న్యూడిల్లీ: ఐటీ, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్, బీపీఓ సెక్టార్లలో సెంటిమెంట్ బలహీనంగా ఉండటంతో ఈ ఏడాది ఆగస్టులో భారతదేశంలో వైట్‌కాలర్ జాబ్స్ (ఆఫీసుల్లో చేసే ఉద్యోగాలు) నియామకాలు 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది ఆగస్టులో 2,666 ఉద్యోగాల పోస్టింగ్‌లు రాగా, క్రితం ఏడాదిలో 2,828 ఉద్యోగాల పోస్టింగ్‌లు వచ్చాయి. నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం, జులై 2023లో 2,573 జాబ్ పోస్టింగ్‌లు రాగా, ఆగస్టు 2023లో ఇవి 4 శాతం పెరిగాయి. నౌకరీ జాబ్‌స్పీక్.. భారత జాబ్ మార్కెట్‌ను నెలవారీగా కొలిచే సూచిక. నౌకరీ డాట్ కామ్ రెజ్యూమ్ డేటాబేస్‌లో రిక్రూటర్ల ద్వారా కొత్త జాబ్ పోస్టింగ్స్, జాబ్ సెర్చింగ్స్ ఆధారంగా ఈ రిపోర్టును తయారు చేస్తారు. "ఆగస్టు 2023 కి సంబంధించిన జాబ్‌స్పీక్ ఇండెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా వంటి ఐటీయేతర రంగాల్లో నియామక సెంటిమెంట్లను వెల్లడిస్తుంది.
ఐటీ రంగం కూడా సానుకూల సంకేతాలను కనబరిచింది. గత కొన్ని నెలలుగా క్షీణించిన తర్వాత సీక్వెన్షియల్‌గా హైరింగ్ పెరిగింది. ఇది భారతదేశంలో వైట్ కాలర్ జాబ్ మార్కెట్‌కు మంచి సంకేతాలు" అని నౌకరీ డాట్ కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. గత ఏడాది ఆగస్టులోని హై బేస్ వాల్యూతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో కొత్త ఉద్యోగాల సంఖ్య 33 శాతం తక్కువ ఉంది. ఐటీతో పాటు, ఇన్సూరెన్స్, ఆటో, హెల్త్‌కేర్, బీపీఓ వంటి రంగాల్లో గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో కొత్త ఉద్యోగాల సృష్టి వరుసగా 19 శాతం, 14 శాతం, 12 శాతం, 10 శాతం తగ్గింది.