కరోనాపై చైనాకు డబ్ల్యూహెచ్‌‌వో సలహా

కరోనాపై చైనాకు డబ్ల్యూహెచ్‌‌వో సలహా

జెనీవా: చైనాలో కరోనా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌‌వో) చీఫ్‌‌ టెడ్రోస్‌‌ అధనోమ్‌‌ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్‌‌లో వేగం పెంచాలని, వైరస్‌‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. వ్యాధి తీవ్రత, హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య, ఐసీయూ అవసరాలకు సంబంధించి వివరాలు ఇవ్వాలని చైనాను కోరారు. ‘‘చైనాలో వైరస్‌‌ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్‌‌వో ఆందోళన చెందుతోంది. అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని నివేదికలు వస్తున్నాయి. క్లినికల్‌‌ కేర్‌‌‌‌, ఆరోగ్య వ్యవస్థ భద్రతకు డబ్ల్యూహెచ్‌‌వో నుంచి మద్దతు ఉంటుంది”అని ఆయన చెప్పారు.

చైనాలో ముఖ్యంగా వృద్ధుల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని చైనా ఆఫీసర్లు చెబుతున్నారు. వైరస్‌‌ బారిన పడి శ్వాస అందక మరణించిన వారిని మాత్రమే కొవిడ్‌‌ మరణాల కింద చైనా లెక్కించనుందని ఆయన తెలిపారు. కాగా, వైరస్‌‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చైనా 2020లో జీరో కొవిడ్‌‌ పాలసీని తీసుకొచ్చింది. అందులో భాగంగా అనేక కట్టుబాట్లు పెట్టారు. దీంతో ఈ పాలసీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌ మొదట్లో జీరో కొవిడ్‌‌ పాలసీలో నిబంధనలు సడలించారు. అప్పటి నుంచి చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
=