కరోనా మళ్లీ విజృంభిస్తుందా?.. భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుందా?

కరోనా మళ్లీ విజృంభిస్తుందా?.. భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుందా?

డిసెంబర్‌ 2019లో  మొదటిసారి  చైనాలోని వూహాన్‌ నగరంలో  కరోనా వైరస్‌ను  గుర్తించారు. అది వేగంగా వివిధ ప్రపంచ దేశాలకు విస్తరించడం, భారత్‌లో కూడా కొవిడ్​ వ్యాపించడం చూశాం.  భారత్‌లో జనవరి 2020 మాసంలో తొలిసారి  ప్రారంభమైన కరోనా వ్యాప్తి కారణంగా మార్చి 2020లో లాక్‌డౌన్‌  ప్రకటించడం జరిగింది.  భారత పౌర సమాజంతోపాటు ప్రపంచ దేశాలు కూడా కరోనా వైరస్​ ధాటికి తల్లడిల్లిపోయాయి. అన్ని దేశాలు కొవిడ్​ కట్టడికి తగు పటిష్ట చర్యలు తీసుకోవడం చూశాం.  

భారత్‌లో తొలి కరోనా వేవ్ మార్చి 2020 నుంచి జనవరి 2021 వరకు కొనసాగింది. రెండవ వేవ్ మార్చి–ఏప్రిల్‌ 2021లో ప్రారంభమై నాలుగు మాసాలు తీవ్ర ప్రభావాన్ని చూపింది.  మిలియన్ల కేసులు నమోదు కావడం, భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం ఓ మరిచిపోలేని విషాద అనుభవం. 

హాంకాంగ్‌, సింగపూర్‌లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

తొలిసారి  ప్రపంచం చూసిన కరోనా విపత్తు తర్వాత దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రస్తుతం కొన్ని ఆసియా దేశాల్లో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.  కొవిడ్‌-19 కేసులు పెరగడం ప్రపంచ మానవాళిని, ముఖ్యంగా వయో వృద్ధులను మళ్లీ భయం గుప్పిట్లోకి నెట్టుతున్నది.  గత  కొన్ని వారాలుగా హాంకాంగ్‌, సింగపూర్​లో  కొవిడ్‌-19  కేసులు పెరగడం గమనించారు.  రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న ప్రజలు, వయోవృద్ధులు, కరోనా టీకా తీసుకోని వారు నేటి వైరస్‌ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది.  

అయితే, గతంలో చూసిన వేరియంట్లతో పోల్చితే నేడు వ్యాపిస్తున్న వైరస్‌ వేరియంట్లు ఎంత తీవ్రంగా వ్యాపిస్తాయి,  ఎంత తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.  గత వారం  సింగపూర్‌లో 14,200 కరోనా కేసులు నమోదు అయ్యాయని,  వీటి సంఖ్య పెరుగుతోందని  వెల్లడైంది.  రోజుకు సగటున 133 కేసులు నమోదు కావడం, గత  ఏడాదితో పోల్చితే 28 శాతం అధికంగా 
కేసులు నమోదు అయ్యాయని అధికారవర్గాలు తెలిపాయి. 

హాంకాంగ్‌లోని మురికి నీటిలో కూడా  సార్స్‌-కోవ్-2 వైరస్‌  లేదా కరోనా వైరస్‌ మనుగడను గమనించారు. గత వారంలో కరోనా కేసులు 13.66 శాతం పెరిగినట్లు తేల్చారు. వీటిలో 81 తీవ్రమైన కేసులు, 30 వరకు మరణాలు నమోదు అయ్యాయి.  సింగపూర్‌, హాంకాంగ్‌లతో  చైనా, థాయిలాండ్  దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నట్లు వైద్యవర్గాలు గమనించారు. 

భారత్‌లో కరోనా వ్యాప్తి పెరుగుతుందా?

మే 2025 మొదటి వారంలో ఇండియాలో 28 కరోనా కేసులు నమోదు కాగా, ఆ తరువాత వారంలో కరోనా కేసుల సంఖ్య 41కి పెరిగాయి.  మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా ఏపీలోని విశాఖ జిల్లాలో కొవిడ్​ –19 కేసు నమోదైంది. కాగా, గత సెప్టెంబర్‌ నుంచి శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు క్రమంగా తగ్గాయని, ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లో తక్కువగానే ఉందని, భయపడాల్సిన పని లేదని వైద్యశాఖ అధికారులు తెలిపారు. 

కానీ, శ్వాసకోశ సంబంధ వ్యాధిగ్రస్తులతో పాటు వయోవృద్ధులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్లినపుడు మాస్కులు ధరించడం ఉత్తమమని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలతో  కరోనాతో  వ్యాప్తి తగ్గుతుందని సలహా ఇస్తున్నారు.  రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారితో పాటు వృద్ధులు, శ్వాస సంబంధ సమస్యలు, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు తమ పరిధుల్లో జాగ్రత్తగా ఉండటం శ్రేయస్కరం, బూస్టర్‌ డోస్‌ తీసుకోనివారు ఇప్పుడన్నా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  నేటి కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందడం లేదని, తీవ్ర అనారోగ్యాలకు కారణం కావడం లేదని, అతిగా భయపడవలసిన పని లేదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది.  మనం తీసుకునే జాగ్రత్తలు మనకు శ్రీరామ రక్ష అని తెలుసుకుని మసలుకోవాలి.

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి