ఆగస్టులో తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం

ఆగస్టులో తగ్గిన టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం

హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్భణం ఆగస్టు నెలలో తగ్గింది. జూలైలో 13.93%తో పోలిస్తే..ఆగస్టులో 12.41 శాతానికి క్షీణించింది. అయితే  రెండంకెల టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) 17 నెలలుగా కొనసాగుతోంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2021 ఆగస్టులో 11.64 శాతంగా నమోదైంది. అయితే ఏడాది మే నెలలో హోల్ సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 15.88 శాతానికి చేరుకుని..ఆ తర్వాత తగ్గుముఖం పడుతోంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

విద్యుత్ ధరలు పెరిగాయి..
ప్రాథమిక వస్తువుల సూచిక జులై 2022తో పోల్చుకుంటే..ఆగస్టు నెలలో 0.62 శాతం పెరిగింది. జూలై 2022 నెలలో ప్రాథమిక వస్తువుల సూచిక 177.5 శాతం ఉండగా... ఆగస్టు 2022లో 178.6 శాతానికి పెరిగింది. జులైతో పోల్చుకుంటే  ఇంధనం , పవర్ గ్రూప్ యొక్క ఇండెక్స్  ఆగస్టులో క్షీణించింది. జూలై 2022 నెలలో165.6 శాతం ఉండగా.. 4.83 శాతం క్షీణించి ఆగస్టులో 157.6  శాతానికి పడిపోయింది. అటు జూలై 2022తో పోల్చితే  విద్యుత్ ధరలు ఆగస్టు 2022లో 2.85 శాతం పెరిగాయి. అలాగే మినరల్ ఆయిల్స్ ధరలు  జూలై 2022తో పోలిస్తే 2022 ఆగస్టులో  7.79 శాతం తగ్గాయి. జూలై 2022తో పోల్చితే  ఆగస్టు 2022లో నాన్-ఫుడ్ ఆర్టికల్స్ (1.98 శాతం) ఫుడ్ ఆర్టికల్స్ (1.57 శాతం) ధరలు పెరిగాయి. ఖనిజాలు (-1.90 శాతం) ముడి పెట్రోలియం,సహజ వాయువు (-7.34 శాతం) ధరలు తగ్గాయి. 

రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది... 
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టులో  మినరల్ ఆయిల్స్, ఫుడ్ ఆర్టికల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, బేసిక్ మెటల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, ఫుడ్ ప్రొడక్ట్స్ మొదలైన వాటి ధరలు పెరిగాయి. ఆహార వస్తువుల WPI ద్రవ్యోల్బణం  జూలైలో 10.77%తో పోలిస్తే ఆగస్టులో 12.37%కి పెరిగింది. జూలైలో 18.25% ఉన్న కూరగాయల ధరలు ఆగస్టులో 22.29% పెరిగాయి. గోధుమల ధర 17.35%, పాల ధర 4.78% పెరిగింది. ఇంధనం, పవర్ బాస్కెట్‌లో ద్రవ్యోల్బణం  జూలైలో 43.75%తో ఆగస్టు 33.67%తో తగ్గాయి. జూలై 2022తో పోలిస్తే ఆగస్టులో విద్యుత్ ధరలు పెరిగాయి. తయారీ ఉత్పత్తులలో WPI ద్రవ్యోల్బణం 7.51%గా ఉంది. ఆహార ధరల పెరుగుదల కారణంగా భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.71 శాతం నుండి 7 శాతానికి పెరిగింది. 

రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా ఎనిమిదో నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యాన్ని  మించిపోయింది. వరుసగా ఎనిమిదో నెలలో ప్రధాన ద్రవ్యోల్బణం 6 శాతానికి పైగా రావడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 6.71 శాతం నుండి 7 శాతానికి పెరిగింది.