టార్గెట్.. మోడీనా? రాహుల్ గాంధీనా?

టార్గెట్.. మోడీనా? రాహుల్ గాంధీనా?

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో తలమునకలై ఉండగా.. మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, కేసీఆర్, ఉద్ధవ్ థాక్రే వంటి సీఎంలు బీజేపీ, కాంగ్రెసేతర కూటమి గురించి మాట్లాడుతున్నారు. లోక్​సభ ఎన్నికలకు ఇంకా దాదాపు రెండేండ్ల టైమ్​ఉన్నా.. వీరంతా ప్రధాని నరేంద్ర మోడీపై రాజకీయ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు ఇప్పుడే సంకేతాలు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకూడదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలనే దిశగా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. వీరు అనుకున్నట్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వచ్చినా.. తెలంగాణ సీఎం కేసీఆర్​కీలక పాత్ర పోషించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే రాష్ట్రంలో17 సీట్లకు టీఆర్ఎస్15 గెలుచుకున్నా.. యూపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్​ రాష్ట్రాలతో పోలిస్తే అవి చాలా తక్కువ సీట్లు. రాష్ట్రంలో రాజకీయంగా నిలుదొక్కుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మళ్లించడం కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీల విజయం కోసం ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అధికారం చేపట్టడాన్ని ఈ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ నేరుగా పోరాడుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీదే అధికారం కాగా, పంజాబ్​లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. పంజాబ్​ను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు కనీసం మరో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమికి ఆయనే సారథ్యం వహించే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు పార్టీ ఉనికి ప్రశ్నార్థకరంగా ఉన్న యూపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోయినా, అక్కడ పార్టీ పరిస్థితిని మెరుగు పరచుకోవాల్సి ఉంది. గోవా, ఉత్తరాఖండ్ వంటి చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా జాతీయ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. అయితే కాంగ్రెస్​ తిరిగి పుంజుకుంటోందనే  సందేశం మాత్రం దేశ వ్యాప్తంగా వెళ్తోంది. దేశంలో సగానికి పైగా సీట్లలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. అలాంటి వాతావరణం ఏర్పడి, బీజేపీ ఏమాత్రం బలహీనమైనా.. కాంగ్రెస్ మరింతగా బలం పుంజుకుంటుంది. అందుకనే పార్లమెంట్​లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ.. సభ్యులు లేవనెత్తిన అంశాలను ప్రస్తావించకుండా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై రాజకీయ దండయాత్రకు దిగారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించే ఆ ప్రసంగం చేసిన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల పోరాటంలో తలమునకలై ఉండగా, కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, కేసీఆర్, ఉద్ధవ్ థాక్రే వంటి వారు బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. త్వరలో బీజేపేతర ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయమని మమత స్వయంగా స్టాలిన్​ను కోరారు. 

గవర్నర్లపై పోరుకు సన్నాహాలు

కేసీఆర్ నుంచి మమత వరకు వీరంతా ప్రధాని నరేంద్ర మోడీపై రాజకీయ పోరాటానికి సిద్ధపడుతున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్లపై ‘పోరాటం’ ఎజెండాగా తాము సమావేశం కావాలనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు గవర్నర్లతో చెప్పుకోదగిన వివాదాలు చెలరేగడం లేదు. సీపీఎం నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్న కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయ్​ విజయన్​ల మధ్య కొన్ని అంశాలపై విబేధాలు తలెత్తుతున్నప్పటికీ ఇద్దరు సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తున్నారు. తాజాగా వివాదాస్పదమైన లోకాయుక్త సవరణ ఆర్డినెన్సుకు గవర్నర్ ఆమోదం తెలపడం, అదే సమయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని తన వ్యక్తిగత సహాయకుడిగా నియమించుకున్న గవర్నర్ చర్యను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. దాంతో ప్రతిపక్ష కాంగ్రెస్ క్విడ్ ప్రోకో చేసింది. నీట్ పై అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తమిళనాడు గవర్నర్ తిరస్కరించడం, నామినేటెడ్ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఫైల్​ను చాలాకాలంగా మహారాష్ట్ర గవర్నర్ తన వద్దనే ఉంచుకోవడం, రాష్ట్ర అసెంబ్లీని ఏకపక్షంగా బెంగాల్ గవర్నర్ ప్రోరోగ్ చేయడం వంటి చర్యలు ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లతో ముఖ్యమంత్రుల వివాదాలను తీవ్రతరం చేస్తున్నాయి. అయితే ప్రాంతీయ పార్టీలు గవర్నర్లపై ఒక స్థాయికి మించి పోరాటం చేయలేవు. గతంలో ఎన్టీఆర్​ చేసినట్లు ‘గవర్నర్ పోస్ట్’ లనే రద్దుచేయమని కోరే పరిస్థితుల్లో లేవు. కేంద్రం కూడా వివాదాలను ఎక్కువ దూరం తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉండే అవకాశం లేదు. ‘చర్చల కోసం’ ఎప్పుడైనా ఒకసారి రాజభవన్ కు రమ్మనమని మమతా బెనర్జీని ఆహ్వానిస్తూ బెంగాల్ గవర్నర్ జగదేవ్ ధనకర్ ఫిబ్రవరి15న ఒక లేఖ రాయడం ఈ సందర్భంగా గమనార్హం. తెలంగాణాలో అటువంటి పరిస్థితి లేకపోయినా.. రాష్ట్రంలో రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం కేసీఆర్ ‘కేంద్రంపై పోరాటం’ అస్త్రం ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే లోక్​సభ ఎన్నికలకు మరో రెండేండ్లకు పైగా సమయం ఉంది. ఇప్పుడే కేంద్రంపై పోరాటం అంటూ ప్రాంతీయ పార్టీలు హడావుడి చేయాల్సిన అవసరం లేదు. గోవా ఎన్నికల రణరంగంలోకి హడావిడిగా మమతా బెనర్జీ దిగినా పెద్దగా ప్రభావం చూపుతున్న దాఖలాలు కనిపించడంలేదు. ఇప్పుడు వీరంతా ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా రాహుల్ గాంధీ ఎదగకుండా చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. అందుకే గోవాలో టీఎంసీ పోటీ చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, బీజేపీకి మేలు చేకూర్చడం కోసమే అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రెండు, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడితే తిరిగి జాతీయ రాజకీయాలు రాహుల్ గాంధీ చుట్టూ కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అదే జరిగితే కేసీఆర్, మమతా వంటి నేతల జాతీయ రాజకీయాల ఆకాంక్షలకు గండి పడుతుంది. 

