విడాకుల కేసులో భార్య ప్రియుడు కోర్టుకు రావాలా?..హైకోర్టు ఏం చెప్పిందంటే..

విడాకుల కేసులో భార్య ప్రియుడు కోర్టుకు రావాలా?..హైకోర్టు ఏం చెప్పిందంటే..

హైదరాబాద్, వెలుగు: విడాకుల కేసులో భార్య ప్రియుడిని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఇటీవల కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ విడాకులు కోరుతున్నపుడు.. వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాదనను వినాల్సివుందని స్పష్టం చేసింది. వివాహాన్ని రద్దు చేయాలని భర్త దాఖలు చేసిన పిటిషన్‌‌లో తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్​విజ్ఞప్తిని కింది కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు.

దీనిపై జస్టిస్‌‌ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు. పిటిషనర్‌‌ తరఫు అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌‌ భార్య పెళ్లికి ముందే మరో వ్యక్తితో ప్రేమలో ఉందని, ప్రేమ విఫలమైందని చెప్పడంతో నమ్మి పెళ్లి చేసుకున్నాడన్నారు. అయితే, సంబంధాన్ని తిరిగి కొనసాగిస్తుండడంతో పెళ్లి రద్దు కోరుతూ కింది కోర్టులో పిటిషన్‌‌ దాఖలు చేశారన్నారు. 

దీనికి సంబంధించిన అన్ని ఆరోపణలతోపాటు అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలని దాఖలు చేసిన పిటిషన్‌‌ను కింది కోర్టు కొట్టివేసిందన్నారు. వివాహేతర సంబంధాన్ని నిర్ధారిస్తూ ప్రియుడి భార్య కోర్టుకు అఫిడవిట్‌‌ సమర్పించారన్నారు. ప్రతివాది అయిన భార్య తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ.. వివాహేతర సంబంధం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.

స్నేహితులను, కుటుంబసభ్యులను కూడా కలవడానికి అనుమతించడంలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న జడ్జి వివాహేతర సంబంధం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వివరణ ఇచ్చి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వాల్సి ఉందన్నారు. వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి భార్య ఇచ్చిన అఫిడవిట్‌‌ను పరిగణనలోకి తీసుకోకుండా పిటిషనర్‌‌ దరఖాస్తును తిరస్కరించడం చట్టవిరుద్ధమన్నారు. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తిని ప్రతివాదిగా చేర్చాలని ఉత్తర్వులు జారీ చేశారు.