ధరణి పోర్టల్ ను రద్దు చేస్తం : సీతక్క

ధరణి పోర్టల్ ను రద్దు చేస్తం : సీతక్క

ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : కరోనా కష్టకాలంలో ములుగు నియోజకవర్గ ప్రజలకు చేదోడుగా నిలిచి తోచిన సాయం చేశానని, తన చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటానని ములుగు కాంగ్రెస్  అభ్యర్థి సీతక్క అన్నారు. ములుగు మండల కేంద్రంతో పాటు మల్లంపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం తెచ్చి అందరికీ పట్టాలు ఇచ్చిందని, బీఆర్ఎస్  ప్రభుత్వం మాత్రం అటవీ అధికారులను ఉసిగొల్పి భూములను లాక్కుందని  విమర్శించారు. కాంగ్రెస్  అధికారంలోకి రాగానే సాగు చేసుకుంటున్న ప్రతి రైతుకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోడు రైతులందరికీ పట్టాలు అందించేలా కృషి చేస్తానని అన్నారు.

ధరణి పోర్టల్  రైతుల ప్రాణాలతో ఆడుకుంటున్నదని, తమ ప్రభుత్వం రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని, ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మన బతుకులు మారుతాయని కాంగ్రెస్  మాజీ చీఫ్​ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే.. రాష్ట్రాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకుందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా బీఆర్ఎస్  నాయకుల మోసపూరిత వాగ్దానాలు నమ్మవద్దని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్  జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్  సెల్  జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్  కాంగ్రెస్  జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్  తదితరులు పాల్గొన్నారు.