దుబ్బాకలో భారీ పోలింగ్ ఎవరికి లాభం?

దుబ్బాకలో భారీ పోలింగ్ ఎవరికి లాభం?
  • కరోనా టైంలోనూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఓటర్లు
  • పొద్దున మెల్లగా మొదలైనా.. తర్వాత పెరిగిన స్పీడ్
  • పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. కనిపించని ఫిజికల్​ డిస్టెన్స్
  • పీపీఈ కిట్లతో ఓటేసిన 11 మంది కరోనా పేషెంట్లు
  • టీఆర్ఎస్​ వర్సెస్​ బీజేపీ అన్నట్టు నడిచిందంటున్న అనలిస్టులు
  • గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. 10న రిజల్ట్
  • అందరిలో టెన్షన్​ టెన్షన్

హైదరాబాద్‌, సిద్దిపేట, వెలుగు: పోటాపోటీగా సాగిన దుబ్బాక బై ఎలక్షన్​ ఆసక్తి రేపుతోంది. కరోనా టైంలోనూ జనరల్​ ఎలక్షన్ల తరహాలో భారీగా 82.61 శాతం పోలింగ్​ నమోదవడంతో అందరిలో ఉత్కంఠ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా దుబ్బాక రిజల్ట్ ఎట్లా ఉంటుంది, భారీ పోలింగ్​తో ఎవరికి లాభం జరుగుతుంది, మహిళల ఓట్లు, యూత్​ ఓట్లు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నాయన్న దానిపై చర్చలే కనిపిస్తున్నాయి. ప్రధాన క్యాండిడేట్ల మధ్య గట్టిపోటీ వల్లే ఓటింగ్​ భారీగా నమోదైందని.. ముఖ్యంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ కనిపించిందని పొలిటికల్​ అనలిస్టులు చెప్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన దుబ్బాక బై ఎలక్షన్​ పోలింగ్​ మంగళవారం ‌ప్రశాంతంగా ముగిసింది. రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచారం, మాటల యుద్ధంతో పరిస్థితి గరంగరంగా కనిపించినా ఓటింగ్ సజావుగా జరిగింది. ఓటర్లలో 1,068 మంది పోస్టల్‌ ‌బ్యాలెట్‌‌ వినియోగించుకున్నారు. సెగ్మెంట్లో ఏడు మండలాల పరిధిలోని 148 గ్రామాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్​ సెంటర్లకు బారులు తీరారు. కరోనా‌ గైడ్​లైన్స్​ మేరకు అధికారులు ఏర్పాట్లు చేసినా పెద్దగా సోషల్‌ ‌డిస్టెన్స్  కనిపించలేదు. పోలింగ్‌ సెంటర్ల వద్ద ఆశా వర్కర్లు ఓటర్లకు శానిటైజర్లు, గ్లౌజులను ఇచ్చారు, థర్మల్​ స్కానింగ్‌ ‌చేశాకే లోపలికి పంపించారు. సాయంత్రం 5 గంటలకు సాధారణ పోలింగ్​ ముగిసింది. తర్వాత గంటపాటు కరోనా పేషెంట్లకు ఓటేసే చాన్స్​ ఇచ్చారు. ఇలా 11 కరోనా పేషెంట్లు పీపీఈ కిట్లు ధరించి వచ్చి, ఓట్లు వేశారు. అయితే చాలాచోట్ల వీల్ చైర్లు లేక వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడ్డారు. కొన్ని గ్రామాల్లో పొద్దున్నే ఓటేసేందుకు వెళ్లిన వారికి పార్టీల కార్యకర్తలు టిఫిన్లు ఇచ్చారు. కలెక్టర్‌ ‌భారతి హోళికేరి, పోలీస్‌ ‌కమిషనర్ జోయల్‌‌ డేవిస్‌  పలుచోట్ల పోలింగ్‌ ‌సరళిని పరిశీలించారు. చీఫ్‌‌ ఎలక్టోరల్‌‌ ఆఫీసర్​ శశాంక్‌ ‌గోయల్‌ ‌దుబ్బాక, లచ్చపేటల్లో పోలింగ్​ సెంటర్లను పరిశీలించారు. ఈ నెల 10న కౌంటింగ్​ జరుగనుంది.

మెల్లగా స్పీడందుకున్న పోలింగ్

దుబ్బాక సెగ్మెంట్లోని అన్ని గ్రామాల్లో పొద్దున మెల్లగా జరిగిన పోలింగ్.. తర్వాత భారీగా పెరిగింది. తొలి రెండు గంటల్లో 12.74 శాతం మాత్రమే ఓటింగ్‌‌ నమోదైంది. కానీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు 55.52 శాతానికి చేరింది. 3 గంటల సమయానికి 70 శాతం దాటింది. పోలింగ్​ ముగిసే సమయానికి 82.61 శాతంగా
నమోదైంది.

టీఆర్ఎస్  వర్సెస్  బీజేపీ!

దుబ్బాక బరిలో మొత్తం 23 మంది క్యాండిడేట్లు ఉండగా పోటీ అంతా ప్రధాన పార్టీల మధ్యే కనిపించింది. ముఖ్యంగా పోలింగ్‌ ‌సరళిని పరిశీలిస్తే.. టీఆర్ఎస్‌‌  వర్సెస్  బీజేపీ అన్నట్టుగా సాగిందని పొలిటికల్​ అనలిస్టులు చెప్తున్నారు. రూరల్​ సెగ్మెంట్​ అయిన దుబ్బాకలో బీజేపీకి పెద్ద సంఖ్యలోనే ఓట్లు పోలయ్యాయని అంచనా వేస్తున్నారు. యూత్, గ్రామాల్లో పెద్దవయసు వారు బీజేపీకి అనుకూలంగా ఉన్నారని.. మహిళలు టీఆర్ఎస్‌ ‌వైపు మొగ్గు చూపినట్టు కనిపించిందని అంటున్నారు. ప్రచారంలో టీఆర్ఎస్‌‌, బీజేపీల మధ్య హోరాహోరీ సాగినట్టే పోలింగ్‌ సరళి కూడా ఉందంటున్నారు.

