- వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలో ఘటన
వికారాబాద్, వెలుగు : ‘వంట రాదు.. నా కన్నా తక్కువగా చదువుకున్నావు’ అని భర్త వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ధరూర్ మండలంలోని గడ్డమీద గంగారం గ్రామానికి చెందిన గంజి మల్లమ్మ, సాయన్న చిన్న కూతురు శిరీష (21)కు పరిగి మండలం మల్లెమోనిగూడ గ్రామానికి చెందిన శివలింగంతో ఐదు నెలల కిందే వివాహమైంది.
తర్వాత వంట రాదు, తక్కువగా చదువుకున్నావని శివలింగం వేధించడంతో పాటు ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో కుటుంబ పెద్దలు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నచ్చజెప్పారు. ఈ క్రమంలో సోమవారం సైతం శిరీష, శివలింగం గొడవ పడ్డారు. అనంతరం శివలింగం తన భార్య శిరీషను పుట్టింటి వద్ద విడిచి వెళ్లాడు. మంగళవారం ఉదయం కూలీ పనులకు వెళ్లిన మల్లమ్మ సాయంత్రం తిరిగి వచ్చే సరికి శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడు శివలింగం వేధింపులు తట్టుకోలేకే తన కూతురు శిరీష ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాఘవేందర్ తెలిపారు.