కేసీఆర్ ఎత్తుగడ ఏమిటి?

తాజాగా సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా మాట్లాడటం, అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ చేసిన వాఖ్యలను కాంగ్రెస్ వారికన్నా ముందుగా తానే ఖండించడం వెనక వ్యూహాత్మక ఎత్తుగడ కనిపిస్తున్నది. కేసీఆర్ ఆ కామెంట్​చేయగానే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొనడం గమనార్హం. అలాంటి సందేశం ప్రజలకు చేరితే తెలంగాణలో కాంగ్రెస్ బలహీనమై, బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుంది. అందుకనే టీఆర్ఎస్​తో తాము చేతులు కలిపే ప్రసక్తి లేదంటూ చెప్పడం కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నో తంటాలు పడుతున్నారు. అస్సాం ముఖ్యమంత్రిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదును తాను కోరిన సెక్షన్ల కింద నమోదు చేయలేదని ఆందోళనలకు దిగడం గమనిస్తే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉనికిని కాపాడుకోవాలనే ఆతృతే ఎక్కువగా కనిపిస్తోంది. అస్సాం ముఖ్యమంత్రి వాఖ్యలపై రేవంత్ రెడ్డి మినహా దేశంలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం కూడా గమనార్హం. మరోవైపు, తన ప్రభుత్వంపై చెలరేగుతున్న అసంతృప్తి నుంచి ప్రజల దృష్టి తప్పించడం కూడా కేసీఆర్ వ్యుహంగా చెప్పవచ్చు.  ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం జరుగుతున్నట్లు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కీలక పాత్ర వహించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటె కేసీఆర్ ప్రభంజనం వీచినా తెలంగాణలో15కు మించి ఎంపీ సీట్లను తెచ్చుకోలేరు. కానీ మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి వారు30కి పైగా సీట్లు సాధించే అవకాశం ఉంది. బీజేపీకి పరాజయం ఎదురైతే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్​లు కూడా30కి పైగా సీట్లు గెలుచుకుంటారు. ఉద్ధవ్ థాక్రే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి వారు కూడా కేసీఆర్ కన్నా ఎక్కువ సీట్లు సాధించే వీలు ఉంది. అలాంటప్పుడు కేసీఆర్​కు కేంద్రంలో కీలక పాత్ర వహించే అవకాశం ఉండదు. అందుకని కేవలం ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ఎక్కువగా ప్రస్తావిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈ ప్రాంతీయ పార్టీలు అన్ని కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకూడదని, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నాయి. బీజేపీ గెలిస్తే తిరిగి పూర్తి ఆధిక్యత సాధించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పుంజుకున్నా పూర్తి ఆధిక్యత సాధించే అవకాశాలు లేవు. పదేళ్ల యూపీఏ పాలనలో కూడా కాంగ్రెస్ మెజారిటీకి చాలా దూరంలో ఉంది. అందుకే పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పుంజుకోవాలని కోరుకొంటూనే రాహుల్ గాంధీ నాయకత్వం బలపడకూడదని కూడా స్పష్టంగా ఉన్నాయి. ఆ దిశగానే అవి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.

:: చలసాని నరేంద్ర, సోషల్​ ఎనలిస్ట్​