మెదక్​ జిల్లా కాంగ్రెస్​ కేబినెట్​లో చోటు ఎవరికి?

 మెదక్​ జిల్లా కాంగ్రెస్​ కేబినెట్​లో చోటు ఎవరికి?
  •    దామోదర్​కు బెర్త్​ ఖాయం
  •     లేదంటే సభాపతిగా చాన్స్​
  •     బీసీ కోటాలో పొన్నం ప్రయత్నాలు

సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : గురువారం కొలువుదీరుతున్న కాంగ్రెస్​ కేబినెట్​లో ఉమ్మడి మెదక్​ జిల్లా నుంచి ఎవరికి స్థానం దక్కనుందన్న ఆసక్తి నెలకొంది. సంగారెడ్డి జిల్లా అందోల్​ నుంచి ఎన్నికయిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు బెర్త్​ దాదాపు ఖాయమని చెప్తున్నా.. ఆయనను  శాసనసభ స్పీకర్​గా నియ మించే అవకాశం కూడా  లేకపోలేదన్న  ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ నుంచి ఎన్నికయిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని ఆశిస్తున్నారు.  ఉమ్మడి మెదక్​ జిల్లా నుంచి  దామోదర్ రాజనర్సింహకు బెర్త్​ ఖాయమని కాంగ్రెస్​ నేతలు చెప్తున్నారు.    

తెలంగాణలో ఏర్పడనున్న తొలి కాంగ్రెస్​ మంత్రివర్గంలో  ఆయనకు కీలకమైన పోర్ట్​పోలియో  దక్కుతుందని ఆయన సన్నిహితులు  చెప్పుకుంటున్నారు.  ఉమ్మడి మెదక్ జిల్లాలో ని 10 సెగ్మెంట్లలో ఏడు చోట్ల బీఆర్ఎస్​ గెలిచింది.  అందోల్​, నారాయణఖేడ్​, మెదక్​లలో మాత్రమే కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిచారు. మెదక్​, నారాయణఖేడ్​ నుంచి మైనంపల్లి రోహిత్, పట్లోళ్ల సంజీవరెడ్డి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.  దీంతో దామోదర్​కు రూట్​ క్లియర్​ అయ్యింది.   సమీకరణాల్లో భాగంగా దామోదర్​ రాజనర్సింహకు  కేబినెట్​లో చోటు ఇవ్వలేని  పరిస్థితి వస్తే ఆయనకు స్పీకర్​  బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఆయన స్పీకర్​ పదవి తీసుకునేందుకు   సుముఖంగా లేరని ఆయన వర్గీయులు అంటున్నారు.  

ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం

జిల్లాలో సీనియర్​ లీడర్​ అయిన దామోదర్​  వైఎస్​ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినేట్​లో మంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్​రెడ్డి  హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో   డిప్యూటీ సీఎంగా పని చేశారు.   దామోదర్ రాజనర్సింహ మొదటిసారి  1989లో అందోల్ నియోజకవర్గం నుంచి   ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2004లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి..  2006లో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి 2009లో  గెలిచిన ఆయన  రోశయ్య మంత్రివర్గంలో  చోటు దక్కించుకున్నారు.  2010 కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్​లో డిప్యూటీ సీఎంగా పని చేశారు.  

పొన్నం కూడా రేసులో..   

సిద్దిపేట జిల్లాలో ఉన్నా కరీంనగర్​, వరంగల్​ జిల్లాల పరిధిలో విస్తరించిన హుస్నాబాద్  నుంచి   గెలిచిన  పొన్నం ప్రభాకర్ కూడా రేసులో ఉన్నారు.   సిద్దిపేట జిల్లా నుంచి ఆయన ఒక్కరే కాంగ్రెస్​ నుంచి గెలుపొందారు.  సిద్దిపేట జిల్లా నుంచే  బీఆర్ఎస్​ ముఖ్య నేతలు కేసీఆర్​, హరీశ్​రావు ప్రాతినిధ్యం వహిస్తున్నందున జిల్లాలో పార్టీ కేడర్​కు భరోసా ఇచ్చేందుకు  పొన్నం ను కేబినెట్​లోకి తీసుకుంటారన్న వాదన వినిపిస్తోంది.  

ఆయన బీసీ కోటాలో పదవి ఖాయమన్న ధీమాలో ఉన్నారు.  తెలంగాణ ఉద్యమ కాలంలో  కరీంనగర్ ఎంపీగా పొన్నం ప్రభాకర్ క్రియశీలంగా పని చేసి..  పార్టీ హైకమాండ్​ దృష్టిలో పడ్డారు.  ఢిల్లీ పెద్దల ద్వారా ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.   బుధవారం ఆయన ఎల్ బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను  దగ్గరుండి పర్యవేక్షించారు.