వైఫై డెబిట్ కార్డులు చోరీ చేసి రూ.8 లక్షలు కొట్టేశారు

వైఫై డెబిట్ కార్డులు చోరీ చేసి రూ.8 లక్షలు కొట్టేశారు
  • ఇద్దరు నిందితుల అరెస్ట్
  • 319 కార్డులు.. 2.5 లక్షల క్యాష్ సీజ్

హైదరాబాద్‌‌,వెలుగు: వైఫై డెబిట్ కార్డులను చోరీ చేసి పేటీఎం  స్వైపింగ్ మెషీన్ ద్వారా  డబ్బులు కొట్టేస్తున్న ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి రూ.2 లక్షల 50 వేల క్యాష్, 319 ఏటీఎం కార్డులు, పేటీఎం స్కానింగ్ అండ్ స్వైపింగ్ మెషీన్, బైక్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన తళ్ల శ్రీనివాసుల రెడ్డి(26) బీటెక్ పూర్తి చేసి 2017లో సిటీకి వచ్చాడు.  కేపీహెచ్‌‌బీలో ఉంటూ గతేడాది సెప్టెంబర్‌‌‌‌ వరకు వివిధ కంపెనీల్లో వర్క్‌‌ చేశాడు.  తర్వాత తన బంధువు పిల్లి కొండారెడ్డి(25)తో కలిసి షేక్‌‌పేట్‌‌ మారుతీనగర్‌‌‌‌కి మకాం మార్చాడు.  కొండారెడ్డి ఓ హోటల్‌‌లో సూపర్‌‌‌‌ వైజర్‌‌‌‌గా పనిచేసేవాడు. జల్సాలకు బానిసైన వీరిద్దరూ కొన్నిరోజులకే జాబ్స్ మానేశారు. ఈజీమనీ కోసం ఏటీఎం సెంటర్స్ ను టార్గెట్ చేశారు. కొంతకాలం క్రితం గచ్చిబౌలిలోని ఓ ఏటీఎం సెంటర్​లో వారికి వైఫై డెబిట్ కార్డు దొరికింది. దాన్ని స్వైప్ చేసేందుకు పేటీఎం స్కానర్, స్వైపింగ్ మెషీన్​ను కొన్నారు.  శ్రీ వెంకటేశ్వర, శ్రీలక్ష్మి కృష్ణ జనరల్‌‌ స్టోర్స్‌‌ పేర్లతో రెండు పీవోఎస్(పాయింట్ ఆఫ్ సేల్) పేటీఎం స్కానర్లను రిజిస్టర్ చేసుకున్నారు.  కొటాక్‌‌ మహీంద్రా, సిటీ బ్యాంక్స్‌‌లోని తమ అకౌంట్స్‌‌ను దానికి లింక్ చేశారు.  కూకట్‌‌పల్లి, కేపీహెచ్‌‌బీ, మాదాపూర్, గచ్చిబౌలి, అమీర్‌‌‌‌పేట్‌‌, గోల్కొండ ప్రాంతాల్లోని ఏటీఎం సెంటర్లలో వృద్ధుల దృష్టి మరల్చి వైఫై డెబిట్ కార్డులను చోరీ చేశారు. గత 6 నెలల్లో మొత్తం 319 కార్డులు కొట్టేశారు. వైఫై డెబిట్ కార్డుల నుంచి పేటీఎం స్వైపింగ్ మెషీన్ సాయంతో డైలీ   రూ.2 వేల నుంచి రూ.4 వేలు ట్రాన్స్ ఫర్ చేసుకునేవారు.   కార్డు హోల్డర్స్‌‌ అలర్టై బ్లాక్ చేసేంత వరకు వాటిని స్వైప్ చేసేవారు. ఇలా శ్రీనివాసుల రెడ్డి రూ.6 లక్షల 87 వేలు, కొండారెడ్డి రూ.లక్షా 50 వేలకు తమ అకౌంట్లలోకి ట్రాన్స్ ఫర్ చేసుకున్నారు. కూకట్ పల్లి, రాయదుర్గం, కేపీహెచ్​బీ ల పరిధిలో డెబిట్ కార్డు నుంచి డబ్బులు కోల్పోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేపీహెచ్ బీ పీఎస్​లో రిజిస్టర్ అయిన నాలుగు కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా నిందితులు శ్రీనివాసుల రెడ్డి, కొండారెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు. 9 మంది డెబిట్ కార్డు హోల్డర్స్ ను గుర్తించామని.. మరో 310 మందిని గుర్తించాల్సి ఉందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. డెబిట్​ కార్డులు పోగొట్టుకున్న వారు మాదాపూర్ డీసీపీ  ఆఫీసులో సంప్రదించాలని సూచించారు.