క్రిస్టినా చావుకు కారణమెవరు?

క్రిస్టినా చావుకు కారణమెవరు?

అది 1947 మే.. క్రిస్టినా, జాక్ కెటిల్​వెల్​ ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఆ తర్వాత హనీమూన్​కు వెళ్లారు. పెళ్లైన ఎనిమిదో రోజు సాయంత్రం, వాళ్లు దిగిన కాటేజీకి 150 అడుగుల దూరంలో క్రిస్టినా శవం కనిపించింది. కాటేజీలో జాక్​ రక్తపు మడుగులో ఉన్నాడు. ఇంతకీ ఆ రోజు వాళ్లకు ఏం జరిగింది? ఇదే ప్రశ్న జాక్ కోలుకున్నాక అడిగితే.. ‘‘తెలియదు” అనే సమాధానం. ఇంతకీ క్రిస్టినా చావుకు కారణమెవరు? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు.

ఒక రోజు సాయంత్రం క్రిస్టినా, జాక్​ ఉన్న కాటేజీ వైపు ఒక బోట్ యజమాని వెళ్లాడు. అప్పటికే కాటేజీ కాలిపోయి ఉంది. దానికి కొంత దూరంలో, నది అంచున 9 అంగుళాల లోతున్న నీళ్లలో నైట్​ గౌన్​ వేసుకున్న అమ్మాయి పడి ఉండడం గమనించాడు. భర్త జాక్ కెటిల్ ‌‌వెల్, అతని ఫ్రెండ్ రోనాల్డ్​తో కలసి ఆమె నాలుగు రోజులుగా అదే కాటేజ్​‌‌లో ఉంటోంది. 

ప్రేమించి, పెండ్లి.. 

క్రిస్టినా సిసిలియా1925లో కెనడాలోని టొరంటోలో  పుట్టింది. ఆమె తల్లిదండ్రులు పోలిష్ ఇమ్మిగ్రెంట్స్. వాళ్లు రోమన్ కాథలిక్​లు. భక్తి చాలా ఎక్కువ. క్రిస్టినా అంటారియోలోని ఒక బ్యాంకులో పనిచేసేది.1947 మే 12న ఇంట్లో చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె చెల్లెలు చాలా కష్టపడి క్రిస్టినాను వెతికి పట్టుకుంది. అప్పటికే క్రిస్టినా తన బాయ్ ‌‌ఫ్రెండ్  ‌‌ ‌‌ జాక్​‌‌ని పెండ్లి చేసుకుంది. చెల్లెలు ఇంటికి రమ్మని బతిమాలినా వెళ్లలేదు. దాంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. జాక్ 1921లో అంటారియోలో పుట్టాడు. అతను రోమన్ కాథలిక్ కాదు. అందుకే క్రిస్టినా పేరెంట్స్ వాళ్ల పెండ్లికి ఒప్పుకోలేదు. పెండ్లి తర్వాత ఇద్దరూ హనీమూన్​‌‌కు వెళ్లారు. ప్రేమించి పెండ్లి చేసుకోవడం వల్ల.. ఏదైనా అనుకోని సమస్యలు రావచ్చని జాక్ ఫ్రెండ్ రోనాల్డ్​ని కూడా తమతో తీసుకెళ్లారు. 

ఆ సాయంత్రం ఏం జరిగింది? 

1947 మే 17న బోట్​లో దగ్గరలోని సెవెర్న్ ఫాల్స్ అంచున ఉన్న కాటేజీకి వెళ్లారు. ఆ వాటర్​ ఫాల్స్ రెండు నదుల మధ్య ఉంది. వీళ్లు ముగ్గురూ అక్కడ మూడు రోజులు ఉన్నారు. నాలుగో రోజు సాయంత్రం రోనాల్డ్​ సన్​బాత్ చేయడానికి కాటేజీకి కొంతదూరం వెళ్లాడు. అదే టైంలో కాటేజీ నుంచి సడెన్​గా పొగలు రావడం కనిపించింది. హడావిడిగా కాటేజీకి పరిగెత్తాడు. జాక్ నుదిటిపై పెద్ద గాయం ఉంది. బాగా రక్తం కారుతోంది. కాటేజీ అంతా వెతికాడు.. క్రిస్టినా కనిపించలేదు. దాంతో జాక్​ను హాస్పిటల్​కు తీసుకెళ్లాడు.  తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జాక్​కు ఫస్ట్ ఎయిడ్ చేశాక, ‘ఏం జరిగింది?’ అని అడిగితే.. తనకేమీ జ్ఞాపకం లేదని చెప్పాడు. టెస్ట్ చేస్తే అతని కడుపులో కోడైన్ అనే డ్రగ్ ఉన్నట్టు తెలిసింది. క్రిస్టినాను పోస్ట్​మార్టం చేసినప్పుడు.. ఆమె బాడీలో కూడా అదే డ్రగ్ ఆనవాళ్లు కనిపించాయి. 

