
పరిపాలనలో ప్రజలే భాగస్వాములు.. అదే ప్రజాస్వామ్యం. అందుకే వారు ఓటుహక్కు ద్వారా తమను పాలించుకునే ప్రభుత్వాన్ని తామే ఎన్నుకొంటారు. అలా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల విధి వారికి ఉపయోగపడే చట్టాలను రూపొందించడం. కానీ, దేశ చరిత్రలోనే తొలిసారిగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ మధ్యయుగాల్లోని రాజరికపు ఆనవాళ్లను తీసుకొచ్చే చట్టానికి ఎన్డీఏ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందనే భయాందోళనలు మిన్నంటాయి. లోక్ సభ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన మూడు చట్టాలు అందుకు కారణమయ్యాయి. 130వ రాజ్యాంగ సవరణ (ముఖ్యంగా మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు సంబంధించిన ఆర్టికల్ 75, 164ల సవరణ), కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు, జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లులు.. వీటి అంతిమ సారాంశం తీవ్ర క్రిమినల్ నేరారోపణలతో ఐదు సంవత్సరాలు లేదా అంతకుమించి శిక్షపడే క్రిమినల్ కేసుల్లో 30 రోజులకు మించి కస్టడీలో ఉన్నట్టయితే వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది.
తప్పు చేసినవాడు పరిపాలించడానికి, పదవిలో ఉండడానికి అర్హుడు కానే కాదు. కానీ, నిర్దిష్టంగా సర్వజనామోదమైన ఈ వాదనను వాడుకొని తమకు జీ హుజూర్ అనని వ్యక్తుల్ని, తమ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాల్ని కూల్చడానికి వేస్తున్న ఎత్తుగడలా ఈ దేశ మేధావులు ఈ చట్టాల్ని అభివర్ణిస్తున్నారు. నిజానికి ఇందులో బీజేపీ వైఖరి ఖచ్చితంగా ద్వంద్వ ప్రమాణాలతో కూడుకున్నది అని చెప్పడానికి ప్రస్తుతం దేశంలో చర్చనీయాంశమైన ‘ఓట్ చోరీ’ ఉద్యమాన్ని చూస్తే అర్థమౌతుంది. మొన్నటివరకూ ఒక వాదనలా ఉన్న ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ సాక్ష్య, ఆధారాలతో సహా బయటపెట్టేసరికి. ప్రజల్లో ఈ అంశం పట్ల అవగాహన పెరిగి ఎక్కడికక్కడ నిలదీస్తుండడం బీజేపీని ఊపిరి తీసుకోనివ్వట్లేదు. అయితే, ఈ విషయానికి కొనసాగింపుగానే ప్రస్తుతం ఈ 30రోజుల జైలు నిబంధనతో ఏకంగా ప్రజల ఓట్లను చిల్లర మొత్తంలో కొట్టేసే ఓట్ చోరీకి 2.0 వెర్షన్ ఏకంగా ప్రజా ప్రభుత్వాలను కూల్చే ఆలోచనలు కేంద్ర పెద్దలకు ఉన్నాయనే వాదనలు బలంగా ఈ చట్టాలతో తెరపైకి వస్తున్నాయి.
ప్రభుత్వాలను అస్థిరపర్చడానికే!
ఎందుకంటే ప్రజాప్రతినిధులు అంటే కేవలం మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానే కాదు ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులను సైతం ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు, మరి ఇలాంటివారు నేరపూరితులైతే అది ఎలా సమ్మతమౌతుంది? వీరిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు. కేవలం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే మంత్రులు, ముఖ్యమంత్రులనే ఈ చట్టం పరిధిలోకి తేవడం ద్వారా వీరి ప్రభుత్వాలను అస్థిరపరచాలనే దురుద్దేశం స్పష్టంగా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేదే కదా! ఫెడరల్ వ్యవస్థకు వెన్నెముక అయిన రాష్ట్ర ప్రభుత్వాలను తమ గుప్పిట్లో పెట్టుకొనే పన్నాగంగా దీన్ని విజ్ణులు చూస్తున్నారు. ఎందుకంటే గతంలో గోవా మొదలు 8 రాష్ట్రాలలో వేరే పార్టీ ప్రభుత్వాలు పోయి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడానికి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన సత్యం మన కండ్లముందే ఉంది. అసలు ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలు కోర్టుల్లో నిలబడతాయా? ఎందుకంటే గతంలో వ్యవసాయ నల్లచట్టాల విషయంలో ఒకసారి భంగపడ్డ విషయాన్ని వారు మర్చిపోవద్దు.
బీజేపీ నేతలకూ అనుమానాలు లేకపోలేదు!
ఇది కేవలం విపక్ష పార్టీల నేతలను, ప్రభుత్వాలనే కాదు.. భారత ఉప రాష్ట్రపతిగా తాజాగా రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ వ్యవహారాన్ని పరిశీలించినవారికి సొంత పార్టీలో తమను ధిక్కరించేవారిపై సైతం ఒక అస్త్రంగా ఈ 30రోజుల జైలు చట్టాల్ని దుర్వినియోగం జరగదని ఖచ్చితంగా ఆ పార్టీ నేతలైనా చెప్పగలరా? నిజానికి ఈ చట్టాన్ని వ్యతిరేకించాలని బీజేపీలో ఆలోచనాపరులకు ఉండవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ వాయిస్ వినిపించలేకపోవచ్చు. కానీ, ప్రజాస్వామ్యానికి వారి మౌనం సైతం ముప్పు తెచ్చినట్లే అనేది మరవకూడదు. ఈ ధోరణి 2014లో మోదీ, షా ద్వయం గద్దెనెక్కినప్పటి నుంచి బీజేపీలో ఎక్కువగా కనిపిస్తుందనేది విశ్లేషకులు చెప్తున్న మాట. నాడు ఉద్ధండులైన అద్వానీ, జోషీలను పక్కనపెట్టే క్రమంలో 75ఏళ్ల వయసు నిబంధనను తెచ్చారు. ఇప్పుడు మోదీకి అదే నిబందన వర్తిస్తుందని ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటున్నారు. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో.. తమ అధికారానికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు నియంతృత్వ పోకడలను, తమలోని రాజరిక ఆనవాళ్లను బయటకుతెస్తూ తమకు వ్యతిరేకంగా ఉన్న సొంతపార్టీ నేతల్ని భయపెట్టేందుకే ఈ చట్టాలను అగమేఘాలపై తెస్తున్నారనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి.
