
న్యాయమూర్తికి రెండు ప్రధానమైన విధులు ఉన్నాయి. అవి మొదటిది.. అమాయకుడికి శిక్ష పడకుండా చూడటం. రెండోది.. నేరం చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకుని పోకుండా చూడటం. ఇవి రెండూ ప్రధానమైన విధులు. అంతేకాదు ముఖ్యమైనవి కూడా. జులై 11, 2006న బొంబాయిలో జరిగిన ఉగ్రదాడిలో 187 మంది మరణించారు. 824 మంది గాయపడ్డారు. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం అనుమతించిన ప్రకారం ఆరు నెలల్లో ముద్దాయిలను పట్టుకుని వారిమీద చార్జ్‌షీట్‌ను ‘సిట్’ దాఖలు చేసింది.
ఈ చట్ట ప్రకారం ఏర్పాటుచేసిన ప్రత్యేక న్యాయస్థానంలోని న్యాయమూర్తి యతిన్డి షిండే 2015లో తన తీర్పును ప్రకటించారు. ఈ కేసులో ఐదుగురికి మరణశిక్ష, ఏడుగురికి జీవితఖైదుని కోర్టు విధించింది. తన నిర్ణయానికి తగు కారణాలను చూపిస్తూ ట్రయల్ కోర్టు 1000 పేజీల తీర్పును రాసింది. సాక్షుల వ్యక్తిత్వాలని, ప్రవర్తనను, క్రాస్ ఎగ్జామినేషన్‌ను అన్నింటిని పరిగణనలోకి తీసుకుని కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టులో అప్పీలును దాఖలు చేశారు. ఈ తీర్పును బొంబాయి హైకోర్టు ఆమోదించలేదు.
తన శక్తిమంతమైన పరిశీలనలో ఈ ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉన్న 12మంది దోషులను ముంబై హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. విడుదల చేసేక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ ఎస్ కిలోర్, శ్యామ్ సి చందక్లు చాలా తీవ్రమైన పరిశీలనలను చేశారు. అవి..‘నేరానికి పాల్పడిన వ్యక్తిని శిక్షించడం అనేది ఒక నిర్దిష్టమైన, ముఖ్యమైన దశ. కానీ, కేసుని పరిష్కరించి చూపించే క్రమంలో తప్పుడు కేసుని పెట్టడం, పరిష్కరించినట్టు చూపించడం వల్ల న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పోతుంది.
సమాజానికి తప్పుడు భరోసాని కల్పిస్తుంది. వాస్తవానికి ముంపు ఇంకా పొంచి ఉంది. ఆ విషయాన్ని ఈ కేసు తెలియజేస్తోంది. ప్రాసిక్యూషన్ కేసుపై హైకోర్టు తీవ్రమైన నేరారోపణలను చేసింది. ముంబై పోలీసుల ఉగ్రవాద నిరోధక దళం (సిట్) సమర్పించిన సాక్ష్యాలు నమ్మదగినవి కాదని కోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసు ప్రధానంగా మూడు అంశాలమీద నిర్మించబడింది. అవి.. ప్రత్యక్ష సాక్షుల కథనాలు, పేలుడు పదార్థాల జప్తులు, మూడోది.. ముద్దాయిల నేరాంగిక ప్రకటనలు. ఈ మూడు అంశాలు చట్టపరమైన పరిశీలనలో నిలవలేకపోయాయని ముంబై హైకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
విశ్వాసం కలిగించని సాక్షులు
