మ్యాచ్ ఒకటే.. వేర్వేరు యాడ్స్!   దేశాన్ని బట్టి వాణిజ్య ప్రకటనలు

మ్యాచ్ ఒకటే.. వేర్వేరు యాడ్స్!   దేశాన్ని బట్టి వాణిజ్య ప్రకటనలు

     ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ మ్యాచుల్లో ప్రత్యేక వర్చువల్​ టెక్నాలజీ

  •      కంపెనీలకు ఎంతో ప్రయోజనకరం


న్యూఢిల్లీ: మీరెప్పుడైనా గమనించారా ?   ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్ అభిమానులు ఒకే లైవ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను వేర్వేరు దేశాల్లో చూస్తున్నప్పుడు మైదానం చుట్టూ ఉండే ప్రకటనలు వేర్వేరుగా కనిపిస్తుంటాయి.   అందరికీ ఒకటే ఆట అయినా, అక్కడి ప్రకటనల బోర్డులు మాత్రం మారుతుంటాయి. ఇండియాలో చూసే ప్రేక్షకులకు కనిపించే వాణిజ్య ప్రకటనలకు, యూకే లేదా యూఎస్ లేదా యూరప్​ దేశాల్లోని ప్రేక్షకులకు కనిపించే ప్రకటనలకు అస్సలు సంబంధం ఉండదు. ఇదేమీ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్ లోపం కాదు. వర్చువల్ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ ద్వారా ఈ మ్యాజిక్​చేస్తారు. ఈ అద్భుత టెక్నాలజీ లైవ్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లో స్టేడియం లోపల ఉండే అడ్వర్టయిజింగ్ బోర్డులను మార్చకుండానే, ప్రకటనలను రియల్ టైమ్‌‌‌‌‌‌‌‌లో మార్చేస్తుంది. ఈ విధానం స్టేడియం లోపల ఉండే ప్రతి టీవీ కెమెరా పొజిషన్‌‌‌‌‌‌‌‌ను ముందుగా గుర్తిస్తుంది.  ప్రత్యేక సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ మైదానంలోని వైట్ మార్కింగ్‌‌‌‌‌‌‌‌లు, గోల్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లు, ఇతర స్టేడియం ఫీచర్లను ఫిక్స్​డ్ ​రిఫరెన్స్​ పాయింట్లుగా ఉపయోగిస్తుంది. దీనివల్ల కెమెరా కచ్చితమైన కోణం, కదలికల వంటి వాటిని సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ సులభంగా అర్థం చేసుకుంటుంది. ఈ సమాచారం అందిన వెంటనే, లైవ్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్‌‌‌‌‌‌‌‌లో ప్రకటన బోర్డుల స్థానంలో డిజిటల్ ప్రకటనలను ఉంచుతారు. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్​ నిరంతరం కెమెరా కదలికలను అనుసరించడంతో ఈ వర్చువల్ ప్రకటనలు స్టేడియం లోపల నిజంగానే ఉన్నట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల వీక్షకులకు అవి నిజమైన ఫిజికల్ బోర్డులనే భ్రమ కలుగుతుంది.

వేర్వేరు యాడ్స్​  ఎలా చూపిస్తారంటే..

బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్లు ఒకే లైవ్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను వేర్వేరు ప్రాంతాలకు  వేర్వేరు వెర్షన్లలో పంపగలుగుతారు. ప్రతి బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్ట్​లో సంబంధిత మార్కెట్ ప్రకటనలు ఉంటాయి. ఉదాహరణకు, ఇండియాలోని వీక్షకులు తమ దేశ బ్రాండ్ల ప్రమోషన్లను చూస్తారు.   జపాన్, యూరప్ లేదా మిడిల్ ఈస్ట్​ దేశాల అభిమానులు లోకల్ కంపెనీల ప్రకటనలను చూస్తారు. దీనివల్ల కంపెనీలు టార్గెట్​ప్రేక్షకుణ్ని చేరుకోవడం సులువుగా మారుతుంది. స్టేడియం సెటప్‌‌‌‌‌‌‌‌ను మార్చాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వర్చువల్ టెక్నాలజీ  బ్రాడ్‌‌‌‌‌‌‌‌కాస్టర్లు, ఈవెంట్ నిర్వాహకులకు ప్రకటనల అవకాశాలను విపరీతంగా పెంచుతుంది. గ్లోబల్ ఆడియన్స్‌‌‌‌‌‌‌‌కు ఒక స్పాన్సర్‌‌‌‌‌‌‌‌ను చూపించే బదులు, బహుళ కంపెనీలు ఒకే సమయంలో వేర్వేరు దేశాల కోసం యాడ్స్​ స్లాట్లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ రకం ప్రకటనల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిర్దిష్ట మార్కెట్లలో మాత్రమే అందుబాటులో ఉండే ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వీలవుతుంది. ఈ టెక్నాలజీ అంతర్జాతీయ బ్రాండ్లకు ఎంతో ఉపయోగపడుతుంది.  వీక్షకులకు ఉపయోగకరంగా, స్పాన్సర్లకు మరింత విలువైనదిగా మారింది. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్, ఇతర ప్రధాన క్రీడా ఈవెంట్లలో వర్చువల్ అడ్వర్టైజింగ్ సర్వసాధారణంగా మారింది.