పాము కరిచిన తర్వాత మంచి నీళ్లు తాగాలా.. వద్దా..

పాము కరిచిన తర్వాత మంచి నీళ్లు తాగాలా.. వద్దా..

పాము అంటేనే భయం. కనిపిస్తే పారిపోవడమో.. లేదా కొంతమంది కలిసి పామును చంపేయడమో చేస్తుంటారు.  కొన్ని సందర్భాల్లో పాము కరిస్తే  ఏం చేయాలి అన్న విషయంలో ప్రజలు మల్లగుల్లాలు పడుతుంటారు.. కొంతమంది తాగేందుకు నీరుఇవ్వమంటే.. మరికొందరు వద్దంటారు.. నీరు తాగితే  పాము విషం విరుగుడు అవుతుందా.. అసలు పాము కరచిన వారు నీళ్లు తాగవచ్చా.. వైద్యుల సూచనలు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం.. . 

పాము కరచిన వ్యక్తి నీరు తాగితే రక్తం పలచబడి విష ప్రభావం పోతుందని కొంతమంది చెబుతుంటారు.  అయితే ఎంతమాత్రం నిజం కాదని వైద్యులు చెబుతున్నారు.  వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు.   పాము కరచిన ప్రదేశంలో సబ్బుతో నాలుగైదు సార్లు కడగాలి.   యాంటీసెప్టిక్‌ లోషన్‌తో శుభ్రం చేస్తే కొంతవరకు విష ప్రభావం తగ్గుతుందని సూచిస్తున్నారు.  సాధ్యమైనంత వరకు ఆ భాగాన్ని కదలించకూడదు.

కొంతమంది పైన కింద బ్యాండేజి కడతారు. అలా అసలు చేయవద్దని సూచిస్తున్నారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. పాము కరిచిన వ్యక్తిని భయపెట్టకూడదు. చుట్టుపక్కల వారు బాధితుడిని మానసికంగా భయపెట్టేందుకు ప్రయత్నిస్తారు. అది పాము విషం కంటే ప్రమాదకరం. అందుకే పాము కాటుకు గురైన వ్యక్తికి సాధ్యమైనంత ధైర్యం చెప్పాలి. అంతేకాక కొంతమంది తెలియక నాటు మందులు, ఆకు పసరు తాగిస్తుంటారు. అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. 

పాము కరిచిన వెంటనే భయంతో పరుగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి త్వరగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మివేయడం మంచిది కాదు. దీని వల్ల గాయం పెద్దదై విషం చర్మంతోపాటు చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరగా గుండెకు చేరుతుంది. నొప్పి తగ్గేందుకు ఎలాంటి మందులు వాడొద్దు. కాటు వేసిన భాగం నుంచి నోటితో రక్తం పీల్చకూడదు. ఆ ప్రాంతంలో కణజాలాన్ని కత్తితో కత్తిరించడం సరికాదు. పాము విషం   లాలాజల స్రావం  రకం, ఇది ఎరను చంపడానికి  జీర్ణం చేయడానికి ఉపయోగించబడుతుంది. దీని ప్రభావం నేరుగా నరాలపై పని చేస్తుంది.  ఐస్ అస్సలు వేయకుండా జాగ్రత్త వహించండి. దీనివల్ల విషం పేరుకుపోయి ప్రాణాంతకంగా మారుతుంది. యాంటీ-వెనమ్ ఇంజెక్షన్  సకాలంలో చికిత్స చేస్తే, హానిని నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.