గుజరాత్ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్

గుజరాత్ ఎన్నికలపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్

ఇతర రాష్ట్రాలకన్నా గుజరాత్ శాసన సభ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు గుజరాత్ రాష్ట్రం పేరు చెబితే మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ల పేర్లు గుర్తుకొచ్చేవి. ఇప్పుడది ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాల ఇలాకా. మొత్తం182 స్థానాలున్న గుజరాత్ శాసన సభకు డిసెంబర్​లో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్​లో పోటీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) -కాంగ్రెస్​ల మధ్యనే ఉండనుంది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ, ఎలాగైనా తిరిగి అధికారానికి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి. మధ్యలో నేనూ ఉన్నానంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా రంగ ప్రవేశం చేసింది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు  పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే గుజరాత్ లో చాలా ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ ఏర్పడే అవకాశం ఉండి ఉండేది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం వల్ల ఇప్పుడు బీజేపీకి విజయం సునాయాసమవుతుంది. గతం వర్తమానానికి పునాది అంటారు. కనుక, మునుపటి ఎన్నికల ఫలితాలను ఒకసారి సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

కాంగ్రెస్​-ఆప్​ పొత్తు ఉంటదా?
బొంబాయి రాష్ట్రం నుంచి విడివడి1960 మే1న గుజరాత్ ఏర్పడినపుడు కాంగ్రెస్ కు చెందిన జీవరాజ్ నారాయణ్ మెహతా తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వారిలో బల్వంత్ రాయ్ మెహతా, హితేంద్ర కన్నయ్యాలాల్ దేశాయ్, ఘనశ్యామ్ ఓజా, చిమన్ భాయ్ పటేల్, బాబుభాయ్ పటేల్, మాధవ్ సింగ్ సోలంకీ, అమర్ సింగ్ చౌదరి, చబ్భిల్ దాస్ మెహతాలు కాంగ్రెస్ కు చెందినవారే. రాష్ట్రీయ జనతా పార్టీకి చెదిన శంకర్ సింహ్ వాఘేలా, దిలీప్ పారిఖ్ లు కూడా కొద్ది కాలం ముఖ్యమంత్రులుగా వ్యవహరించినప్పటికీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలే గుజరాత్ ను పాలిస్తూ వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ కు ఇప్పటికీ కొద్దో గొప్పో పట్టు ఉంది. అది 2017 ఎన్నికల్లో తన బలాన్ని 57 నుంచి 71కి పెంచగలిగింది. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో తిరుగులేని పట్టు ఉంది.  అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ఆప్’కు కూడా పట్టణ ప్రాంత పార్టీగా ముద్ర ఉంది. అది ఎవరి ఓట్లను చీలుస్తుందో చూడాలి. ‘ఆప్’  గత ఏడాది జరిగిన సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో  కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది. అయితే, కాంగ్రెస్-, ఆమ్ ఆద్మీ పార్టీలు 2014లో ఢిల్లీలో 49 రోజుల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోతే ఆ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. దివంగత అహ్మద్ పటేల్ చక్రం తిప్పబట్టి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గౌరవ ప్రదమైన రీతిలో స్థానాలు గడించుకోగలిగిందనడం వాస్తవ దూరం కాదు.  గాంధీ కుటుంబేతరుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నది. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి, ‘ఆప్’ విస్తరణకు ఈ ఎన్నికలు ఒక అవకాశం కల్పిస్తున్నాయి.  కానీ, ప్రస్తుత భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ మేరునగ ధీరుడు. బీజేపీ ప్రతిష్ట గుజరాత్ లో ఏమీ మసకబారలేదు. కాకపోతే దాదాపు మూడు దశాబ్దాలుగా  అధికారంలో ఉండటం వల్ల బీజేపీ పట్ల ఓటర్లలో కొంత ఉదాసీనత ఏర్పడి ఉండవచ్చు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఇవి మోడీ, అమిత్ షాల ద్వయానికి కూడా 
ప్రతిష్ఠాత్మకమైనవి.

