నామినేటెడ్ పదవులెవరికో? .. సీఎం రేవంత్ ను కలుస్తున్న లీడర్లు

నామినేటెడ్  పదవులెవరికో? .. సీఎం రేవంత్ ను కలుస్తున్న లీడర్లు

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పద్ధతులైన కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టులన్నీ రద్దవటంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ప్రారంభించారు. 54 కార్పొరేషన్ల చైర్మన్లను రేవంత్ రెడ్డి సర్కారు ఒకే జీవోతో రద్దు చేసింది. ఇటీవల పదవులు పొందిన వారికి సైతం ఉద్వాసన పలికింది. ఆ పోస్టులపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ కోసం పోటీ పడ్డ వారికి రకరకాల హామీలు ఇచ్చి తప్పించిన విషయం తెలిసిందే. ఇంకా కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పలువురు మేధావులు, విద్యార్థి జేఏసీ నేతలు, వైఎస్సార్టీపీ లాంటి కొన్ని పార్టీలు పనిచేశాయి. 

వీటన్నింటినీ బేరీజు వేసుకొని కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో నాలుగైదు నెలల్లో ఎంపీ ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిన సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయడానికి అక్కడి నేతలకు నామినేటెడ్ పదవులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో  పాటు పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన అనుబంధ సంఘాలు మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ ఎస్ యూఐ, ఫిషర్ మెన్ కమిటీ, కిసాన్ సెల్, మైనార్టీ సెల్ తదితర అనుబంధ సంఘాల నాయకులకూ పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. 

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కీలక నేతలు జీవన్ రెడ్డి(జగిత్యాల), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), జగ్గారెడ్డి (సంగారెడ్డి), మధుయాష్కీ(ఎల్బీనగర్), అంజన్ కుమార్ యాదవ్( ముషీరాబాద్) తదితరులు ఓటమి పాలయ్యారు. వీరిలో జీవన్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా.. మిగతా ఓడిపోయిన నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవులు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికిప్పుడు మూడు ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడు ఎవరికి ఇస్తారు.. ఎవరు మంత్రులవుతారు..? అనేది హాట్ టాపిక్ గా మారింది.