Health Alert : మెడనొప్పి ఎందుకొస్తుంది.. జాగ్రత్తలు ఏంటీ.. చికిత్స ఎలా..!

Health Alert : మెడనొప్పి ఎందుకొస్తుంది.. జాగ్రత్తలు ఏంటీ.. చికిత్స ఎలా..!

ప్రస్తుతం చాలామందిలో కనిపిస్తున్న సమస్య 'మెడ నొప్పి', దాదాపు 80శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కొన్ని రకాల భంగిమల కారణంగా మెడనొప్పి వస్తుంది. మరికొన్ని సందర్భాల్లో గాయాలు, ప్రమాదాల వల్ల కూడా రావొచ్చు. నొప్పి తీవ్రత అనేది, ఆయా కారణాల మీద ఆధారపడి ఉంటుందన్నారు డాక్టర్లు.

ముఖ్యంగా మెడ ప్రాంతంలో కలిగే నొప్పిని మెడనొప్పి  అని పిలుస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న జీవనశైలిలో సాధారణమైన అంశం అయిపోయింది. కానీ ఒక్కోసారి దాని తీవ్రత పెరిగితే, పరిస్థితులు ప్రమాదకరంగా మారొచ్చు. మెడ భాగం.... మన శరీరంలో అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఒకటి.

ఇది పుర్రెభాగం నుంచి మొండెం మధ్యం భాగం వరకు విస్తరించిన వెన్నుపూసతో అనుసంధానమై ఉంటుంది. ఈ మెడనొప్పి తీవ్రంగా మారితే, అది క్రమంగా ఇతర భాగాల సమస్యలకూ దారి తీస్తుంది. 

మెడ నొప్పికి కారణాలు

ఈ మెడనొప్పికి అనేక కారణాలు ఉంటాయి. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు కూర్చునే పద్ధతి (అంటే నిటారుగా కూర్చోకపోవడం, గంటల తరబడి ఒకేచోట కూర్చోవడం). నిద్రించే సమయంలో సరిగ్గా భంగిమలో పడుకోకపోవడం, వార్తా పత్రికలు, పుస్తకాలు చదివేటప్పుడు ఎక్కువసేపు మెడను పంచడం, ఫోన్లను అదే పనిగా ఉపయోగించడం లాంటివి ప్రధాన కారణాలు.ఇలాంటివన్నీ చేయడం వల్ల మెడ కండరాలు ఒత్తిడి పెరుగుతుంది. చాలా సందర్భాల్లో కండరాలు పట్టేస్తాయి. వాటివల్ల మెడనొప్పి వస్తుంది. 

లక్షణాలివే..

రోజూ సాయంత్రాలు ఈ మెడ నొప్పి ఎక్కువగా అనిపిస్తే, అది మొదటి స్టేజీగా గుర్తించాలి. తర్వాత ఆ నొప్పి భుజాల నుంచి చేతి వేళ్ల వరకు వ్యాపిస్తుంది. అలాగే చేతులు, కాళ్లల్లో తిమ్మిర్లు మొదలవుతాయి. మెల్లిమెల్లిగా ఏదైనా వస్తువును పట్టుకునే సామర్ధ్యం (పటుత్వం) కూడా తగ్గిపోతుంది. 

వీళ్లలో ఎక్కువ

ఈ మెడనొప్పి అనేది... మెడను ఎక్కువగా వంచి పని చేసేవాళ్లలో కనిపిస్తుంది. ముఖ్యంగా టీచర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, డ్రైవర్లు, అతిగా మొబైల్ ఫోన్లను ఉపయోగించేవాళ్లలో మెడనొప్పి త్వరగా, తీవ్రంగా ఉంటుంది.

చికిత్స

* పెయిన్ కిల్లర్స్, కొన్ని నరాలకు సంబంధించిన మందులు వాడాలి.
* బెడ్ రెస్ట్ చాలా ముఖ్యం. 
* నెక్ కాలర్ (మెడ పట్టీ) ఉపయోగించాలి.
* నొప్పి తీవ్రంగా ఉంటే, ఎంఆర్ ఐ స్కాన్ చేయించుకోవాలి. కొన్నిసార్లు సర్జరీ అవసరం ఏర్పడుతుంది. 
* ఫిజియోథెరపీ, కొన్ని ఐసోమెట్రిక్ ఎక్సర్ సైజ్ లు చేయాలి.

ఇట్ల చేస్తే..

* ప్రతిరోజూ వ్యాయామం (మెడపై ఒత్తిడి పడని) చేయాలి. 
* మెడ ఎక్కువగా వంచడం చేయకూడదు. 
* ఆఫీసుల్లో పని చేసేటప్పుడు... వంగకుండా నిటారుగా కూర్చోవాలి.
* మెత్తటి, తక్కువ ఎత్తున్న తలగడలు ఉపయోగించాలి.

*సమస్య కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

అప్పుడు తప్పుడు

నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, ఎలాంటి పనులూ చేసుకోలేదు. అప్పుడు తప్పకుండా డాక్టర్ని సంప్రదించాలి. మందులు వాడుతున్నా వారం రోజుల వరకు తగ్గకపోతే, కచ్చితంగా నిపుణుల దగ్గరకు వెళ్లాలి.