ప్రాసిక్యూషన్ 8 మంది ప్రత్యక్ష సాక్షులను కోర్టులో విచారించింది. అందులో కొంతమంది టాక్సీ డ్రైవర్లు ఉన్నారు. వాళ్లు ముద్దాయిలను తమ టాక్సీలలో తీసుకుని వెళ్లినారని, బాంబులను పెట్టే క్రమాన్ని వారు చూశారని ప్రాసిక్యూషన్ కథనం. వివిధ కారణాల వల్ల సాక్ష్యాలను విశ్వసించడం సరైందికాదని హైకోర్టు అభిప్రాయపడింది. పోలీసుల దర్యాప్తులో చాలా లొసుగులు ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది గుర్తింపు పరీక్షలు (టీఐపి). గుర్తింపు పరీక్షలు చెల్లవని కోర్టు అభిప్రాయపడింది. దానికి కారణం.. ఆ గుర్తింపు పరీక్షలు నిర్వహించిన వ్యక్తి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. అది కూడా అతను ఆ పరీక్ష నిర్వహించే సమయానికన్నా ముందే పదవీ విరమణ చేశాడు. అలా పదవీ విరమణ చేసిన అధికారితో ఈ ఐడెంటిఫికేషన్ పరేడ్ ఎందుకు నిర్వహించారో చెప్పలేదు. మన రాష్ట్రంలో ఈ పరేడ్లను జ్యుడీషియల్ మేజిస్ర్టేట్స్ నిర్వహిస్తారు.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్స్ ఈ పరేడ్‌ను నిర్వహిస్తేనే వాటికి కొంత విశ్వసనీయత ఉంటుంది. అలాంటిది బొంబైలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ నిర్వహిస్తారు. అందులోనూ ఆ పరేడ్లను నిర్వహించిన వ్యక్తి పదవీ విరమణ చేసిన వ్యక్తి. ఒక అనుమానితుడితో అదే అవయవసౌష్టవంతో ఉన్న ఐదుగురికి మించి వ్యక్తులతో కలిపి సాక్షులని అనుమానితుడిని గుర్తుపట్టమని చెబుతారు.
నమ్మశక్యం కాని జప్తులు
కేసులో నిందితుల నుంచి పేలుడు పదార్థాలైన ఆర్డీఎక్స్, ఇతర రసాయనాలు, పుస్తకాలను, చిత్రాలను, మొబైల్ ఫోన్లను, ప్రెషర్ కుక్కర్లను ఇతర వస్తువులను జప్తు చేయడంలో ప్రామాణిక ప్రొసీజర్లను పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. బొంబై పోలీసు మాన్యవల్ ప్రకారం ఏదైనా వస్తువను స్వాధీనం చేసుకున్న వెంటనే ప్యాక్ చేయాలి. లక్కతో సీల్ చేయాలి. అవి ఈ రికవరీలలో పోలీసులు పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది. సీల్ చేయకుండా ల్యాబ్‌కు పంపించారని ల్యాబ్ అధికారులు తిప్పి పంపించిన తరువాత సీల్ చేసినట్టు కోర్టు గుర్తించింది.
నేరాంగీకార ప్రకటనలు
పోలీసులు ముందు ఇచ్చిన నేరాంగీకార ప్రకటలనకు విలువలేదు. అవి ఆమోదయోగ్యం కాదు. అయితే, ‘మోకా’ చట్ట ప్రకారం సీనియర్ పోలీస్ అధికారుల ముందు ఇచ్చిన నేరాంగీకార ప్రకటనలు ఆమోద యోగ్యం. అయితే, ఈ నేరాంగీకార ప్రకటనలు స్వచ్ఛందంగా ఇచ్చి ఉండాలి. ఈ స్టేట్మెంట్లని నలుగురైదుగురు సీనియర్ పోలీసు అధికారులు నమోదు చేశారు. అవి వివిధ ముద్దాయిలవి. అయితే అవి అన్నీ ఒకవిధంగా ఉండటం వల్ల వాటి విలువ తగ్గిపోయింది.
