
- రోడ్ల కోసం రూ.లక్షన్నర కోట్లు, రైల్వేలకు రూ.33 వేల కోట్లు కేటాయించినం
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, వెలుగు: జాతీయ రహదారుల కోసం రూ.లక్షన్నర కోట్లు, రైల్వేల అభివృద్ధికి రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని, తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిపై వైట్ పేపర్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పాతబస్తీ గుల్జార్ హౌజ్ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
‘హైదరాబాద్ గుల్జార్ హౌజ్ ప్రమాద ఘటనలో 17 మంది మరణించడం తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించింది. బీజేపీ పక్షాన సంతాపం వ్యక్తం చేస్తున్నా. చిన్నారులు కూడా మరణించారు. ఆ ఘటన తలుచుకుంటేనే మనసు కలిచివేస్తోంది. ప్రధాని మోదీ వెంటనే స్పందించి సాయం ప్రకటించారు. ఆ కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి.’ అని కోరారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ.32,940 కోట్లకుపైగా ఖర్చు చేశామని, ఈ ఒక్క ఏడాదే రూ.5,336 కోట్లు కేటాయించామని తెలిపారు.
నాచారం రైల్వే టెర్మినల్ ను అద్భుతంగా నిర్మించుకున్నామని, రూ.750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. రూ.350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనులన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు కన్పించకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.