
జైపూర్: డెబ్బై ఏండ్ల వయసులోనూ ఎవరి మీదా ఆధార పడకుండ బతుకుతున్న ఓ వృద్ధుడు.. కొంతమంది ఆకతాయిలు చేసిన పని వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. చెత్త ఏరుకుంటుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వేధించడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బార్మేర్ జిల్లా చోహ్‌టాన్ గ్రామానికి చెందిన ప్రతాప్ సింగ్ అనే వృద్ధుడు ప్లాస్టిక్ చెత్త ఏరుకుంటూ.. వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో జీవిస్తున్నాడు.
రెగ్యులర్‌గా అతను రెండు మూడు గ్రామాలకు వెళ్తూ.. చెత్తను సేకరిస్తుండటంతో ఆ గ్రామ ప్రజలకు ఇతనితో మంచి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో అతనంటే తెలిసిన వారు ప్రతాప్ సింగ్‌ను ‘బాబాజీ’అని పిలుస్తారు. ఇదిలాఉండగా, కొన్నిరోజుల క్రితం ప్రతాప్ సింగ్ లోహవత్ గ్రామానికి చెత్త ఏరుకుకోవడానికి వెళ్లాడు. అక్కడ ఈ చెత్తను ఎవరైనా కొనుగోలు చేస్తారా అని కొంతమంది కుర్రాళ్లను అడిగాడు.
ఆ కుర్రాళ్లు అతనితో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్ అవ్వడంతో చాలామంది ప్రతాప్ సింగ్ ను గుర్తుపట్టడం మొదలైంది. అప్పటి నుంచి అతన్ని అందరూ హేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు. బాబాజీ రిక్షా.. బాబాజీ వచ్చాడు చెత్త కోసం.. అంటూ వెటకారంగా మాట్లాడుతూ రీల్స్ చేసేవారు. అవి బాగా వైరల్ కావడంతో మిగతా గ్రామాల్లోని కుర్రోళ్లు కూడా ప్రతాప్ సింగ్‌ను కించపరుస్తూ రీల్స్ చేయడం మొదలు పెట్టారు. ఇలా టార్చర్ పెరగడంతో ప్రతాప్ సింగ్ మనస్థాపానికి గురయ్యాడు. జైపూర్ నేషనల్ హైవే పక్కనున్న చెట్టుకు ప్రతాప్ సింగ్ ఉరేసుకున్నాడు.