సీటీవో నుంచి సీఈవోగా ఎదిగిన పరాగ్ అగర్వాల్

సీటీవో నుంచి సీఈవోగా ఎదిగిన పరాగ్ అగర్వాల్

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ తర్వాత మరో ఇండియన్‌కు టాప్ కంపెనీలో కీలక పదవి దక్కింది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సీఈవోగా మన దేశానికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ట్విట్టర్ ప్రస్తుత సీఈవో జాక్ డోర్సీ పదవి నుంచి దిగిపోతా రని కొంతకాలంగా రూమర్స్ వస్తుండగా, తాను వైదొలగుతున్నానంటూ సోమవారం స్వయంగా ప్రకటించారు. జాక్ డోర్పీ స్థానంలో చీఫ్ టెక్నికల్‌ ఆఫీసర్‌‌ (సీటీవో)గా ఉన్న పరాగ్ అగర్వాల్ సీఈవోగా బాధ్యతలు చేప ట్టారు.

బాంబే ఐఐటీలో బీఎస్సీ చదివి..

పరాగ్ 2005లో బాంబే ఐఐటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు. స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో 2011లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూ కంపెనీల రీసెర్చ్ వింగ్‌లో పని చేశారు. ట్విట్టర్‌‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌‌గా 2011లో చేరారు. 2017 అక్టోబర్‌‌ నాటికి ట్విట్టర్ సీటీవో (చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌‌)గా ఎదిగారు. సీటీవోగా.. టెక్నికల్ స్టాటజీ, మెషీన్ లెర్నింగ్, ఏఐ విభాగంలో కన్జూమర్, రెవెన్యూ, సైన్స్ టీంల బాధ్యతలు చూస్తున్నారు. 

ప్రతి కీలక నిర్ణయం వెనుక పరాగ్: జాక్ డోర్సీ ప్రశంసలు

పరాగ్ అగర్వాల్‌ను ట్విట్టర్‌‌కు కొత్త సీఈవోగా నియమించడం పట్ల జాక్ డోర్సీ హర్షం వ్యక్తం చేశారు. ఈ స్థానానికి పరాగ్ సరైన వ్యక్తి అని, ఎప్పటి నుంచో తన చాయిస్‌ కూడా ఆయనేనని అన్నారు. ట్విట్టర్‌‌ను డీప్‌గా అర్థం చేసుకున్న వ్యక్తి అని, కంపెనీ అవసరాలను తెలుసుకుని పని చేస్తారని చెప్పారు. ప్రతి కీలక నిర్ణయం వెనుక పరాగ్‌ ఉండేవారని, ట్విట్టర్ కంపెనీ ఎదుగుదలో ఆయన పాత్ర ఎనలేదని ప్రశంసలు కురిపిస్తూ జాక్‌ ట్వీట్ చేశారు. దీనికి స్పందిస్తూ పరాగ్ అగర్వాల్‌.. థ్యాంక్స్ చెప్పారు.  భవిష్యత్తు పట్ల ఎంతో ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నానంటూ ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి, సీఈవో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు చెప్పారు.