ఈటలను ఎందుకిలా... వెంటాడుతున్నరు?

V6 Velugu Posted on Oct 26, 2021

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న జరుగుతున్న ఉపఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయ బలాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేదు. ఇది చాలా చిన్న ఎన్నిక అని స్వయంగా మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఈ ఆట చెబుతూనే ఎట్టి పరిస్థితుల్లోనూ హుజూరాబాద్​లో బీజేపీ క్యాండిడేట్​ ఈటల రాజేందర్ గెలవడానికి వీల్లేదని మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడ మోహరించారు. ఆయనను ఓడించడానికి ఎందుకిలా వెంటాడుతున్నారు?

టీఆర్ఎస్ ఆవిర్భావం, మలివిడత ఉద్యమం నుంచి కేసీఆర్ కు బాసటగా నిలిచి, తెలంగాణలో ప్రజల గొంతు వినిపించడంలో ఈటల రాజేందర్ ముందున్నారు. ఆయనపై ఎటువంటి అవినీతి ఆరోపణలను రాజకీయ ప్రత్యర్థులు కూడా ఇప్పటివరకు చేయలేదు. పార్టీ కార్యకర్తలకే కాకుండా, సాధారణ ప్రజలకు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వామి అవుతున్నారు. అయితే ఉద్యమ పార్టీగా ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ను ఎప్పటికప్పుడు ఉద్యమ లక్ష్యాలను నెరవేర్చాల్సిన బాధ్యతను గుర్తుచేయడమే ఈటల చేసిన నేరమా? తెలంగాణ ఉద్యమంపై ఎన్నడూ సానుభూతి కూడా చూపని వారిని దగ్గరకు చేర్చుకొని, వారిని అందలం ఎక్కించి మంత్రి పదవులు ఇస్తున్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో వెన్నెముకగా నిలిచి పోరాట పటిమ ప్రదర్శించిన ఈటల అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ఈటల ముఖం అసెంబ్లీలో చూడగూడదని కేసీఆర్​ అనుకుంటున్నారట. ఈటల ఏ పాపం చేశారని ఆయనను కేసీఆర్​ వెంటాడుతున్నారు. మొన్నటి వరకు ఉద్యమంలో, ప్రభుత్వంలో చురుకుగా ఉంటూ క్లిష్ట సమయాల్లో అండగా ఉంటూ వస్తున్నారు గదా? 

నోటిఫికేషన్​ రాకముందు నుంచే..
ఈటలను కేబినెట్​ నుంచి తొలగించినప్పటి నుంచి ఉపఎన్నిక ఎప్పుడైనా వస్తుందనే అంచనాతో హుజూరాబాద్ పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడే మకాం వేసి నాలుగైదు నెలలుగా ఆరుసార్లు ఈటలకు ఓటు వేసి గెలిపించిన జనాన్ని యెట్లా తమవైపు తిప్పుకోవాలో అంటూ కిందామీదా పడుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కూడా అక్కడే మకాం వేసి ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లను తమవైపు తిప్పుకోవడానికి నిజాయితీతో ప్రయత్నాలు చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో కూడా కేసీఆర్ ఆరితేరారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మండల్ పరిషత్ అధ్యక్షులను, జెడ్పీటీసీలను, సర్పంచ్ లను డబ్బు ధారపోసి కొనుగోలు చేసే దుస్థితికి దిగారు. ఈటల సభలకు ఎవరెవరు హాజరవుతున్నారో, ఆయన వెంట ఎవరెవరు తిరుగుతున్నారో పోలీస్ నిఘాతో గమనించి, వారింటికి వెళ్లి ప్రలోభ పరచొ, భయపెట్టో తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. లొంగకపోతే దొంగ కేసులు పెడుతున్నారు. వారి ఫించన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని బెదిరిస్తున్నారు. ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు?

దళిత బంధుపై అబద్ధపు ప్రచారాలు
ఈ ఉప ఎన్నికలో గెలవడానికి దళితబంధు పథకం తీసుకొచ్చి, దానిని కూడా సరిగ్గా అమలు పరచలేక బీజేపీ ఆపేయించిందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని పార్టీ టీకెట్​ ఇస్తామని చేర్చుకొని, ఇవ్వకుండా ఎమ్మెల్సీ పదవి ఆశపెట్టి ఇప్పుడు అది కూడా అందకుండా చేశారు. బహుశా దేశంలో మరే ఉప ఎన్నికలో ఎరుగని రీతిలో వందల కోట్లు కాదు, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పథకాల రూపంలో, సొంత పార్టీ వారిని, ఇతరులను కొనుగోలు చేయడానికి, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఖర్చు చేస్తున్నారు. ఈ ఎన్నికలో ఓటమి ఎదురైతే తెలంగాణలో తమ కుటుంబ రాజకీయాలకు ముగింపు పలికే ప్రమాదం ఉన్నదనే భయం కేసీఆర్ లో కనిపిస్తున్నది. ఓటమి తప్పదనుకున్న చోట్లకు కేసీఆర్, కేటీఆర్ ప్రచారానికి రారు. మేనల్లుడు హరీశ్ రావుకు ప్రచార బాధ్యతలు అప్పచెబుతారు. గెలుపు ఖాయమనుకుంటే అటువైపు హరీశ్​ను రానీవ్వరు. తండ్రీకొడుకులే అంతా తామే అన్నట్లు కనిపిస్తుంటారు. దుబ్బాకలో వీరిద్దరూ కనిపించలేదు. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఇప్పుడు హుజూరాబాద్ లో కూడా వీరిద్దరూ అడుగు పెట్టే సాహసం చేయడం లేదు. అంటే ఈటల గెలుపు ఖాయం అనే సంకేతం వారే ఇస్తున్నారు. ఇప్పటివరకు అపజయం ఎరుగని ఈటలకు ఈ నియోజకవర్గంతో ఉన్న ఆత్మీయానుబంధం కేసీఆర్ ఎత్తుగడలను విఫలం చేస్తున్నది. 