30 రోజులకు మించి కస్టడీ..
చట్టప్రకారం చూస్తే 2023లో భారత నాగరిక్ సురక్షా సంహిత పేరుతో తెచ్చిన క్రిమినల్ చట్టాల్లోనే సెక్షన్ 167, ఉపా సెక్షన్ 43డి, నార్కోటిక్ సెక్షన్ 36ఏ, పీఎంఎల్ఏ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ తదితర ఎన్నో సెక్షన్లు 30 రోజులకు మించి కస్టడీలో నిందితున్ని ఉంచగలుగుతాయి. ఇవిగాక ఎన్నోరకాల క్రిమినల్ ఆరోపణలకు మన న్యాయస్థానాలు 30 రోజులకు మించి కస్టడీలో ఉంచుతున్నాయి. ఇక కేంద్ర జేబుసంస్థలు అనే అప్రతిష్టను మూటగట్టుకుంటూ ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నిష్పాక్షికత ఎంత అనే చర్చ నిత్యం సమాజంలో జరుగుతూనే ఉంది. అంతెందుకు మన జైలు గణాంకాల ప్రకారం లక్షలాది కేసుల్లో వేలాది మంది కేవలం విచారణ ఖైదీలుగానే ఏళ్లకేళ్లు జైళ్లలో మగ్గిపోతున్నారని నివేదికలు చెప్తున్నాయి. ఇలా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగానో, కుట్రపూరితంగానో జైల్లో ఉంచడమనేది అసాధ్యం అని చెప్పగలిగే పరిస్థితులు ఇప్పుడున్నాయా? ఇలా చూసినప్పుడు నేటి చట్టాల ఆంతర్యంపై విపక్షాలు చేస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగ్గవే!
ఆ చట్ట సవరణలను విరమించుకోవాలి
మనది తెల్లదొరల్ని తరిమేసి స్వాతంత్ర్యాన్ని సాధించుకున్న దేశం. అణచివేయాలని చూసిన ఎన్నో రాజ్యాలను కాలగర్బంలోకి తోసిన చైతన్యవంతమైన సమాజం. ఇలాంటి ప్రజలను నేరుగా అణచివేసి తమ తీర్పుకు ఎలాంటి విలువలేదని చాటే చట్టాలను చేస్తే దేశం మొత్తం తిరగబడుతుంది. ఇది బీజేపీకి, దాని నాయకత్వానికి మంచిది కాదు. ఈ నిజాన్ని ఒప్పుకోకుండా వారి అధినాయకత్వంలోని నియంతృత్వ పోకడలు అడ్డుపడుతున్నట్టున్నాయి. ప్రస్తుతానికి జేపీసీ పరిశీలనకు పంపినా... అక్కడ మెజార్టీ సభ్యులు వాళ్లే ఉంటారు. అందుకే ఈ చట్ట సవరణ ఆలోచన విరమించుకోవాలి.
కోర్టుల్లో లక్షల కేసులు పెండింగ్!
నిజానికి ఈ దేశంలో న్యాయ వ్యవస్థపై గౌరవాన్ని పెంచే చర్యల్ని చేపట్టాలి. ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు కానీ నిర్దోషికి శిక్ష పడకూడదన్న గొప్ప సహజ న్యాయ సిద్ధాంతం మన దగ్గర ఉంది. ఇందువల్లనో లేక పనిభారమో, సిబ్బంది కొరతనో, కానీ మనదేశంలోని అన్ని కోర్టుల్లో కలిపి లక్షలాది కేసులు ఇంకా విచారణ తొలి దశల్లోనే ఉన్నాయి.
కొన్ని సమాజంపై తీవ్ర ప్రభావం చూపిన కేసుల్లో పాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా న్యాయం జరగడానికే పదేళ్లకు పైగా పట్టిన సందర్భాలున్నాయి. నిజంగా కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కోర్టుల్లో సత్వర న్యాయం, తీర్పులు వచ్చేందుకు ఏం చేయాలనే దానిపై మేధోమథనం చేయాలి. అందుకోసం సంస్కరణలు తేవాలి. అంతేకానీ దోషిగా తేలకముందే కేవలం 30 రోజుల నిబంధన పేరుతో ఒక మంత్రినో, ముఖ్యమంత్రినో అధికారంలోంచి తీసేస్తే అంతిమతీర్పులో అతడు దోషి కాదని తేలితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ చిన్న న్యాయ సూత్రాన్ని మరిచి చట్టాలను తేవడంలోని ఆంతర్యం ప్రజలకు అర్థంకాని విషయం కాదు! ఇంతకీ 130వ రాజ్యాంగ సవరణ ఎవరికోసం అని ప్రతిపక్షాల వాదనకు ప్రభుత్వం నుంచి సరైన జవాబు రానంత కాలం.. ఆ సవరణ దేశ రాజకీయాలకు అనర్థమే కావచ్చు!
- బోదనపల్లి
వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో, టిసాట్ నెట్వర్క్