శక్తిగా అవతరించిన జనతా దళ్​
కాంగ్రెస్ 1985 ఎన్నికల్లో ఏకంగా149 స్థానాలు గెలుచుకుని గుజరాత్​లో తిరిగి అధికారానికి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా 55 శాతం ఓట్లను తెచ్చుకుంది. అయితే, వెనుకబడిన తరగతులకు ప్రయోజనం చేకూరుస్తూ కాంగ్రెస్ చేపట్టిన రిజర్వేషన్ల విధానం ప్రధానంగా అహ్మదాబాద్, గాంధీనగర్ లలోను, మరికొన్ని ఇతర చోట్ల ఆందోళనలకు దారితీసింది. అది మతపరమైన హింసాకాండగా కూడా పరిణమించింది. ఆ సందర్భంగా చోటుచేసుకున్న అల్లర్లలో 200 మందికి పైగా చనిపోయారు. వేలాది మంది గాయపడ్డారు. వేల మంది నిర్వాసితులయ్యారు. ఇది1990 ఎన్నికల్లో ప్రభావం చూపింది. కాంగ్రెస్ ఓట్లు 33 శాతానికి పరిమితమయ్యాయి. అయితే, ఉత్తర ప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో మాదిరిగానే గుజరాత్ లో కూడా జనతా దళ్ ఒక శక్తిగా అవతరించింది. అది70 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 67 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. చిమన్ భాయ్ పటేల్(జనతా దళ్) ముఖ్యమంత్రిగా, కేశూభాయ్ పటేల్ (బీజేపీ) ఉప ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పటైంది. అదే ఏడాది చిమన్ భాయ్ పటేల్ బీజేపీతో తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ మద్దతుతో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. చిమన్ భాయ్ పటేల్1994లో మరణించడంతో కాంగ్రెస్ కు చెందిన చబ్భిల్ దాస్ మెహతా ముఖ్యమంత్రి అయ్యారు. జనతా దళ్ తనతో పొత్తును విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్ తో చేతులు కలపడం తదుపరి(1995) ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. బీజేపీ121 సీట్లను సాధించడంతో కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. అలా కాంగ్రెస్ ప్రాభవం క్షీణించడం మొదలైంది. 

27 ఏండ్లుగా బీజేపీదే హవా..
1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి స్వల్ప మెజారిటీ మాత్రమే లభించినప్పటికీ కేశూభాయ్ తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు. వయసు ఉడిగి, అస్వస్థతకు లోనైన కేశూభాయ్ ప్రజాదరణను కోల్పోవడం మొదలైంది. భుజ్ లో పెను భూకంపం సంభవించిన తర్వాత సహాయ, పునరావాస కార్యక్రమాల విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగెత్తించడంలో ఆయన విఫలమయ్యారు. గుజరాత్ లో కొన్ని ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. కేశూభాయ్ తర్వాత బీజేపీ సురేశ్ మెహతాను ముఖ్యమంత్రిని చేసింది. ఆయన ఆ పదవిలో కొద్ది కాలమే కొనసాగారు.  తర్వాత, గుజరాత్ పాలనా పగ్గాలను బీజేపీ నరేంద్ర మోడీకి అప్పగించింది. అయోధ్య నుంచి తిరిగి వస్తున్న యాత్రికులున్న రైలు బోగీకి గోద్రా వద్ద కొందరు దుండగులు నిప్పు పెట్టడంతో గుజరాత్ లో మతపరమైన హింసాకాండ ఒక్కసారిగా భగ్గుమంది. ఆ అల్లర్లలో ముస్లింలు, హిందువులతో సహా అధికారిక అంచనాల ప్రకారమే1044 మంది చనిపోయారు. విమర్శలు వెల్లువెత్తడంతో పదవీ కాలం ముగియడానికి ఇంకా ఎనిమిది నెలల గడువు ఉండగా కూడా నరేంద్ర మోడీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్ బలం 51 సీట్లకు పరిమితం కాగా బీజేపీ అఖండ మెజారిటీ సాధించింది. మోడీ నేతృత్వంలో గుజరాత్ సాధించిన ప్రగతి దేశవ్యాప్తంగా ప్రచారం పొందడమే కాకుండా, ప్రజాబాహుళ్యం మన్ననలను అందుకుని, ఆయనను 2014లో ప్రధాని పదవిలో కూర్చోబెట్టింది. అప్పటి నుంచి గుజరాత్ కాషాయపార్టీకే పట్టం కట్టడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. గుజరాత్ లో1995 నుంచి 27 ఏండ్లుగా బీజేపీయే అధికారంలో కొనసాగుతున్నది.  నరేంద్ర మోడీ స్థానంలో ఆనందిబెన్ పటేల్ గుజరాత్ కు తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు. విజయ్ రూపాని 2016లో ముఖ్యమంత్రి కాగా, భూపేంద్రభాయ్ పటేల్ 2021 సెప్టెంబర్ నుంచి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్