ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో తెల్లరాయి నిల్వలు

ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో తెల్లరాయి నిల్వలు
  • అక్రమ అనుమతులపై దుమ్ముగూడెం తహసీల్దార్​ విచారణ

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం డివిజన్​లోని దుమ్ముగూడెం మండలం చెరుపల్లిలో ఆంధ్ర, -తెలంగాణ సరిహద్దుల్లో నిల్వ ఉంచిన తెల్లరాయిపై ఆదివారం ఆదివాసీల సంఘలు ఆందోళనకు దిగాయి. ఆంధ్ర నుంచి రాత్రి వేళల్లో స్మగ్లర్లు తెల్లరాయి(క్వార్ట్జ్)ని లారీల్లో తీసుకొచ్చి చెరుపల్లిలో డంప్​ చేస్తున్నారు. చెరుపల్లి నుంచి గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ మీదుగా తరలిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ తతంగం నడుస్తోంది.

ఆదివాసీ సంక్షేమ పరిషత్​ నాయకులు ఈ నిల్వలపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయడంతో దుమ్ముగూడెం తహసీల్దారు చంద్రశేఖర్​ను విచారణ కోసం ఆదివారం గ్రామానికి పంపించారు. టన్నుల కొద్దీ తెల్లరాయి అక్కడ ఉండటాన్ని గమనించి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుమతుల వివరాలపై ఆరా తీయగా మహాలక్ష్మి మినరల్స్  పేరిట లైసెన్స్ ఉంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతమంతా ఏజెన్సీ ఐదో షెడ్యూల్​ ఏరియా కావడంతో లైసెన్స్ మంజూరీ అక్రమం అంటూ తేల్చారు. పీసా చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించాలి. గ్రామసభ ఆమోదం తర్వాత వివిధ శాఖల పోలీస్, రెవెన్యూ, మైనింగ్, జియాలజీ అధికారుల నుంచి అనుమతులు తెచ్చుకోవాలి.

కానీ ఇవేమీ అందులో లేవు. కేవలం మైనింగ్, జియాలజీ ఆఫీసర్ల ద్వారా లైసెన్స్ మాత్రం ఉంది. దీనిపై దుమ్ముగూడెం తహసీల్దారు.. భద్రాచలం ఆర్డీవో, కలెక్టర్లకు నివేదిక పంపించారు. అనుమతులు లేకుండా తెల్లరాయి తవ్వకాలు జరిపినట్లుగా తేల్చారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర పనులకు ఉపయోగించకూడదనే నిబంధనను, ఆదివాసీ చట్టాలను తుంగలో తొక్కిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదివాసీ సంక్షేమ పరిషత్​డివిజన్​ అధ్యక్షుడు సొందె మల్లుదొర, డివిజన్​ కార్యదర్శి కొర్స రామచంద్రయ్య, రేసు రాంబాబు, నాగేశ్వరరావు, భరత్​, సున్నం నాగేశ్వరరావు తదితరులు డిమాండ్​ చేశారు.