విక్రమ్ మిస్రీపై, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఆయన చేసిన తప్పేంటి..?

విక్రమ్ మిస్రీపై, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్.. ఆయన చేసిన తప్పేంటి..?

భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై, ఆయన కూతురిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. ఇండియా–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మే 10వ తేదీన విక్రమ్ మిస్రీ ప్రకటించడంతో ఆయనపై, ఆయన కుటుంబంపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తిగత విమర్శలకు తెగబడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందం వల్ల యుద్ధం అర్ధాంతరంగా ముగిసిందని, పాక్పై ప్రతీకారం తీర్చుకోలేక పోయామని సోషల్ మీడియాలో కొందరు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోయారు. దేశ ప్రధాని మోదీపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించడమే పాపమైనట్లుగా భావించిన కొందరు సోషల్ మీడియాలో విక్రమ్ మిస్రీని, ఆయన కూతురిని టార్గెట్ చేశారు. పరుష పదజాలంతో ఆయన కుటుంబాన్ని, కూతుర్లను టార్గెట్ చేసి కొందరు పోస్టులు పెట్టడంపై ప్రముఖులు మండిపడ్డారు. విక్రమ్ మిస్రీపై, ఆయన కుటుంబంపై జరిగిన ట్రోలింగ్ను ఖండించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్తో పాటు కొందరు నేతలు మిస్రీకి అండగా నిలిచారు.

లండన్లో ఉన్న విక్రమ్ మిస్రీ కుమార్తెను కూడా కొందరు ట్రోల్ చేశారు. విక్రమ్ మిస్రీ ఫ్యామిలీ పర్సనల్ డీటైల్స్ కూడా షేర్ చేసి దారుణంగా ట్రోలింగ్ చేశారు. దీంతో.. విక్రమ్ మిస్రీ తన ‘ఎక్స్’ ఖాతాను ప్రైవేట్లో పెట్టుకున్నారు. విక్రమ్ మిస్రీ కూతురు రోహింగ్యా ముస్లింలకు లీగల్ హెల్ప్ చేస్తుందని కొందరు ట్రోలర్లు దుయ్యబట్టారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను హైలైట్ చేస్తూ కామెంట్ బాక్స్లోకి వెళ్లి మరీ బూతులు తిట్టారు.

‘ఆపరేషన్ సిందూర్’ మొదలైనప్పటి నుంచి విక్రమ్ మిస్రీ గురించి దేశ ప్రజలకు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’పై వివరాలను వెల్లడించేందుకు కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సంయుక్తంగా పలుమార్లు మీడియా సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.