ఖమేనీపై జనాగ్రహం.. ఇరాన్ లో టెన్షన్.. టెన్షన్

ఖమేనీపై జనాగ్రహం.. ఇరాన్ లో టెన్షన్.. టెన్షన్

టెహ్రాన్: ఇరాన్​లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ పాలనతో విసిగిపోయిన ప్రజలు రోడ్డెక్కారు. ‘నియంత ఖమేనీ నశించాలి, ఇస్లామిక్ రిపబ్లిక్ నశించాలి’ అంటూ నినాదాలతో ఆందోళనలు చేస్తున్నారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటాయి.

ఇరాన్ కరెన్సీ ‘రియాల్’ విలువ దారుణంగా పతనమైంది. ప్రస్తుతం అక్కడ ఒక అమెరికన్ డాలర్ విలువ దాదాపు 14 లక్షల ఇరాన్ రియాల్స్‌‌కు పడిపోయింది. ఖమేనీ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 30కి పైగా నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.

రెజా పహ్లావి పిలుపుతో భారీ నిరసన

ఇరాన్ చివరి రాజు కొడుకు రెజా పహ్లావి పిలుపు మేరకు ప్రజలు గురువారం రాత్రి రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఇంటర్​నెట్, ఇంటర్నేషనల్ టెలిఫోన్ సేవలను అధికారులు నిలిపివేశారు. గతంలో హిజాబ్ వ్యతిరేక పోరాటాలను అణచివేసిన ఆగ్రహం ఇంకా రగులుతూనే ఉందని నిరసనకారులు తెలిపారు. ఇప్పుడు దానికి ఆర్థిక కష్టాలు తోడయ్యాయని మండిపడ్డారు. డిసెంబర్​లో మొదలైన నిరసనలతో ఇప్పటి దాకా 45 మందికి పైగా చనిపోయారు, 2 వేల మందికి పైగా అరెస్ట్ అయ్యారని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.

ఖమేనీ భయపడుతున్నడు: ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరాన్‌‌లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఖమేనీ చాలా భయపడుతున్నారు. ఆయన త్వరలోనే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది” అని ట్రంప్ హింట్ ఇచ్చారు. ‘‘శాంతియుతంగా నిరసన తెలిపే వారిని చంపితే మేము చూస్తూ ఊరుకోం. ఇరాన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ది చెప్తం’’అని ట్రంప్ హెచ్చరించారు.

విదేశీ కుట్రలను ఐక్యంగా ఎదుర్కొందాం: ఖమేనీ

ఇరాన్​లో అశాంతిని, అల్లర్లను రేకెత్తించడమే లక్ష్యంగా విదేశీ శత్రువులు చేస్తున్న  కుట్రలను ఐక్యంగా ఎదుర్కొందామని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమేనీ శుక్రవారం ప్రజలను ఉద్దేశించి టీవీలో మాట్లాడారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తొత్తులే ఈ ఆందోళనలను లేవదీశారని ఖమేనీ ఆరోపించారు. నలుగురు ఆందోళనకారులు చనిపోవడాన్ని ప్రస్తావిస్తూ.. ట్రంప్ చేతులకు ఇరాన్ ప్రజల రక్తపు మరకలు అంటుకున్నాయని మండిపడ్డారు.