WHO Heart Attacks : గుండెపోటు అసలు కారణాలు ఇవే

WHO Heart Attacks : గుండెపోటు అసలు కారణాలు ఇవే

ఈమధ్య గుండెపోట్లు (Heart Attacks) వణికిస్తున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి. ఛాతిలో నొప్పితో చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. క్షణాల్లో ప్రాణం విడిస్తున్నారు. ఈ మధ్యకాంలోనే చాలామంది గుండెపోటుతో చనిపోయారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు కూడా హార్ట్ ఎటాక్ తో సడెన్ గా మరణిస్తున్నారు. అప్పటివరకు ఎంతో హెల్తీగా ఉన్న వారు ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. 

గతంలో 50 ఏళ్లు దాటిన‌వారిలో ఎక్కువ‌గా గుండెపోటు మ‌ర‌ణాలు చూసేవాళ్లం. క‌రోనా త‌ర్వాత చిన్నా పెద్దా తేడా లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. హృద్రోగ సంబంధిత సమస్యల కుటుంబ చరిత్ర కలిగిన వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఒకవైపు కరోనా సబ్ వేరియంట్లతో ఇబ్బందులు.. మరోవైపు అనారోగ్య సమస్యలు, ఇంకా గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారు అధికమవుతున్నారు. ఇటీవలి కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఇందుకు కారణాలు చెబుతూ ఒక నివేదిక విడుదల చేసింది.  ఉప్పు అధికంగా వాడటం వల్లే గుండెపోటు వస్తున్నట్లు పేర్కొంది.

ఉప్పు మోతాదు పెంచితే అనారోగ్య సమస్యలు వస్తాయని.. మితిమీరిన ఉప్పు వాడకం వల్ల గుండెపోటు మాత్రమే కాకుండా ఊబకాయం, బోలు ఎముకల వ్యాధి, కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వస్తాయని నివేదికలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పును (Sodium ) మాత్రమే వాడాలి. కానీ, ప్రపంచంలో అందుకు విరుద్ధంగా 10 గ్రాముల ఉప్పును రోజుకు తీసుకుంటున్నారని పేర్కొంది. గుండెపోటు వంటి హఠాన్మరణాలకు అనారోగ్యపు ఆహారపు అలవాట్లే కారణమని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. 

2025 నాటికి ప్రపంచంలో ప్రపంచంలో సోడియం వినియోగాన్ని తగ్గించాలన్న లక్ష్యం ఆచరణలో కనిపించడం లేదని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఉప్పు వాడకం తగ్గిస్తే 2030 నాటికి 70 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడవచ్చని డబ్ల్యూహెచ్ఓ నివేదిక చెబుతోంది.  అయితే సోడియం విషయంలో డబ్ల్యూహెచ్ఓ సిఫారసులను ప్రపంచంలో కేవలం 9 దేశాలే అమలు చేస్తున్నాయి. బ్రెజిల్( Brazil), చిలీ(Chile), చెక్ రిపబ్లిక్ (Czech Republic), లిథువేనియా (Lithuania), మలేషియా (Malaysia), మెక్సికో (Mexico), సౌదీ అరేబియా (Saudi Arabia), స్పెయిన్ ( Spain), ఉరుగ్వే (Uruguay) మాత్రమే డబ్ల్యూహెచ్ఓ సిఫార్సులను పాటిస్తున్నాయి.