
సూర్యాపేట వెలుగు : తెలంగాణలో బీఆర్ఎస్ కి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు.. ముఖ్యంగా మైనార్టీలు గుర్తు పెట్టుకుని కాంగ్రెస్ ను గెలిపించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా 104వ రోజు చివ్వెంల మండలం చందుపట్ల, మోతె మండల కేంద్రంలో పర్యటించారు. మోతె కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు..కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రహస్య ఒప్పందం ప్రకారం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామన్నారు. మాజీమంత్రి ఆర్. దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న పాల్గొన్నారు.
పాదయాత్రకు గద్దర్ మద్దతు
పీపుల్స్‌మార్చ్ పాదయాత్రకు ప్రజా గాయకుడు గద్దర్ మరోసారి మద్దతు ప్రకటించారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మం డలం తిమ్మాపురంలో పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్కతో కలిసి నడిచారు. తిమ్మాపురంలో గద్దర్ మాట్లాడుతూ భట్టి పాదయాత్ర చారిత్రాత్మకమైందని, ప్రజాపార్టీని రిజిస్టర్ చేసిన తరువాత ఒక పార్టీగా మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్కలా పల్లెల్లోకి వెళ్లాలన్నారు. పదేండ్లుగా సాగుతున్న నియంత పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు.