అమెరికాలో ముందస్తు ఓటింగ్ ఎవరి వైపు?

అమెరికాలో ముందస్తు ఓటింగ్ ఎవరి వైపు?

ముందస్తు ఓటింగ్‌‌ మేలా? కీడా?

వాషింగ్టన్‌‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ఓటింగ్‌‌ శాతం భారీగా పెరిగింది. ముందస్తు ఓటింగ్‌‌కు జనం బాగానే మొగ్గు చూపారు. కరోనా భయంతో చాలామంది ముందస్తు ఓటింగ్‌‌లో పాల్గొన్నారని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. ముందస్తు ఓటింగ్‌‌లో భాగంగా కొంతమంది పోస్టల్‌‌ బ్యాలెట్‌‌ను ఉపయోగించగా మరికొంతమంది మెయిలింగ్‌‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఈ పద్ధతి వల్ల ఎంత లాభం ఉందో.. అంతే నష్టం కూడా ఉందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు.  ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు ఓటింగ్‌‌ చాలామేలు చేసిందని అభిప్రాయపడ్డారు.

ఓటింగ్‌‌ రోజే ప్రజలంతా పోలింగ్‌‌ బూత్‌‌లకు వస్తే గుంపులు గుంపులు అయ్యి వ్యాధి ప్రబలే ప్రమాదం ఉండేదని చెప్తున్నారు. ముందస్తు ఓటింగ్‌‌ వల్ల అత్యవసర పనులు మానుకోవాల్సి రావడం, పోలింగ్‌‌ కేంద్రాల దగ్గర గంటల కొద్దీ వేచి ఉండటం లాంటి సమస్యలు ఉండవు. అయితే ఈ ముందస్తు పోలింగ్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అభ్యర్థులు చివరి క్షణంలో ఇచ్చే ప్రకటనల ఆధారంగా ఓటరు నిర్ణయం తీసుకోలేడు.

ముందస్తు ఓటింగ్‌‌ వల్ల ఖర్చు కూడా పెరుగుతుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెప్తున్నారు. ప్రీ ఓటింగ్‌‌ వల్ల పోలింగ్‌‌ శాతం పెరుగుతుందనే  అంచనాలు నిజంకాదని 2013లో ‘విస్కాన్సిన్‌‌ వర్సిటీ’ చేసిన ఓ సర్వేలో తేలింది. ఓటేసేందుకు చాలా టైముందనే ఫీలింగ్​తో చాలామంది ఓటు హక్కును వినియోగించుకోకుండా పోస్ట్‌‌పోన్‌‌ చేసే అవకాశం ఉంది. అందరూ వేశారు కదా.. మనం వేయకపోతే ఏంకాదులే అనే భావన కొంతమంది ఓటర్లలో కలిగే అవకాశం ఉందని చెప్తున్నారు.

‘ఎలక్షన్‌‌ లా జనరల్‌‌: రూల్స్‌‌, పాలిటిక్స్‌‌ అండ్‌‌ పాలసీ’ ప్రకారం వివిధ దేశాల్లో పలురకాల పద్ధతుల్లో ఈ ముందస్తు ఓటింగ్‌‌ ఉంటుంది. కెనడాలో కొన్నిరోజుల ముందు నుంచి, ఫిన్‌‌లాండ్‌‌లో వారం ముందు, జర్మనీలో ఆన్‌‌డిమాండ్‌‌ పోస్టల్‌‌ ఓటింగ్‌‌, స్విట్జర్లాండ్‌‌లో ఆటోమేటిక్‌‌ పోస్టల్‌‌ విధానంలో ఓటింగ్‌‌ను అమలుచేస్తున్నారు. మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా ముందస్తు ఓటింగ్‌‌ నిర్వహించే చాన్స్‌‌ లేదు.