బాసరను మించి బమ్మెరను అభివృద్ధి చేస్తాం

బాసరను మించి బమ్మెరను అభివృద్ధి చేస్తాం
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
  • వచ్చే ఏడాది నుంచి అధికారికంగా నిర్వహిస్తామని వెల్లడి

పాలకుర్తి, వెలుగు: మహాకవి పోతన జయంతిని జనగామ జిల్లా పాలకుర్తిలోని పోతన స్వస్థలం బమ్మెరలో ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు తెలంగాణ సంప్రదాయ పండుగలైన బతుకమ్మ, బోనాలతో మహిళలు కదిలివచ్చారు. పోతన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కవులు,కళాకారులు, సాహితీవేత్తలను ఘనంగా సత్కరించారు. పోతన రచనలను కొనియాడారు. చీఫ్ గెస్టుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బమ్మెరను అభివృద్ధి చేస్తాం..

 బాసరకు మించి బమ్మెర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. బమ్మెర పోతన చెంతనే అక్షరాభ్యాసాలు జరిగేలా రూపురేఖలు మారుస్తామన్నారు. ఆదివారం పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో నిర్వహించిన పోతన జయంతి ఉత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత ప్రభుత్వాలు ఇక్కడి ప్రాంతాన్ని పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.13.50కోట్లతో పోతన మందిరం, రూ.10కోట్లతో పాల్కురికి సోమనాథుడి ఆలయాన్ని అభివృద్ధి చేశారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పోతన జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. పోతన, సోమనాథుడు, వాల్మీకి వంటి కవులు నడియాడిన నేలపై మనం పుట్టడం అదృష్టంగా భావించాలన్నారు. వారి కీర్తిని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు పోతన సమాధి వద్దకు వెళ్లి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అష్టావధానం, కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.

సాహితీవేత్తలకు సన్మానం..

పోతన జయంతి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కవులు, కళాకారులు హాజరు కాగా సాహితీరంగంలో పేరొందిన కోవెల సుప్రసన్నాచార్యకు స్వర్ణ కంకణం, ప్రొ.రామచంద్రమౌళికి స్వర్ణ అంగుళీయాన్ని ప్రదానం చేశారు. అనంతరం వారిని సత్కరించారు. డా. కల్నల్ భిక్షపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, సర్పంచ్ జలగం నాగభూషణం, రాపాక సత్యనారాయణ, జోగు గోపి తదితరులున్నారు.

వెంకన్న ఆలయానికి పూర్వవైభవం

రాయపర్తి, వెలుగు: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని పంచాయతీ రాజ్​శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆఫీసర్లను ఆదేశించారు. ఆలయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.10 కోట్లు కేటాయించిన క్రమంలో ఆదివారం జిల్లా కలెక్టర్ గోపితో ఆలయ అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. ఆలయంలో స్వామి వారు నిత్యం పూజలు అందుకునేలా, భక్తులు తరలివచ్చేలా ఆలయాన్ని డెవలప్​ చేయాలన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. ప్రభుత్వ నిధులతో ఆలయ ప్రాంగణంలో ప్రకారాలు, మాడవీధులు, కోనేరు, శివాలయం లైటింగ్, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు హరిసింగ్, శ్రీవాత్సవ, ఎండోమెంట్ అసిస్టెంట్​కమిషనర్ సునీత, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.