బెల్లంపల్లి మండలంలో అడవి పంది మాంసం విక్రేతల అరెస్ట్

బెల్లంపల్లి మండలంలో అడవి పంది మాంసం విక్రేతల అరెస్ట్

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాశిరెడ్డిపల్లిలో అడవి పంది మాంసం అమ్ముతున్న నలుగురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు అధికారులు గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు. గంధం రాజన్న, సిరిగిరి సాయి వద్ద అడవి పంది మాంసం లభించింది. 

విచారణలో కన్నాల గ్రామానికి చెందిన ముస్కె శ్రీనివాస్ తమకు రెండు అడవి పందులను అమ్మాడని చెప్పారు. జంగేపల్లి చంద్రమొగిలి తన పత్తి చేనులో విద్యుత్ వైర్లు అమర్చగా ఈ నెల 27న రెండు అడవి పందులు వాటికి తగిలి చనిపోయాయి. దీంతో వాటిని చంద్రమొగిలి శ్రీనివాస్​కు అమ్మితే అతడు వాటిని రాజన్న, సాయికి అమ్మాడు. 

నిందితుల నలుగురిని అదుపులోకి తీసుకుని, అడవిపంది మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిని రేంజ్ ఆఫీస్‌కు తరలించారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు జై తిరుపతి, గౌరీశంకర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గోపీకృష్ణ, బి.రాజు, భాస్కర్ పాల్గొన్నారు.