
జగిత్యాల టౌన్, వెలుగు: హత్య కేసులో భార్యాభర్తలకు జీవిత ఖైదు విధిస్తూ జగిత్యాల కోర్టు జడ్జి నారాయణ తీర్పు చెప్పారు. వెల్గటూర్ పీఎస్ పరిధిలోని ఎండపల్లి గ్రామానికి చెందిన అంకం మల్లేశం, రాజేశం మామఅల్లుళ్లు. అదే గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు మధ్య పాతగొడవలు ఉండేవి. రాజేశం అత్త సరస్వతిని లక్ష్మీనారాయణ కొట్టగా కేసు నమోదయింది.
మల్లేశం వల్లే కేసు నమోదయిందని ఎలాగైనా చంపాలని మనసులో పెట్టుకున్నాడు. 2016 సెప్టెంబర్ 20న లక్ష్మీనారాయణ భార్య విజయ కారపొడి తీసుకొచ్చి మల్లేశం కండ్లల్లో చల్లగా నారాయణ గొడ్డలితో మల్లేశం తలపై దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. గొడవను ఆపడానికి వెళ్లిన రాజేశంపైనా కూడా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన మల్లేశంను హాస్పిటల్‌కు తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు.
మృతుడి కూతురు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వెంకటేశ్వర రావు నిందితుడిపై కేసు నమోదు చేశారు. నిందితులైన నారాయణ, విజయను కోర్టులో హాజరుపరచగా సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ఇద్దరికీ జీవిత ఖైదుతోపాటు రూ.7వేల జరిమానా విధించారు.