ఇన్వెస్టిగేషన్  ‌‌ ‌‌

క్రిస్టినా శవాన్ని పోస్ట్​మార్టం చేసిన డాక్టర్లు ఆమెకు చిన్న గాయం కూడా కాలేదని గుర్తించారు. ఆమెను కొట్టి దాడి చేసిన గుర్తులు కూడా లేవు. నీటిలో మునిగిపోవడం వల్లే ఆమె చనిపోయింది. కానీ.. తొమ్మిది అంగుళాల లోతున్న నీటిలో ఎలా మునిగింది? అనే ప్రశ్నకు సమాధానం దొరకలేదు. అందుకే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత జాక్ ‌‌ని పోలీసులు మూడు గంటల పాటు, రోనాల్డ్​ని 13 గంటలపాటు ఇన్వెస్టిగేట్ చేశారు. మూడు వేల పదాల స్టేట్​మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత ఈ కేసును మీడియా హైలైట్ చేసింది. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ మర్డర్  మిస్టరీపై కథనాలు వచ్చాయి. దాంతో జాక్ చాలా ఫేమస్ అయ్యాడు. కొందరైతే అతని ఆటోగ్రాఫ్​ కూడా తీసుకున్నారు. 

ఎలా చనిపోయింది? 

క్రిస్టినా ఎలా చనిపోయిందో ఎవరూ చెప్పలేకపోయారు. కానీ.. ఆమె చావుపై కొన్ని థియరీలు మాత్రం చెప్పారు. ఒక థియరీ ప్రకారం.. క్రిస్టినా మానసిక ఆరోగ్యం బాగాలేదని చెప్తున్నారు. అందుకు కారణం.. ఆమె రోనాల్డ్​కి రాసిన లెటర్లు. క్రిస్టినా.. తన పెండ్లికి కొన్ని రోజుల ముందు జాక్​ని అనుమానించింది. అందుకే రోనాల్డ్​కి ‘జాక్ లైఫ్​లో మరో అమ్మాయి ఉందనే విషయం తెలిసి భరించలేకపోతున్నా’ అని లెటర్ రాసింది. మరో లెటర్​లో తనను ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడమే కాదు.. జాక్​ని కూడా చంపేస్తానని రాసింది. ఈ లెటర్లు దొరికిన మాట వాస్తవమే కానీ.. అవి రాసింది తనే అని చెప్పడానికి ఆధారాలు దొరకలేదు. విచిత్రం ఏంటంటే.. కాటేజ్​ మొత్తం కాలిపోయినా.. లెటర్లు మాత్రం కొంచెం కూడా కాలలేదు. 

ఇన్సూరెన్స్  ‌‌ ‌‌

జాక్, క్రిస్టినా పెండ్లికి కొన్ని రోజుల ముందు రోనాల్డ్ ఈ ఇద్దరి పేరు మీద లైఫ్ ఇన్సూరెన్స్ చేయించాడు. ఇద్దరిలో ఎవరు చనిపోయినా.. 500 కెనడియన్ డాలర్లు బెనిఫిషియరీకి వస్తాయి. అయితే.. ఈ ఇన్సూరెన్స్​లకు బెనిఫిషియరీగా రోనాల్డ్ ఉన్నాడు. పథకం ప్రకారమే రోనాల్డ్ ఇన్సూరెన్స్ చేయించి, క్రిస్టినాను చంపాడని కొందరు వాదిస్తున్నారు. అంతేకాదు.. కాలిపోయిన కాటేజ్ కూడా రోనాల్డ్​దే. దానికి కూడా ఐదు వేల డాలర్ల ఇన్సూరెన్స్ ఉంది. అయితే.. ఎవరి వాదనలు ఎలా ఉన్న జాక్​, రోనాల్డ్​లు నేరం చేశారనడానికి సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా తీర్పు ఇచ్చింది కోర్టు. ఆ తర్వాత మూడేండ్లకు జాక్ మళ్లీ పెండ్లి చేసుకున్నాడు. క్రిస్టినాతో పెండ్లి తర్వాత కలిసి ఉన్న  ఆ ఇంట్లోనే ఉన్నాడు.