హెల్త్ సీక్రెట్: మీకు రెండో బ్రెయిన్ గురించి తెలుసా?

హెల్త్ సీక్రెట్: మీకు రెండో బ్రెయిన్ గురించి తెలుసా?

మానవ దేహంలో పొట్టకు చాలా ప్రాధాన్యం ఉంది. మన రెండో మెదడు పొట్టే అంటే నమ్ముతారా? అవును ఇది నిజమేనండి. కావాలంటే ఎప్పుడైనా గమనించండి. మనం ఉత్సుకతగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు, నిరుత్సాహంగా ఉన్నప్పుడు లేదా సంతోషంగా ఉన్నప్పుడు గమనించండి. ఆ లక్షణాలన్నీ మన పొట్ట భాగంపై ప్రభావం చూపుతాయి. ఏ భావమైనా, విషయం, ఆలోచనైనా ముందుగా పొట్టలోనే అనుభూతి చెందుతామని, ఆ తర్వాతే మెదడు దాన్ని ఫీల్ అవుతుందని ప్రాణ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డింపుల్ జంగ్డా చెప్పారు. పొట్ట గురించి డింపుల్ చెప్పిన మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే..

‘సంతోషానికి కారణమయ్యే సెరోటొనిన్ పొట్టలో దాదాపుగా 70 శాతం విడుదల అవుతుంది. గుండెలో లేదా మెదడులో విడుదలవ్వదు. ప్రతి మైక్రో మిలియన్ సెకండ్‌‌కు మెదడుకు సిగ్నల్స్ పంపే నాడీ కణంతో పొట్ట అనుసంధానమై ఉంటుంది. అందుకే పొట్ట భాగంలో ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా గ్యాస్ట్రిక్స్, జీర్ణలేమి లాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పని మీద ఎక్కువగా ధ్యాస పెట్టలేం. ఎందుకంటే పొట్ట భాగంలోని సమస్య బ్రెయిన్ మీదా ఎఫెక్ట్ చూపుతుంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. మన జీవితంలో చాలా ముఖ్యమైన, అధిక భాగం విషయాలు పొట్టలోనే నిల్వ అవుతాయి. అందుకే రుచి, శబ్దం, సువాసనను ఎక్కువగా, దీర్ఘ కాలం గుర్తుంచుకోగలం. పొట్ట భాగాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే మన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. మానసికంగా, శారీరకంగానూ దృఢంగా తయారవుతాం. అందుకోసం పెరుగు, మజ్జిగ, హెర్బల్ టీ, ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాలు, పులియబెట్టిన ఆహారం, పండ్లు, ఉడకబెట్టిన సలాడ్లను తింటే పొట్ట హెల్తీగా ఉంటుంది’ అని డింపుల్ పేర్కొన్నారు.