కారు కొనడం ఎంత సరదాగా ఉంటుందో.. దానికి సరైన ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. ప్రమాదాలు జరిగినప్పుడు మన జేబుకు చిల్లు పడకుండా ఈ ఇన్సూరెన్స్ కాపాడుతుంది. అయితే చాలామంది పాలసీ ఉన్నా కూడా క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు లబోదిబోమంటుంటారు. చిన్న చిన్న తప్పులే మీకు రావాల్సిన ఇన్సూరెన్స్‌ను దూరం చేస్తాయి. మీ క్లెయిమ్ తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.
లేటు చేయెుద్దు..
ప్రమాదం జరిగినప్పుడు, కారు దొంగతనానికి గురైనప్పుడు వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించాలి. సాధారణంగా కంపెనీలు 24 నుండి 48 గంటల సమయం మాత్రమే ఇస్తాయి. ఈ లోపు సమాచారం ఇవ్వకపోతే.. జరిగిన నష్టాన్ని గుర్తించటం కంపెనీకి కష్టమవుతుంది. ఫలితంగా మీ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
మార్పులు చేస్తే చెప్పాల్సిందే..
మీ కారుకు సీఎన్‌జీ కిట్ అమర్చినా, ఇంజిన్‌లో మార్పులు చేసినా లేదంటే డిజైన్ మార్చినా వెంటనే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. ఇలాంటి మార్పుల వల్ల కారు రిస్క్ పెరుగుతుందని కంపెనీలు భావిస్తాయి. ఈ సమాచారాన్ని దాచిపెడితే.. అది మోసం కిందకు వస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీరు చేసిన మార్పులు కంపెనీకి తెలిస్తే ఒక్క రూపాయి కూడా చెల్లించవు క్లెయిమ్ కోసం.
►ALSO READ | అంబానీ ఇంట్లో 7 స్టార్ హోటల్ కిచెన్.. యాంటిలియాలో చెఫ్ జీతం ఎన్ని లక్షలంటే..?
నిర్లక్ష్యం వద్దు..
సొంత తప్పుల కారణంగా జరిగే నష్టాలకు క్లెయిమ్ రాదు. ఉదాహరణకు.. వర్షాల వల్ల రోడ్లు నీటితో నిండినప్పుడు కారును బలవంతంగా డ్రైవ్ చేయడం, ఇంజిన్ ఆగిపోయినా పదేపదే స్టార్ట్ చేయడం వల్ల ఇంజిన్ పాడైతే ఇన్సూరెన్స్ కంపెనీలు బాధ్యత వహించవు. దీన్ని వినియోగదారుడి నిర్లక్ష్యంగా పరిగణిస్తారు.
డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా?
ఇన్సూరెన్స్ పాలసీ గడువు ఒక్క రోజు ముగిసినా క్లెయిమ్ వర్తించదు. అలాగే కారు నడిపే వ్యక్తికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ అప్‌డేట్ గా లేకపోయినా ఇబ్బందులు తప్పవు.
వేగంగా క్లెయిమ్ పొందాలంటే.. ప్రమాదం జరిగిన వెంటనే ఫోటోలు, వీడియోలు తీసి ఆధారంగా ఉంచుకోవాలి. సర్వేయర్ వచ్చి తనిఖీ చేసే వరకు రిపేర్లు స్టార్ట్ చేయెుద్దు. వీలైనంత వరకు నెట్‌వర్క్ గ్యారేజీలలోనే రిపేర్లు చేయించడం వల్ల క్యాష్ లెస్ సౌకర్యం లభిస్తుంది. అలాగే పేపర్ వర్క్ తగ్గుతుంది. అన్ని వివరాలు పక్కాగా ఉంటేనే కంపెనీలు మీ క్లెయిమ్ వేగంగా సెటిల్ చేస్తాయని గుర్తుంచుకోండి.

