డబ్ల్యూహెచ్​ఓ సహకార కేంద్రంగా ఎన్​ఐఎంహెచ్​

డబ్ల్యూహెచ్​ఓ సహకార కేంద్రంగా ఎన్​ఐఎంహెచ్​

సంప్రదాయ వైద్యంలో పరిశోధన కోసం హైదరాబాద్​లోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియన్​ మెడికల్​ హెరిటేజ్ (ఎన్​ఐఎంహెచ్​)ను సహకార కేంద్రంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ గుర్తింపు నాలుగేండ్ల కాలానికి ఉంటుందని ఆయుష్​ శాఖ ప్రకటించింది. ఆయుర్వేద, యునాని, సిద్ధ తదితర సంప్రదాయ వైద్య పద్ధతులపై సహకార పరిశోధన కోసం డబ్ల్యూహెచ్​ఓకు ఈ సంస్థ సహకారం అందించనున్నది. 

జామ్​నగర్ లోని ఇన్​స్టిట్యూట్​ ఫర్ టీచింగ్​ అండ్​ రీసెర్చ్​ ఇన్​ ఆయుర్వేదం, న్యూఢిల్లీలోని మొరార్జీ దేశాయ్​ నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ యోగా(ఎండీఎన్​వై)లతోపాటు భారతదేశంలో సంప్రదాయ వైద్య రంగంలో మూడో డబ్ల్యూహెచ్​ఓ సహకార కేంద్రంగా సీసీఆర్​ఏఎస్–ఎన్​ఐఎంహెచ్​ హైదరాబాద్​ ఉంది. 
1996లో హైదరాబాద్​లో ఎన్​ఐఎంహెచ్​ను స్థాపించారు.  దీనిని గతంలో నేషనల్​ సెంటర్​ ఆఫ్​ ఇండియన్​ మెడికల్​ హెరిటేజ్​(ఎన్​సీఐఎంహెచ్) అని పిలిచేవారు. ఇది భారత ప్రభుత్వ ఆయుష్​ మంత్రిత్వ శాఖలోని సెంట్రల్​ కౌన్సిల్​ ఫర్ రీసెర్చ్​ ఇన్​ ఆయుర్వేద సైన్సెస్​(సీసీఆర్​ఏఎస్​) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 
ఈ సంస్థ భారతదేశంలో ఆయుర్వేదం, యోగా ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, సోవా రిగ్పా, హోమియోపతి, బయోమెడిసిన్​, సంబంధిత ఆరోగ్య సంరక్షణ విభాగాల్లో వైద్య చారిత్రక పరిశోధనలను డాక్యుమెంట్​ చేయడానికి, ప్రదర్శించడానికి అంకితం చేసింది.