ట్రంప్ 50 శాతం టారిఫ్ వేసినా..ఇండియా వృద్ధి ఆగదు

ట్రంప్ 50 శాతం టారిఫ్ వేసినా..ఇండియా వృద్ధి ఆగదు
  • 19 ఏళ్ల తర్వాత సావరిన్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసిన ఎస్ అండ్ పీ
  • బీబీబీ మైనస్ నుంచి బీబీబీకి మార్పు
  • ఇండియన్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో తక్కువ వడ్డీకి లోన్లు తీసుకునేందుకు వీలు
  • ట్రంప్ డెడ్ ఎకానమీ అన్న కొన్ని రోజులకే మెరుగైన రేటింగ్‌‌‌‌‌‌‌‌
  • 2025–26 లో జీడీపీ గ్రోత్ రేటు 6.5 శాతం

న్యూఢిల్లీ: అమెరికన్‌‌‌‌‌‌‌‌ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ ఇండియాపై 50 శాతం టారిఫ్ వేసినా, దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని రేటింగ్  ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ పేర్కొంది.  దాదాపు 19 సంవత్సరాల తర్వాత భారతదేశ సావరిన్  క్రెడిట్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను 'బీబీబీ- మైనస్‌‌‌‌‌‌‌‌ ' నుంచి 'బీబీబీ'కి అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసింది. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపింది. సావరిన్ రేటింగ్ మెరుగుపడడంతో ఇండియన్ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లలో   తక్కువ వడ్డీకి లోన్లను తీసుకోవడానికి వీలుంటుంది. 

ఆర్థిక వ్యవస్థకు రాజకీయ దన్ను..

దేశ ఆర్థిక వృద్ధికి రాజకీయ దన్ను ఉందని  ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ గ్లోబల్‌‌‌‌‌‌‌‌ రేటింగ్స్ పేర్కొంది.  ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే సానుకూల  పాలసీలు తేవడంతో సావరిన్ రేటింగ్‌‌‌‌‌‌‌‌ను అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌ చేశామని తెలిపింది. "భారతదేశం ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు కనబరిచే ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. గత ఐదారు సంవత్సరాల్లో ప్రభుత్వ ఖర్చు కంట్రోల్లో ఉంది" అని వివరించింది.  అమెరికా సుంకాలతో భారత ఆర్థిక వ్యవస్థ పెద్దగా నష్టపోదని, వీటి ప్రభావాన్ని మేనేజ్ చేయొచ్చని  అభిప్రాయపడింది. 50శాతం సుంకం విధించినా,  ఆర్థిక వృద్ధికి భారం కాదని పేర్కొంది. 

"భారతదేశం విదేశీ వాణిజ్యంపై తక్కువ ఆధారపడుతోంది.  దేశ ఆర్థిక వృద్ధిలో 60శాతం స్వదేశీ వినియోగం నుంచే వస్తోంది" అని ఎస్ అండ్ పీ వివరించింది. కాగా,   అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని "డెడ్ ఎకానమీ" అని పిలిచిన కొద్ది రోజుల తర్వాత ఈ రేటింగ్ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ రావడం విశేషం. అమెరికన్ గవర్నమెంట్  ఆగస్టు 27 నుంచి భారత వస్తువులపై 50శాతం సుంకం విధించనుంది.

2007 తర్వత అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌

ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ 2007 జనవరిలో  భారతదేశానికి  అత్యల్ప ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ గ్రేడ్ రేటింగ్ 'బీబీబీ మైనస్‌‌‌‌‌‌‌‌' ను ఇచ్చింది. తర్వత 2024 లో  తన రేటింగ్‌‌‌‌‌‌‌‌ దృక్పథాన్ని  ‘‘స్టేబుల్​”నుంచి ‘‘పాజిటివ్​”కు మెరుగుపరిచింది. తాజాగా రేటింగ్‌‌‌‌‌‌‌‌ను ‘‘బీబీబీ పాజిటివ్‌‌‌‌‌‌‌‌’’కు  అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసి,  దృక్పథాన్ని ‘‘స్టేబుల్​” కు మార్చింది.  ఇది అత్యల్ప ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ గ్రేడ్ కంటే ఒక స్థాయి ఎక్కువ.  

"దేశ వృద్ధి బలంగా ఉండడం, ద్రవ్యోల్బణాన్ని తగ్గించే మానిటరీ పాలసీ, ఆర్థిక పరిస్థితులకు ప్రభుత్వ మద్ధతు,  ఖర్చులు తగ్గించుకోవడం  ఈ అప్‌‌‌‌‌‌‌‌గ్రేడ్‌‌‌‌‌‌‌‌కు కారణాలు" అని ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ తెలిపింది.  మరోవైపు  స్వల్పకాల రేటింగ్‌‌‌‌‌‌‌‌ను 'ఏ-3' నుంచి 'ఏ-2'కి ఈ రేటింగ్ ఏజెన్సీ పెంచింది.

రానున్న 3 ఏళ్లు జీడీపీ వృద్ధి 6.5 శాతం పైనే..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ద్రవ్యలోటు  జీడీపీలో 7.3శాతంగా ఉంటుందని, 2028–29 నాటికి 6.6శాతానికి తగ్గుతుందని ఎస్‌‌‌‌‌‌‌‌ అండ్ పీ అంచనా వేసింది. "కరోనా సంక్షోభం నుంచి భారతదేశం రికవరీ అయ్యింది.  ప్రపంచంలోని అత్యుత్తమ ఎమర్జింగ్  ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రియల్‌‌‌‌‌‌‌‌ జీడీపీ వృద్ధి రేటు 6.5శాతం వద్ద,  రాబోయే మూడు ఏళ్లలో సగటున 6.8శాతం వద్ద ఉంటుంది” అని ఎస్ అండ్ పీ తెలిపింది.  బలమైన వినియోగం, పెరుగుతున్న ప్రభుత్వ ఖర్చులు  ఈ వృద్ధిని నడిపిస్తాయని అంచనా వేసింది.