ట దిగువన ప్రతి ఒక్కరు దిగే చోటున ఏవో పాయసాలు, పదార్థాలు పెట్టుకొని ఒకడు ఉన్నాడు. తాగేవాళ్ళు తాగుతున్నారు. తినేవాళ్ళు తింటున్నారు. ‘ఏమిటవి?’.  దగ్గరకు వెళ్లి అడిగా. ఆరోగ్య స్పృహ పెరిగిన కాలమిది. వాకింగ్ చేసి ఇంటికెళ్ళే దారిలో కొంతమంది అక్కడ అమ్ముతున్న రాగిజావ తాగుతున్నారు. మొలకలు తింటున్నారు. పండ్ల జ్యూస్​లు ఊరిస్తున్నాయి. తులసి, పుదీన, నిమ్మతో తయారు చేసిన ‘చాయ్’ పొగలు కక్కుతోంది. క్యారెట్, బీట్​రూట్, కీరదోస మొదలైన కూరగాయల ముక్కలు అందంగా అమర్చారు. ఇంకా తెలియని రకాలేవో చాలానే ఉన్నాయక్కడ. ప్రతీ టేబుల్ ముందు ప్రజలున్నారు. అక్కడ వ్యాపారం బాగా సాగుతోంది. నేనేదైనా చేయగలనా? అనే ఆలోచన మొగ్గ తొడిగింది. ఇంటికి బయల్దేరా.

“యురేకా...” అని అరిచా.
“సుఖమైనా, దుఃఖమైనా వస్తే నిన్ను ఆపతరం కాదు” అందామె. 
‘‘నష్టం లేని వ్యాపారం కనుక్కున్నా” అని చెప్పా.
“వివరంగా చెప్పు” అంది.
“మానేరు కట్ట కింద కల్లు అమ్ముత” అన్నా.
“పట్నంలో కల్లు తాగేవాళ్ళు ఎవరు!” అంది ఆమె ఆశ్చర్యంగా.

“ఉదయం వాకింగ్​కు వచ్చినవాళ్ళు ఆరోగ్యం కోసం అక్కడ అమ్ముతున్న పానీయాలను తాగుతున్నారు. వాటన్నిటికన్నా మంచిది, ఆరోగ్యానికి మేలు చేసే ‘నీరా’ తెచ్చిపెడితే తప్పక అమ్ముడుపోతది. కాకపోతే ఉదయం ఏడువరకే తేగలగాలి. అందమైన సీసాల్లో నింపి అందివ్వాలి. వ్యాపారం చక్కగా సాగుతది. మన కష్టాలు తీరుతాయి” అని చెప్పా ఉత్సాహంగా.
“వాకర్స్​ను నమ్మించడమెలా?” అడిగిందామె.
“ప్రతి ఒక్కరికి చెప్పడం సాధ్యం కాదు. ఒక బ్యానర్ తయారుచేయించి దానిపై ‘నీరా’ ప్రాముఖ్యత.. అది ఆరోగ్యానికి చేసే మేలు రాస్తే అందరూ చదువుతారు. మొదట లాభం తీసుకోకుండా, తక్కువ ధరకే అమ్మి జనాలకు అలవాటు చేయాలి. తరువాత గిట్టుబాటు ధరకు అమ్మాలి. పనికి పని... పైసకు పైసా” అంటూ ఆమె ప్రశ్నకు జవాబు ఇచ్చా.
“సరే... అయితే” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆమె.


ఒక శుభముహూర్తాన కట్టకింద నలుగురు నడిచే కూడలి పక్కన బ్యానర్ కట్టాడు. దాని ముందు కుర్చీ, టేబుల్ వేశాడు. అందమైన, ఆకర్షణీయమైన చిన్నాపెద్ద సీసాల్లో ‘నీరా’ నింపి పెట్టాడు. కొత్తగా వెలిసిన దుకాణాన్ని ఆసక్తిగా చూస్తూ వెళ్ళేవారు కొందరు, నిలబడి బ్యానర్ చదివేవాళ్ళు మరికొందరు. అతనితో మంచి చెడులు మాట్లాడేవాళ్ళు ఇంకొందరు.“ఈ రోజే పెట్టినట్టున్నావు”, “ఏంది ఇది. తాగొచ్చా?”, “కల్లులాగా కనబడుతోంది. కల్లేనా?” ..... రకరకాల ప్రశ్నలకు ఓపికగా జవాబులిస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆ రోజు కొందరికి ఉచితంగా నీరా ఇచ్చాడు కూడా. 