కొన్ని చోట్ల లేటుగా ఓటింగ్

దుబ్బాక సెగ్మెంట్లోని కొన్ని పోలింగ్​ సెంటర్లలో ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్‌ ‌ప్రారంభం కాగానే దుబ్బాక మండలం దుంపలపల్లిలో ఈవీఎం పని చేయలేదు. గంట ఆలస్యంగా పోలింగ్‌ మొదలైంది. తొగుట మండలం గోవర్ధనగిరి, వెంకట్రావుపేట, దుబ్బాక మండలం హబ్షిపూర్‌‌, రామక్కపేట, చేగుంట మండలం కర్నాలపల్లి, దౌల్తాబాద్‌ ‌మండలం శేరిపల్లిల్లోనూ ఈవీఎంలు సతాయించడంతో పోలింగ్‌‌ లేటుగా ప్రారంభమైంది. టెక్నికల్‌ ‌టీమ్స్ ఆయా సెంటర్లకు చేరుకుని ఈవీఎంలను సరిచేశాయి. మండల కేంద్రమైన చేగుంటలో ఒక టెండర్ ఓటు నమోదైంది. రాధాకృష్ణ అనే వ్యక్తికి సంబంధించిన ఓటును మరొకరు వేయగా, ఆయన పోలింగ్​ స్టాఫ్​కు చెప్పి టెండర్‌ ‌ఓటు వేశారు. రాయపోల్ మండలం మంతూరు వద్ద ఈవీఎం కాసేపు మొరాయించడంతో.. ఓటర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిరుదొడ్డిలో కరెంటు పోవడంతో కొద్దిసేపు పోలింగ్‌‌ ఆగిపోయింది. రాయపోల్‌‌ మండలం కొత్తపల్లిలో పోలింగ్ సెంటర్​ సమీపంలో ప్రచారం చేస్తున్న వ్యక్తులను పోలీసులు చెదరగొట్టారు.

ఒకే పోలింగ్​ సెంటర్​లో.. టీఆర్ఎస్, బీజేపీ క్యాండిడేట్లు

ప్రధాన పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్​ క్యాండిడేట్లు ఒకే పోలింగ్​ సెంటర్​లో ఎదురుపడ్డ ఘటన మంగళవారం జరిగింది. దౌల్తాబాద్​లోని 148 నంబర్​ పోలింగ్​సెంటర్​లో పరిశీలన కోసం బీజేపీ క్యాండిడేట్​ రఘునందన్​రావు లోపలికి వెళ్లారు. ఆయన లోపల ఉన్న టైంలోనే టీఆర్ఎస్​ క్యాండిడేట్​ సోలిపేట సుజాత కూడా పోలింగ్​ సెంటర్​లోకి వచ్చారు. ఇద్దరు మెయిన్​ క్యాండిడేట్లు ఒకే సెంటర్లో ఎదురుపడటాన్ని అందరూ ఆసక్తిగా గమనించారు.

ఎవరికి వారే ధీమా చూపుతూ..

భారీ పోలింగ్​ తమకే కలిసి వస్తుందని ప్రధాన పార్టీల క్యాండిడేట్లు ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సెంటిమెంట్​ ఓట్లతోపాటు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లు గంపగుత్తగా తమ ఖాతాలో పడ్డాయని టీఆర్ఎస్​ అంటోంది. భారీ పోలింగ్ తమకే లాభమని, గత ఎలక్షన్​తో పోలిస్తే మెజారిటీ పెరుగుతుందని భావిస్తోంది. సర్కారుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కారణంగానే పోలింగ్ ​పెరిగిందని.. ఆ ఓట్లన్నీ తమను గెలిపిస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది. పోలీసుల ఏకపక్ష సోదాలు, టీఆర్ఎస్​ అధికార దుర్వినియోగం వంటివన్నీ బీజేపీకి కలిసొచ్చాయని లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా దుబ్బాకలో తమదే పైచేయి అని చెప్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, తమ క్యాండిడేట్​కు ఉన్న సానుకూల అంశాలతో గెలుస్తామని అంటోంది. పొలిటికల్​ అనలిస్టులు కూడా బైఎలక్షన్​ సరళిని నిశితంగా అంచనా వేసే పనిలో పడ్డారు.

కాషాయ జెండా ఎగరేస్తాం: రఘునందన్

దుబ్బాక, వెలుగు: అడ్డంకులు సృష్టించేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, ప్రజలు సంయమనంతో ఓట్లేసిన్రని దుబ్బాక బీజేపీ కేండిడేట్​ రఘునందన్​ చెప్పారు. మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించి పోలింగ్ తీరును పరిశీలించారు.పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు గొడవలకు దిగినప్పటికీ.. ప్రతిపక్ష పార్టీగా తాము బాధ్యతగా వ్యవహరించామని రఘునందన్ చెప్పారు. ఈసారి ప్రజల ఆశీస్సులతో దుబ్బాక గడ్డపై కాషాయ  జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తంచేశారు.