hyderabad:కోహెడలో హోల్‌సేల్ చేపల మార్కెట్‌: మంత్రి తలసాని

hyderabad:కోహెడలో హోల్‌సేల్ చేపల మార్కెట్‌: మంత్రి తలసాని

హైదరాబాద్ నగర శివార్లలోని కోహెడలో రూ.50 కోట్లతో 10 ఎకరాల్లో ఆధునిక సౌకర్యాలతో హోల్‌సేల్ చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ విషయంపై సమీక్షా సమావేశం నిర్వహించిన శ్రీనివాస్ యాదవ్.. ప్రతిపాదిత చేపల మార్కెట్‌తో పాటు హోల్‌సేల్ మార్కెట్‌, రిటైల్ మార్కెట్, కోల్డ్ స్టోరేజీ, క్యాంటీన్ సౌకర్యాలు కూడా కల్పించనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మత్స్య రంగం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రంగానికి తగిన నిధులు కేటాయిస్తూ పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారని చెప్పారు.

చేపల పెంపకంలో తెలంగాణ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉందని మంత్రి తలసాని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపల ఉత్పత్తి 1.9 లక్షల టన్నుల నుంచి 4 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. మత్స్యకారులకు మంచి ధర లభించేలా రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక చేపల మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల్లో గొర్రెలు, మేకల మాంసం మార్కెట్‌ను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో మాంసం మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని కోరారు.