
ఏ విషయంలోనైనా తుదకు రాజకీయాల్లోనైనా కొన్ని పొరపాట్లు జరగడం సహజం. తెలియక చేసిన పొరపాట్లను పోనీలే అని క్షమించవచ్చు. తెలియక చేసిన తప్పులనూ దాసుని తప్పులు దండంతో సరి అన్నట్టు క్షమాపణలు కోరితే వదిలిపెట్టవచ్చు. కానీ, తెలిసి తెలిసి చేసిన చిన్న తప్పునయినా, పెద్ద తప్పునయినా వదిలిపెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? తప్పులు మాత్రమే కాదు.
అంతకంటే పెద్దవైన ఆర్థిక నేరాలను ఉద్దేశపూర్వకంగా చేస్తే ఎంత గొప్పవాడినయినా సరే ఎందుకు వదిలిపెట్టాలి? పోనీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయని వాటికి హృదయపూర్వక పశ్చాత్తాపమైనా ప్రకటించి విచారం ప్రకటించారా అంటే అదీలేదు. పైగా ఎదురుదాడి. తానేం తప్పులు చేయనట్టు, శుద్ధపూసలమైనట్టు తెలంగాణను విధ్వంసం చేయడమే కాకుండా తామే ఉద్ధరించినట్టు మాట్లాడటం గర్హనీయం.
ఇంకా అధికారంలో ఉంటే మరింత ఉద్ధరించేవాళ్ళమని ప్రగల్భాలు పలికేవారినేమనాలి? ఎవరైనాసరే ఆర్థిక నేరాలకు, సామాజిక నేరాలకు, స్కాంలకు తగిన మూల్యం చెల్లించకుంటే రాజకీయాలు మరింత భ్రష్టుపడతాయి. ఏ ప్రభుత్వమైనా ఎన్నుకునేది ఐదు సంవత్సరాల వరకు మాత్రమే. ఆ ఐదు సంవత్సరాల్లో అప్పులంటూ చేస్తే తన పాలనాకాలంలో తీరేట్టుగా మాత్రమే చేయాలి. కానీ, వచ్చే ప్రభుత్వాలు దశాబ్దాల కాలం తీర్చినా తీరనంత భారం మోపితే అది బాధ్యతారాహిత్యం కాదా?
లక్షల కోట్ల అప్పులు
లక్షలకోట్ల అప్పును ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఉపయోగించారా అంటే అదీలేదు. తమ సంపద
పెరగడానికి మాత్రమే ఉపయోగించారు. ఓ దిక్కు లక్షలకోట్లు పెట్టి కట్టినామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ప్రధాన స్థలాల్లో కూల్చివేతకు గురవుతూ రిపేరు కూడా చేయలేని స్థితిలోకి నెట్టబడింది. మరోదిక్కు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుమీద నాటి ప్రతిపక్షాలను అంతులేని వేదనకు గురిచేసి ప్రధాన నిందితులు విదేశాలకెళ్ళడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారతదేశ చరిత్రలోనే లేనివిధంగా ఓ మహిళ పాల్గొని వందలాది కోట్లు దండుకోవడం, ధరణి పేరుమీద లక్షలాది ఎకరాల భూఆక్రమణలు వేలకోట్ల ఆస్తుల అక్రమ సంపాదన. మరోదిక్కు వ్యవసాయ రంగంలో అప్పులు, విద్యుత్ రంగంలో వేలకోట్ల బకాయిలు, వివిధ రంగాల్లో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన వేలకోట్ల బాకీలు. మొత్తం పాలనా వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేసి కుటుంబ పాలనను తెరకెక్కించిన ఘనత మన మాజీ పాలక కుటుంబం వారిదే.
నిందితులను కఠినంగా శిక్షించాలి
కాళేశ్వరం మెగాస్కాం కేసులో అంతులేని అవినీతి జరిగిందని లక్ష కోట్లతో పేకమేడలా కూలిపోయే ప్రాజెక్టు కట్టారని తేలిపోయింది.. ధరణి అవకతవకల్లో చిన్నరైతులు తమ భూములను కోల్పోయి అంగలారుస్తున్నారు. వేల, లక్షలకోట్ల భూములు రాజకీయుల, అధికారుల ఆక్రమణలకు గురయ్యాయి. అయితే, ఈ అన్ని నేరాలను అధికార్లపై, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఇతరులపై తోసి తాము తప్పించుకోవాలని రాజకీయులు పన్నాగాలు పన్నుతున్నారు.