నియోజకవర్గాన్ని వదిలిపెట్టని ఈటల
తెలంగాణ ఉద్యమంలో తీరిక లేకుండా ఉన్నా, ఆర్థిక మంత్రిగా, ఆ తర్వాత కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా విధుల నిర్వహణలో ఒత్తిడులు ఎదుర్కొంటున్నా ఆయన నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేదు. ప్రతి గ్రామంలో అన్ని వర్గాల ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ వస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే అభివృద్ధిలో హుజూరాబాద్​ ఎంతో ముందున్నది. నియోజకవర్గానికి అనేక నిధులను ఈటల రాబట్టారు. ఆస్పత్రులు, కాలేజీలు, స్కూళ్లు, గురుకులాలు, రోడ్లు, నల్లాలు, డ్రైనేజి, విద్యుత్ సదుపాయం వంటి వాటిని కల్పించడంలో ముందంజలో ఉన్నారు. పైగా ప్రభుత్వ పనుల్లో రాష్ట్రంలో మరెక్కడా కనిపించని నాణ్యత ఇక్కడ కనిపిస్తోంది. అవి చెక్ డ్యాములైనా, ఫ్లై ఓవర్లు అయినా కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా ఉత్తమ ప్రమాణాలతో నిర్మాణాలు జరిగేలా చూశారు. అంతేకాదు, దగ్గరుండి పేదలకు ఫించన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం, కల్యాణలక్ష్మి వంటి పథకాల క్రింద ఆర్థిక సాయం సత్వరం అందేలా చూశారు. అంతగా సేవలందించారు కాబట్టే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తున్నా ఆయనకున్న ప్రజాదరణ ముందు నిలబడలేకపోతున్నారు.

ఈటల తర్వాత హరీశ్​ అంటూ ప్రచారం
కేసీఆర్ ఆదరించి మంత్రి పదవి ఇస్తే, ముఖ్యమంత్రి పదవి కోసం కుట్ర చేస్తున్నాడంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమ సమయంలో స్వయంగా కేసీఆర్ చెబుతూ వచ్చారు. అధికారం వచ్చాక ఆ మాట తప్పి, ఇప్పుడు తన తర్వాత తన కొడుకు కేటీఆర్ సీఎం కావాలని ప్లాన్​ వేస్తున్నారు. అందుకు పోటీ వస్తాడని హరీశ్​ను సైతం దూరంగా ఉంచుతున్నారు. సీఎం పదవి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రిజర్వు చేశారా? ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ పదవి ఆశించడం తప్పా? పార్టీ కార్యకర్తలతో, ప్రభుత్వ యంత్రాంగంతో ఎంతో అనుబంధం గల ఈటల, హరీశ్​ వంటి వారు ప్రభుత్వంలో ఉంటే కేటీఆర్ ను సీఎం చేయడం సాధ్యం కాదని కేసీఆర్​ భయపడుతున్నారు. అందుకోసమే కుంటిసాకులతో ఈటలను కేబినెట్​ నుంచి తొలగించారు. ఆ తర్వాత వరుసలో హరీశ్​ ఉన్నారని అందరూ అంటున్నారు. 

ఈటల పేరుతో అబద్ధపు లెటర్ల సృష్టి
హైదరాబాద్​ను అంతర్జాతీయ నగరంగా మారుస్తానని మాట ఇచ్చి, చిన్న వర్షం వచ్చినా మురుగు కాల్వలా మార్చివేసారని ఒకవైపు ప్రజలు ఎద్దేవా చేస్తుంటే, మరోవైపు ఈటల కరోనా సమయంలో చేసిన సేవలను మెచ్చుకొంటుండడాన్ని సహించలేకపోయారు. నిబద్ధతతో ప్రజలకు, పార్టీకి సేవలు చేయడమే ఈటల చేసిన తప్పిదమా? అందుకనే ఆయనపై లేనిపోని అబద్ధాలు సృష్టించి హుజూరాబాద్ లో ఓడించడానికి వెంటపడుతున్నారా? ఇప్పటి వరకు ఈటల పేరుతో నాలుగు దొంగ లెటర్లు పుట్టించారు. దళిత బంధు వద్దని ఈసీకి లేఖ రాసాడని ప్రచారం చేశారు. అయితే అలాంటి లెటర్​ ఏదీ రాలేదని చెప్పి ఎన్నికల కమిషన్ చెంప చెళ్లుమనిపించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థి అంటూ మరో దుష్ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన చరిత్ర ఉండడమే కాదు, ఆ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తానని గతంలో ప్రకటించారు కూడా. అంతేకాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా తన పార్టీలో చేర్చుకున్నారు. ఇంకా కాంగ్రెస్​లో ఉన్న పలువురు నేతలు కేసీఆర్ చెప్పినట్లు నడుస్తున్నారని ఆ పార్టీ వారే ఆరోపణలు చేస్తున్నారు.

- డా. గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు

 

Tagged Telangana, CM KCR, Eatala Rajender, Huzurabad, Huzurabad By election

Latest Videos

Subscribe Now

More News