
సిద్దిపేట, వెలుగు : ఎన్నికల ఏడాదిలో ఐక్యంగా సాగాల్సిన కాంగ్రెస్ నేతలు దుబ్బాక నియోజకవర్గంలో ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు. జోడోయాత్రను చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, పన్యాల శ్రవణ్‌కుమార్ రెడ్డి, కత్తి కార్తీక వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక కాంగ్రెస్టికెట్ రేసులో వీరు ముగ్గురూ ఉన్నట్లు తెలుస్తోంది.
తొగుటలో యాత్ర ప్రారంభించిన ‘చెరుకు’.
మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కొడుకు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో మరింత పట్టుసాధించేందుకు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తొగుట మండలంలో ఈనెల 2 నుంచి జోడో యాత్ర ప్రారంభించారు. ఏడు మండలాలను జోడో యాత్రతో చుట్టే విధంగా ప్రణాళికను రూపొందించారు. ఆయనకు మద్దతుగా ఇటీవల మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. ఆయన యాత్రకు నియోజకవర్గ ముఖ్య నేతలు ఎవరూ వెంట రాకున్నా తన అనుచరవర్గంతో గ్రామాల్లో పర్యటిస్తున్నారు. దుబ్బాకలో పార్టీ కార్యాలయం ప్రారంభించుకొని ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరోవైపు కింది స్థాయిలో తన అభ్యర్థిత్వానికి మద్దతు పొందేందుకు ఇటు ప్రజలతో, అటు పార్టీ శ్రేణులతో ముందుకు సాగుతున్నారు.
బరిలో ఉన్నానంటున్న ‘శ్రవణ్’
దుబ్బాక టికెట్ రేసులో తానూ ఉన్నానని చాటుకోవడానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అడపాదడపా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. హాత్ సే హాత్ జోడో యాత్రకు సంబంధించి ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేయడమే కాకుండా దుబ్బాక మండలంలో ఇటీవలే దీనికి అంకుర్పారణ చేయడం గమనార్హం. గతంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చవి చూసిన శ్రవణ్ కుమార్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తూ గెలుపే లక్ష్యంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండగా గతంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణపై ఘర్షణ జరిగి వారి అనుచరులు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు పెట్టుకునే వరకు వెళ్లిన విషయం తెలిసిందే. రాష్ట్ర నాయకత్వంతో మంచి సంబంధాలున్న శ్రవణ్ కుమార్ రెడ్డి హైకమాండ్ అండదండలతో దుబ్బాక అసెంబ్లీ లేక మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆసక్తిరేపుతున్న కత్తి కార్తీక ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత టీవీ యాంకర్ కత్తి కార్తీక దుబ్బాక కాంగ్రెస్ నియోజకవర్గంలో జోడో యాత్రను ప్రారంభించడం ఆసక్తి కలిగిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత చాలా కాలం పాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. గతేడాది కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ఇటీవల రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. గత ఉప ఎన్నిక సందర్భంగా దుబ్బాకలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నా తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవడంతో ఆమె తిరిగి రారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా దుబ్బాక అసెంబ్లీ సెగ్మంట్ లో ఆమె జోడో యాత్రతో ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ను తాను ఆశిస్తున్నట్టు జోడో యాత్ర ద్వారా చెప్పకనే చెబుతున్నట్లు తెలుస్తోంది.