
- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణను రోడ్డు విస్తరణ పనులతో శ్రీకారం చుట్టామని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని మూలవాగు నుంచి ఆలయం దాకా రూ.6.50కోట్లతో 80 ఫీట్ల మేర చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ వాసులు, భక్తులు 54 ఏండ్లుగా ఎదురుచూస్తున్న మూలవాగు నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రోడ్డు విస్తరణ పనులపై కొందరు నాయకులు అసత్యప్రచారాలు చేశారని, కానీ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నామని వివరించారు. భూ నిర్వాసితుల కోసం రూ.47 కోట్లను కలెక్టర్ ఖాతాలో ఈ సొమ్ము జమ చేసి పనులు ప్రారంభించామన్నారు.
రోడ్డు వెడల్పులో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌లో రూ. 150 కోట్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. అనంతరం భీమేశ్వర ఆలయాభివృద్ధిపై రాజన్న ఆలయ గెస్ట్ హౌస్‌లో అధికారులు, కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అంతకుముందు అంతా కలిసి రాజన్న దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్ బి.గితే, లైబ్రరీ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఈవో రాధా భాయి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రొండి రాజు, తిరుపతి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తదితరులు పాల్గొన్నారు.