అన్నివైపుల నుంచి తప్పించుకోలేని సాక్ష్యాలతో ఉచ్చు బిగిస్తున్నా నాయకుల్లో నేరం చేశామన్న భావం కొంచెం కూడా కనబడటం లేదు. పైగా కక్షసాధింపు చర్యలని, మరేదో అని ప్రచారాలు. అన్ని స్కాముల్లో ఉద్యోగులను బలిపశువులను చేసి, నాయకులు తప్పించుకుంటే మాత్రం అంతకంటే అన్యాయం మరొకటి లేదు. నాయకులు చెప్పిందే ఉద్యోగులు చేశారు తప్ప, వాళ్ళు స్వయంగా ఏం చేయలేదు. కొందరు ప్రతిఘటించినా బలవంతంగానైనా చేయక తప్పలేదు. ఎలా చేసినా తప్పు తప్పే కాబట్టి. ప్రథమ నిందితులుగా ఆ కేసులను రాజకీయులను, ఆ తర్వాత అధికార్లను నిర్ణయించి కఠినంగా శిక్షిస్తే తప్ప కోర్టులపై ప్రగాఢ విశ్వాసం కలుగదు. కేవలం జైలుశిక్షతో సమస్య పరిష్కారం కాదు. అవినీతి సొమ్ము రికవరీ జరగాలి.
ప్రగతిపథంలో కాంగ్రెస్ పాలన
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ పదహారు నెలల కాలంలోనూ, అసెంబ్లీ సమావేశాల్లోనూ, అసెంబ్లీ బయటనూ, ఇటీవల జరిగిన బీఆర్ఎస్. రజతోత్సవ సభల్లోనూ కేసీఆర్, పార్టీ ప్రముఖులు మాట్లాడిన మాటల్లో, చేస్తున్న ప్రసంగాల్లో కించిత్ కూడా మార్పు వచ్చినట్టు కనబడలేదు. పశ్చాత్తాపం ప్రకటిస్తున్నట్టూ కనబడలేదు. అదే ధోరణి. అదే పద్ధతి. తాము అధికారం కోల్పోయింది తాము చేసిన అసంఖ్యాక తప్పిదాలవల్ల కాదని వారి ప్రగాఢ విశ్వాసం. కాంగ్రెస్ చేసిన అసత్యప్రచారాన్ని నమ్మి ఓటేసి మోసపోయారని ప్రవచనాలిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా..
కాంగ్రెస్ ఎన్నికల హామీలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అద్భుతంగా స్వల్పకాలంలోనే అమలు చేస్తున్నారు. తాము చేసిన స్కాంల నుంచి ఎలా బయటపడాలో అర్థంకాక ప్రజలను తప్పుదారి పట్టించడానికి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు. తెలంగాణకు మొదటి శత్రువు తానే అయి తెలంగాణను ఇచ్చిన, తెచ్చిన కాంగ్రెస్‌ను తెలంగాణ శత్రువుగా చిత్రిస్తున్నారు. అప్పుడు సోనియాగాంధీ కాళ్ళమీద పడి, మీరులేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్న కేసీఆర్ ఈరోజు తెలంగాణ శత్రువు కాంగ్రెస్ అనడం హాస్యాస్పదం.
పదేళ్ళలో కేసీఆర్ చేసిన ఆర్థిక విధ్వంసమే తెలంగాణకు శత్రువు కాదా? అలాగే, బీఆర్ఎస్ పాలనలో జరిగిన సామాజిక విధ్వంసం తెలంగాణ ఆత్మగౌరవ విధ్వంసాన్ని ఇపుడు సరిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే సామర్థ్యం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్‌కు ఉందని వస్తున్న పెట్టుబడులు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలే చెబుతున్నాయి. తక్కువ ఆదాయంతో ఎక్కువ పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదనే చెప్పాలి.
ఓడినా మార్పు రాలె..
రాజకీయాలను భ్రష్టుపట్టించి సమీప భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రాలేని దుస్థితిని బీఆర్ఎస్ కొనితెచ్చుకున్నది. ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా కోల్పోయారు. ఇన్ని చేసిన బీఆర్ఎస్ నేతలు, పార్టీ అధ్యక్షుడు తమ చేష్టలకు ఏమైనా పశ్చాత్తాపం చెందారా అంటే అదీ లేదు. పైగా తమ పాలనాకాలంలో తామేదో ఉద్ధరించినట్టు దేశాన్ని కూడా ఉద్ధరించడానికి సిద్ధమైతే సాగనివ్వక ప్రజలు ఓడించి తప్పు చేశారని చిలుక పలుకులు చెబుతున్నారు. అధికారం పోయినా పశ్చాత్తాపంతో తమను తాము పునీతం చేసుకొని తాము మారిపోయామన్న నమ్మకాన్ని అయినా ప్రజలకు కలిగించలేకపోతున్నారు.
- డా. కాలువ మల్లయ్య–