“ఇది తాగితే ఆరోగ్యానికి ఏం లాభం?” ఉచితంగా తాగినవాడి ప్రశ్న.
‘‘చెట్ల నుంచి కల్లు తీసే ముందు వచ్చే మొదటి పానీయం నీరా. దీనికి కాస్త వేడి తగిలితే పులిసి కల్లుగా మారుతుంది. కల్లుగా మారక ముందున్న నీరా పానీయం ఎలాంటి మత్తు కలిగించదు. చక్కెర లాంటి తీయని రుచిని పంచే పానీయం నీరా. ఇది ఆల్కహాల్​ లేని సహజసిద్ధమైన ద్రవం. నీరాలోని పోషకాలు మనుషుల్లో రోగనిరోధక శక్తి పెంచుతాయి. రక్తకణాల వృద్ధికి దోహదపడే పోషకాలు సైతం ఇందులో ఉన్నాయి. అజీర్తి, మలబద్ధకం దూరం చేస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడితే, నీరాతో కొంతవరకు సమస్య తగ్గించవచ్చు” అని జవాబిచ్చాడు.

అలా ప్రతిరోజు అడిగిన వారికి, అడగని వారికి చెప్తూ పరిచయాలు పెంచుకుంటూ, తక్కువ ధరకి ఇస్తూ, ఉద్దెర పెడుతూ.... ఎట్లయితేనేం అందరికి నీరా రుచి అలవాటు చేశాడు. క్రమంగా టేబుల్ ముందు చేరే జనాల సంఖ్య పెరిగింది. ఒక రోజు నడివయసు స్త్రీ వచ్చి “ఇది మేం తాగొచ్చా?” అని అమాయకంగా అడిగింది.

“ఇది ఆరోగ్యదాయకం. అమృతపానీయం సురాపానీయం. ఇది తాగడం మన సంప్రదాయం” అంటూ నచ్చ జెప్పాడు.
ఆమె తాగింది. ఇతరులకు చెప్పింది. తాగేవాళ్ళు తాగుతున్నారు. ఇంటికి తీసికెళ్ళే వాళ్ళు తీసుకెళుతున్నారు. ‘రెండు కల్లు కుండలు, నాలుగు తాటి ముంజలు’ అన్నట్లుగా వ్యాపారం డెవలప్​ అయింది. ఉదయం పది వరకు పని, తరువాత విశ్రాంతి. అలా తన జీవితం మలచుకున్నాడు. నాలుగు రాళ్ళు వెనకేశాడు. అక్కడ వెలసిన నీరా స్టాల్ ఆ ప్రాంతంలో సూపర్ స్టార్​గా వెలిగింది. ఆ వెలుగే వారికి గూడు అయింది.

బాపుకు ఈ పని ఇష్టం ఉండేది కాదు. మరోపని చేయరాకపోవడం వల్ల దుకాణంలో కూర్చునేవాడు. అదే నన్ను పట్నం నడిపించింది. ఉద్యోగం చేసేలా చేసింది. ఎప్పుడైతే గౌడు వ్యాపారిగా మారాడో మండువ ఒంటరిదైంది. సామూహికత ఛిద్రమైంది. నాలాంటి వారు ఎందరో ఊరు విడిచారు. వలసబాట పట్టారు. తెల్లవారింది. అన్వేషణ మొదలైంది. ఏం చేయాలో నిర్ధారించుకోలేని స్థితి. ఉద్యోగం, వృత్తి రెండు మార్గాలు ముందున్నాయి. ఉద్యోగమంతా వసూళ్ళ పర్వం. అదిప్పుడు చేయలేను. మిగిలింది వృత్తి. అప్పుడే వద్దనుకున్నది ఇప్పుడెలా చేయగలను? సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. 

చివరి మాటలు
మరణశిక్ష అమలయ్యే ముందు సోఫీ చివరిగా “ఇది ఎంతో అద్భుతమైన రోజు. కానీ, ఇదే నా చివరి రోజు. నా పనుల ద్వారా, వేలాది మంది ప్రజల్ని అప్రమత్తం చేయగలిగితే, వాళ్లలో కొత్త ఆలోచనలకు ప్రాణం పోయగలిగితే నా మరణం సఫలమైనట్లే కదా?” అన్నది.