అందరి ప్రశ్నలు, జవాబులు ఒకేవిధంగా ఉండటం వల్ల అవి ఆమోదయోగ్యం కాకుండా పోయాయి. తీవ్రంగా చిత్ర హింసలకు గురిచేసి ఈ నేరాంగీకార స్టేట్మెంట్లను నమోదు చేసినట్టుగా కోర్టు గుర్తించింది. తమను బెల్టులతో కొట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి సంతకాలు తీసుకున్నారని ముద్దాయిలు కోర్టు ముందు చెప్పారు. ఈ ఆరోపణలకు వైద్య సాక్ష్యం ఉన్నట్టుగా హైకోర్టు గుర్తించింది. అదేవిధంగా ముద్దాయిలకు సరైనవిధంగా న్యాయ సహాయం అందలేదని కూడా కోర్టు అభిప్రాయపడింది. చట్టం కఠినమైనది. సాక్ష్యాలు కూడా బలంగా ఉండాలి. కానీ, ఆవిధంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.
ముద్దాయిలు జైలుకు..
అంతేకాదు ప్రాసిక్యూషన్‌కి అనుమతిని ఇచ్చిన సీనియర్ పోలీస్ అధికారి అవసరమైన పత్రాలను చూడకుండానే అనుమతి ఇచ్చారు. ఆ సీనియర్ అధికారిని ప్రాసిక్యూషన్ కోర్టులో విచారించలేదు. అతను తన చర్యలను సమర్థించుకునే అవకాశం ప్రాసిక్యూషన్ కల్పించలేదు. ఈ కారణాలు పేర్కొంటూ ఈ తీవ్రమైన కేసుని బొంబై హైకోర్టు కొట్టివేసి ముద్దాయిలను విడుదల చేసింది. ఇలాంటి కేసుల్లో ముద్దాయిల విడుదల పోలీసులను నిరుత్సాహపరుస్తుంది.
ప్రజలు ఆందోళనకి గురవుతారు. అమాయకులను ప్రాసిక్యూట్ చేశారన్న అభిప్రాయం బలపడుతుంది. నేరం చేసిన వ్యక్తులు ఎవరు? వాళ్లను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారు? వీటికి సమాధానాలు ఎవరు చెబుతారు?. సుప్రీంకోర్టు తీర్పుమీద స్టే విధించింది. కానీ, ముద్దాయిలను జైలుకు పంపించేవిధంగా ఆదేశాలను జారీ చేశారు. ఇన్నిరోజులు వారి జైలు జీవితానికి నష్టపరిహారం చెల్లించినా అది వారి స్వేచ్ఛను భర్తీ చేసినట్టు అవుతుందా?. ఇవీ వేదిస్తున్న ప్రశ్నలు.
సన్నగిల్లిన విశ్వసనీయత
ఈ పరేడ్‌ను నిర్వహించడానికి సంవత్సరం ముందే ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ పదవీ విరమణ చేశాడు. దానివల్లనే ఆ పరేడ్‌కు విశ్వసనీయత సన్నగిల్లింది. అయితే, ముద్దాయిలను సాక్షులు కోర్టులలో కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. కానీ, వాటికి బలపరిచే సాక్ష్యాలు ఉండవు. అందుకని వాటిని బలహీనమైన సాక్ష్యాలుగా కోర్టులు పరిగణిస్తాయి.
అందులోనూ ఈ కేసులో నేరం జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఈ గుర్తింపు పరీక్షలు జరిగాయి. ఈ కేసులోని మిగతా సాక్ష్యాలు పోలీసుల దగ్గరకి కొన్ని నెలల తర్వాత వచ్చారు. అప్పుడు వారి స్టేట్మెంట్లను పోలీసులు నమోదు చేశారు. ఈ విధంగా ఆలస్యంగా పోలీసుల దగ్గరకి రావడానికి గల కారణాలను కోర్టు దృష్టికి తీసుకుని రావాలి. ఆ విషయంలో పోలీసులు విఫలమయ్యారు. నాలుగు నెలలు మౌనంగా ఉండి ఆ తరువాత వారి టాక్సీలో ప్రయాణం చేసిన వ్యక్తులను గుర్తుపట్టడం కష్టమైన పని. విశ్వసించే వీలులేని పరిస్థితి.
- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)-